ఈవారం బాక్సాఫీసు ముందుకు రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకటి.. ‘భైరవం’. మరోటి ‘షష్టిపూర్తి’. భైరవం ముగ్గురు హీరోల మల్టీస్టారర్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించారు. ఓ తమిళ సినిమాకు ఇది రీమేక్. అయినా సరే, కథలో చాలా మార్పులు చేర్పులూ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్‌లా ఉండదని, స్ట్రయిట్ సినిమాలా ఉంటుందని హీరోలు, దర్శకుడు ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. చివర్లో `కాంతార` వైబ్స్ కనిపించబోతున్నాయట. ఎమోషనల్ టచ్‌తో పాటు, దైవత్వానికి సంబంధించిన అంశాలు కూడా క్లైమాక్స్ లో ఉంటాయని తెలుస్తోంది. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన గతంలో వేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఓ వర్గానికి కోపం తెప్పించాయి. దాంతో ‘బాయ్ కాట్ భైరవం’ ట్రెండ్ మొదలైంది. అది ఈ సినిమాకి కాస్తో కూస్తో పబ్లిసిటీని అదనంగా తీసుకొచ్చింది కూడా.
ఈవారం వస్తున్న మరో సినిమా ‘షష్టిపూర్తి’. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. రూపేష్ హీరోగా నటిస్తూ నిర్మించారు. మంచి ఫ్యామిలీ వైబ్ ఉన్న టైటిల్ ఇది. అయితే టీజర్, ట్రైలర్ లో యాక్షన్ కూడా కనిపించింది. ఎమోషన్స్‌కి పెద్ద పీట వేశామని చిత్రబృందం చెబుతోంది. ఇళయరాజా అందించిన పాటలు, రాజేంద్రప్రసాద్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకులు మెచ్చేది ఏదో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.