తమిళంలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకొన్నాడు శరత్ కుమార్. తెలుగులో గ్యాంగ్ లీడర్, బన్నీలాంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తమిళ రాజకీయాల్లో శరత్ కుమార్ పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇప్పుడాయన తెలుగులో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సాయిరాం శంకర్‌తో కలసి ‘నేనో రకం’ చిత్రంలో నటించాడు శరత్ కుమార్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శరత్ కుమార్ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా చిరంజీవితో తనకున్న అనుబంధం గుర్తు చేసుకొన్నాడు. చిరంజీవి తనకు చాలా స్పెషల్ అంటున్న శరత్ కుమార్… అందుకు గల కారణాన్ని కూడా వివరించాడు.
”నేను కొన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవిగారిని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనుకుని, ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిశాను. ఆయనకు అసలు విషయం చెప్పగానే..దీనికి ఇంత దూరం రావాలరా?? అన్నారు. మీ రెమ్యునరేషన్ ఎంతండి?? అని అంటే..నాకు నువ్వు రెమ్యునరేషన్ ఇస్తావా రా….? అని కోపగించుకొన్నారు. నువ్వు నన్ను హెల్ప్ అడిగావ్..ముందు సినిమా చెయ్..తర్వాత అన్నీ చూసుకుందాం..అన్నారు. అప్పుడు ఆయన అన్నమాటలను నేనింకా మరచిపోలేను. అందుకే నాకు చిరంజీవి ఎప్పుడూ స్పెషలే” అంటున్నాడు. ఖైదీ నంబర్ 150లో ఓ చిన్న సీన్లో అయినా నటిస్తానని చిరంజీవిని, వినాయక్నీ అడిగాడట శరత్ కుమార్. కానీ.. ఆ అవకాశం రాలేదు. అయితే చిరు సినిమాలో అవకాశం వస్తే చిన్న పాత్రలో అయినా నటించడానికి సిద్ధమే అంటున్నాడీ ఒకప్పటి యాక్షన్ హీరో.