హాస్యనటులకు ఓ మహా చెడ్డలవాటు ఉంది. మంచి పామ్‌లో ఉండగానే హీరో అయిపోదామనో, డైరెక్టర్ ఛైర్లో కూర్చుండిపోదామనో అనిపిస్తుంటుంది. చాలా మంది ఆ ముచ్చట తీర్చుకొన్నారు కూడా. ఇప్పుడు సప్తగిరి కూడా అదే బాట పట్టాడు. కమిడియన్‌గా దూసుకుపోతున్న సప్తగిరి కాస్త రూటు మార్చి, హీరో అయిపోయాడు. ఆ సినిమాకి సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అనే పేరు పెట్టారిప్పుడు. అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ కూడా గప్ చుప్‌గా పూర్తయ్యింది. తమిళంలో మంచి విజయాన్ని అందుకొన్న తిరుడన్ పోలీస్‌కి ఇది రీమేక్. ఓ విశేషం ఏమిటంటే.. ఈసినిమా స్ర్కిప్టు స్వయంగా సప్తగిరి రాసుకొన్నాడట. స్ర్కిప్టు మొత్తం పూర్తయ్యాక దర్శకుడు అరుణ్ పవార్‌ని పిలిచి అతని చేతిలో పెట్టాడట. అంతేకాదు.. దర్శకత్వ విభాగంలోనూ విచ్చలవిడిగా వేళ్లు పెట్టాడని, ఈ సినిమా మొత్తాన్ని తానే ముందుండి నడిపించాడని టాక్.
సప్తగిరి డైరక్షన్ అంటే నమ్మబుల్ విషయమే. ఎందుకంటే అతనికి సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. నిజానికి దర్శకుడు అవుదామనే ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టాడు సప్తగిరి. అనుకోకుండా నటుడై..ఇప్పుడు కావాలనే హీరో అయ్యాడు. ఈ సినిమాకి డైరెక్టర్‌గానూ తన పేరు వేసుకొనేవాడే. కానీ… ఫలితం తేడా కొడితే, ఆ ప్రభావం కెరీర్‌పై పడుతుంది. అందుకే ఆ పోస్టుకు ఇంకొకర్ని వెదికి పట్టుకొన్నాడు. ఈ సినిమాలో సప్తగిరి ఓ కామెడీ పోలీస్‌గా కనిపించబోతున్నాడు. ఇంతకీ ఈ సినిమాలో సప్తగిరి క్యారెక్టర్ ఏమిటో తెలుసా?? కాటమరాయుడు. పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకేం.. వపన్ ఫ్యాన్స్‌ని ఇట్టే ఆకట్టుకోవడానికి మంచి ఎత్తే వేశాడు. ఈ సినిమాతో సప్తగిరి ఇంకెన్ని ఎత్తులు ఎక్కుతాడో చూడాలి.