స‌రిలేరు Vs వైకుంఠ‌పురం.. భ‌లే పోటీ

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు ఢీ కొట్ట‌బోతున్నాయి.
జ‌న‌వ‌రి 9న ద‌ర్బార్‌
11న స‌రిలేరు నీకెవ్వ‌రు
12న అల వైకుంఠ‌పురములో
15న ఎంత మంచి వాడ‌వురా – విడుద‌ల‌కు ‘సై’ అంటున్నాయి.
మిగిలిన రెండు సినిమాల్నీ ప‌క్క‌న పెడితే స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పురములో సినిమాల మ‌ధ్య మాత్రం బీభ‌త్స‌మైన పోటీ నెల‌కొంది. రెండూ ముందు 12నే వ‌స్తాన‌న్నాయి. కానీ స‌రిలేరు నీకెవ్వ‌రు కాస్త వెన‌క్కి త‌గ్గ‌డంతో, రెండిటి మ‌ధ్య ఒక‌రోజు గ్యాప్ వ‌చ్చింది. నిజానికి ఈ గ్యాప్ చాలా చిన్న‌ది. స‌రిలేరుకి సూప‌ర్ హిట్ టాక్ వ‌స్తే – బ‌న్నీ సినిమాపై ఒత్తిడి పెరుగుతుంది. రెండు సినిమాల్నీ పోల్చి చూసుకుంటారు. స‌రిలేరు కాస్త అటూ ఇటూ అయితే.. బ‌న్నీ సినిమాకి ప్ల‌స్ అవుతుంది. ఈ రెండూ బాగా ఆడాల‌న్న‌ది సినీ అభిమానుల కోరిక‌. అదే జ‌రిగితే… ఈ సంక్రాంతికి బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కుర‌వ‌డం త‌థ్యం.

ప్ర‌చారం విష‌యంలో నిన్న‌టి వ‌ర‌కూ అల వైకుంఠ‌పురం ముందుంది. ఇప్ప‌టికే ఓ చిన్న టీజ‌ర్‌, మూడు పాట‌లూ వ‌చ్చేశాయి. పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. బ‌న్నీ స్పీడు చూసి ‘మ‌హేష్ ఇంకా మొద‌లెట్డ‌డా’ అనిపించింది. కానీ.. ఒకే ఒక్క టీజ‌ర్‌తో ఈ రేసులో బ‌న్నీ సినిమా కంటే ముందుకు దూసుకుపోయాడు మ‌హేష్‌. యూట్యూబ్‌లో ‘సరిలేరు..’ టీజ‌ర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ మ‌ధ్య‌కాలంలో ఓ టీజ‌ర్‌కి ఇంత స్పంద‌న రావ‌డం ఇదే తొలిసారి. ఏ పెద్ద సినిమా టీజ‌ర్ విడుద‌ల చేసినా.. ఎక్క‌డో ఓ చోట చిన్న అసంతృప్త‌యినా క‌లుగుతుంది. ఊరించి ఊరించి ‘ఇంతేనా… ‘ అని ఉస్సూరుమ‌నిపించిన టీజ‌ర్లు చాలా ఉన్నాయి. కానీ.. స‌రిలేరు మాత్రం టీజ‌ర్‌తోనే షేక్ చేసేసింది.

ఇప్పుడు త‌ప్ప‌కుండా బ‌న్నీ సినిమాపై ఒత్తిడి పెరుగుతుంది. ఎవ‌రు ఔన‌న్నా, కాద‌న్నా ‘స‌రిలేరు’ని దృష్టి లో ఉంచుకునే టీజ‌ర్ క‌ట్ చేయాల్సిన ప‌రిస్థితి. వీలైన‌న్ని పంచ్‌లూ, హీరోయిజం ఎలివేష‌న్లు, ఎమోష‌న్ ట‌ర్న్‌లూ… ఇవ‌న్నీ చూపించి ఆక‌ట్టుకోవాల్సిన బాధ్య‌త త్రివిక్ర‌మ్‌పైనే. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌మోష‌న్‌లో బ‌న్నీ సినిమాదే పై చేయి. ఇప్పుడు మ‌హేష్ వంతు వ‌చ్చింది. దాన్ని దాటుకుని, అంద‌రి దృష్టినీ త‌మ వైపుకు తిప్పుకోవ‌డం అల్లు అర్జున్ టీమ్ చేయాల్సిన ప‌ని. పైగా గంట‌కో కొత్త రికార్డుల్ని ప్ర‌క‌టిస్తూ.. యూ ట్యూబ్‌ని షేక్ చేసేస్తోంది మ‌హేష్ పీఆర్ టీమ్. ఈ పోటీని అల్లు అండ్ కో ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com