నందమూరి అభిమానులకు శుభవార్త. వచ్చే నెలలో వాళ్లందరికీ పండగలే పండగలు. అన్నీ గౌతమి పుత్ర శాతకర్ణి ఉత్సవాలే. బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రమిది. షూటింగ్ తుది దశకు చేరుకొంది. డిసెంబరులో ప్రమోషన్ కార్యక్రమాల్ని ఉదృతం చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఆడియో రిలీజ్రోజున ట్రైలర్‌ని రిలీజ్ చేయడం.. ఆనవాయితీ. అయితే ఆడియో ఫంక్షన్ కంటే ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తోంది శాతకర్ణి టీమ్. ఈ రెండు వేడుకలకూ ముహూర్తాలు కూడా ఖరారైపోయాయి. డిసెంబరు 9న ట్రైలర్‌నీ, 16న పాటల్నీ విడుదల చేయనున్నారు. ట్రైలర్‌ని ప్రపంచ వ్యాప్తంగా 100 థియేటర్లలో ఒకేసారి ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్ విశాఖపట్నం, తిరుపతిలలో ఏదో ఓ చోట నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఎక్కడ చేయాలన్నది బాలయ్య నిర్ణయిస్తారని సమాచారం.
ఆడియో ఫంక్షన్‌ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిథిగా రాబోతున్నారు. ట్రైలర్‌ని ఇప్పటికే కట్ చేసి రెడీగా ఉంచాడు క్రిష్. ఆఖరి నిమిషాల్లో చిన్న చిన్న మార్పులు చేయాలనుకొంటే తప్ప 2 నిమిషాల 30 సెకన్ల ట్రైలర్ ప్రదర్శించడానికి రెడీగా ఉంది. ఈ ఆల్బమ్‌లో ఆరు పాటలున్నాయని టాక్. కంచె సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.