సెటైర్: గొలుసుదొంగ గోడు

ఫేక్ న్యూస్ ఛానెల్ టివీ త్రిబుల్ నైన్ స్టూడియోలోకి గొలుసుదొంగ ప్రవేశించాడు. తనకుతానుగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంతే, అదో సంచలనం. టివీ స్క్రీన్ మీద –

గొలుసుదొంగ నాయకునితో ముఖాముఖి…
`గొలుసుదొంగ గోడు’ మరి కాసేపట్లో…అంటూ అనౌన్స్ మెంట్ కనబడింది.

ఆ టైమ్ కాస్తా వచ్చేసింది. యాంకర్ నాగ్ ఠీవీగా కూర్చుని ఉన్నాడు. ఆతని ఎదురుగా నల్లటి ముసుగులోఉన్న గొలుసుదొంగల నాయకుడు కూడా అంతే ఠీవీగా కూర్చుని ఉన్నాడు. నాగ్ ఓసారి తన మెడవద్ద సవరించుకున్నాడు. `హమ్మయ్యా, పొరపాటు చేయలేదు…’ అనుకున్నాడు. అలా అనుకోవడం ఇది పదోసారి. ఎందుకైనా మంచిదని మేకప్ రూమ్ లోనే లావుపాటి గోల్డ్ ఛైన్ ని సొరుగులో పెట్టి మరీ వచ్చాడు ఇంటర్వ్యూకి.

పీసీఆర్ (ప్లే కంట్రోల్ రూమ్) నుంచి సంకేతం అందుకోగానే, నాగ్ గొంతు సవరించుకుని ప్రొగ్రామ్ స్టార్ట్ చేశాడు.

యాంకర్ నాగ్ : హైదరాబాద్ లో చెలరేగిపోయిన ఛెయిన్ స్నాచర్స్ గుట్టు తెలిసిపోయింది. టివీ త్రిబుల్ నైన్ ఆఫీస్ కు తనకుతానుగా వచ్చి లొంగిపోయిన గొలుసుదొంగల నాయకుడు ఇప్పుడు మనముందున్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గొలుసుదొంగ గారూ…

గొలుసు దొంగ : (కరకు కంఠంతో) ఛత్… నువ్వేం యాంకరవయ్యా ? నాకు ఊరూ పేరు లేదనుకున్నావా, హాయ్…

నాగ్ : (భయంతో చమటలు పట్టేశాయ్) గొలుసు దొంగగారూ, నా ఉద్దేశం అదికాదండీ, సారీ, ఇప్పుడు చెప్పండి మీ పేరు?

గొలుసుదొంగ : అదీ, అలారా దారికి. నన్నంతా ఛైన్ ఛవాన్ అంటారు.

నాగ్ : అంటే మీరు తెలుగురాష్ట్రాలకు చెందినవారు కారా !

గొలుసుదొంగ : కాదు, మా ముఠా అంతా ఉత్తరాది నుంచి వచ్చింది. ఢిల్లీ, హర్యానా..ఇంకా చాలాచోట్లనుంచి వచ్చాం. పనిపూర్తికాగానే వెళ్ళిపోతాం.

నాగ్ : మరి, గొలుసుదొంగ గారూ…సారీ ఛైన్ ఛవాన్ గారూ, మీరు తెలుగు ఇంతబాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ?

గొలుసుదొంగ : (నవ్వుతూ) కదా.. మీ టివీ యాంకర్లకంటే నేనే బాగా మాట్లాడుతున్నాను కదా, హ్హీహ్హీహ్హీ.. అదే మా స్పెషాలిటీ. మేము ఏ రాష్ట్రంలోకి ప్రవేశించాలనుకుంటామో, అక్కడి భాషను ముందుగా అధ్యయనం చేస్తాం. ఇందుకోసం నెలరోజుల్లో భాషనునేర్పే పండితుల వద్ద ప్రత్యేకంగా శిక్షణపొందుతాం.

నాగ్ : మరి దీనికి ఖర్చవుతుందికదా..

గొలుసుదొంగ : అవును, ఖర్చవుతుంది. ముఠాలోని వాళ్లకందరికీ భాష నేర్పించడంకోసం వేలకువేలు ఖర్చుపెడుతున్నాం.

నాగ్ : పైగా ఛెయిన్ స్నాచింగ్ కోసం మీరు ఓ పెద్ద వ్యాన్, సరికొత్త మోటార్ వెహికల్స్ కూడా వాడుతున్నారట కదా. ఇది కూడా ఖర్చేగా ?

గొలుసుదొంగ : అదే మా బాధ. మా కష్టాలు ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి ఇంతకష్టపడి వస్తే చివరకు మాకు పడింది ఓ పెద్ద బొక్క.

నాగ్ : (ఆశ్చర్యపోతూ) అదేంటీ, నిన్న ఒక్క రోజున హైదరాబాద్ పరిధిలో 11చోట్ల ఛైన్లు లాగేశారుకదా. మరి బొక్కంటావేంటీ ?

గొలుసుదొంగ : మరీ అదే… మీ అందరి దిష్టి మాకు బాగా తగిలింది. పదకొండు ఛైన్లు గుంజేశామనుకుంటున్నారేకానీ, మాకెంత నష్టం కలిగిందో మీరు అర్థంచేసుకోవడంలేదు. నిన్న లాగేసిన ఛైన్లు, అంతకు ముందు గుంజేసిన ఛైన్లు అన్నీ నకిలీవే. అరే ….! మేమెంత ప్లాన్ చేసుకున్నాం. ముఠాలో చేర్చుకునే కొత్తవాళ్లకు ఎంతో ఖర్చుపెట్టి శిక్షణ ఇప్పించాము. మోటార్ సైకిల్ విడిపార్ట్స్ కొట్టేసి మా కార్ఖానాలో ఫిట్టింగ్ చేయించాము. ట్యాంకుల నిండా పెట్రోల్ కొట్టించాము, ల్యాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండకూడదని ట్రైనింగ్ ఇప్పించాం… పైగా ముఠాలోని ప్రతిఒక్కరికీ నల్లటి ముసుగు డ్రెస్సులూ, వారికి తిండీ, మందు..ఒకటేమిటీ మొత్తం కలిపి లక్షల్లో ఖర్చుపెట్టాం. తీరా మాకు మిగిలిందేమిటీ… పెద్ద బొక్క… (ఏడుస్తూ) ఆవ్..వ్వావ్వా..ఆ..

నాగ్ : (ఓదార్పుగా) ఏడవకండి ఛైన్ ఛవాన్ గారు. మీరుపడ్డ కష్టం తలుచుకుంటే నాకే బాధేస్తోంది. ఇప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు ?

గొలుసుదొంగ : (కోపంగా) మాకు ఎక్కడ కాలాలో అక్కడ కాలుతోంది. మాలాంటి ముఠాలు దేశంలో చాలానే ఉన్నాయి. వారందరి పరిస్థితి కూడా ఇంతే. అందుకే ఈమధ్య మేమంతా అడవుల్లో రహస్య సమాలోచనలు పెట్టుకుని కొన్ని తీర్మానాలు పాస్ చేశాం.

నాగ్ : (ఉత్సాహంగా) తీర్మానాలా… బాగుంది…బాగుంది. చెప్పండి. అవేమిటీ ?

గొలుసుదొంగ : ప్రభుత్వం మా కష్టాలు గమనించి మాకు ఊరటకలిగించాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా మా ప్రయత్నాలు విఫలమైతే నష్టపరిహారం ఇవ్వాలి. ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు నకిలీ ఛైన్లు, వన్ గ్రామ్ గోల్డు నగలు తగిలించుకుని బయటతిరగడం మానుకోవాలి. వన్ గ్రాముఏదో, టెన్ గ్రామ్స్ ఛైనేదో తెలియక మేము ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యలను అధిగమించడానికి మేం ఉద్యమించబోతున్నాం.

నాగ్ : ఉద్యమించబోతున్నారా !

గొలుసుదొంగ : అవును, త్వరలోనే మా ముఠాలన్నీ కలిసిపోయి ఐక్య గొలుసుదొంగల సంఘంగా మారబోతున్నాం. మా ఐక్యతను చాటుకుంటూ వివిధ నగరాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు పెట్టబోతున్నాం. అవసరమైతే ఛలో పార్లమెంట్, ఛలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలను చేపట్టి ఉద్యమానికి తీవ్రరూపం ఇస్తాం.

నాగ్ : (తన టీవీ బుద్ది పోనిచ్చుకోక) మరి, ఉద్రిక్తత, ఉత్కంఠ, తొక్కిసలాట.. సెల్ టవర్స్ ఎక్కడాలు ఉంటాయా ?

గొలుసుదొంగ : (నవ్వేస్తూ) మీ మీడియాను మేము మరచిపోవడంలేదు. ప్రతిరోజూ ఉద్రిక్త వాతావరణం, ఉత్కంఠ కలిగించే వార్తలు, తొక్కిసలాటలు ఉండేలా చూస్తాం. ఇక మావాళ్లు సెల్ టవర్స్, చెట్లు, ఎత్తైన భవనాలు ఎక్కేస్తూ ఆత్మహత్య చేసుకుంటామంటూ డ్రామాలు నడుపుతారు. ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య పెరిగిపోతున్నట్టు ఏరోజుకారోజు మీకు లెక్కలు పంపుతాము.

నాగ్ : (రెచ్చిపోతూ) ఓహ్..అద్భుతం. కాస్తంత ముందు మాకు లెక్కలు పంపండి. మా టివీ రేటింగ్స్ పెంచుకుంటాం. మీ ఉద్యమానికి టివీ త్రిబుల్ నైన్ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. గోలుసుదొంగల ఉద్యమం సక్సెస్ కావాలంటూ గంటగంటకూ ప్రకటనలు గుప్పిస్తాం. కొంతమందికి డబ్బులిచ్చి మీకోసం గుళ్లలో ప్రార్థనలు జరిపించేలా చూస్తాం.

గొలుసుదొంగ : ఒకే, బాగుందీ మీ ప్యాకేజీ. మా మద్దతుదారులతో నిరవధిక నిరాహారదీక్షలు చేయిస్తాం. రాస్తారొకోలు, రైల్ రొకోలు ఎలాగూ ఉంటాయి. వీటన్నింటితోపాటుగా, మాకు న్యాయం జరిపించాలని కోరుతూ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాలనుకుంటున్నాం.

నాగ్ : ఇది ఇల్లీగల్ అవుతుందేమో…

గొలుసుదొంగ : ఏదీ లీగల్, ఏది ఇల్లీగల్. మా వృత్తికి ఆటంకం కలిగించేవారిలో పరివర్తన తీసుకురావాలని కోరడం ఇల్లీగల్ ఎలా అవుతుంది? కనీసం నెలకు ఒక్క రోజైనా మహిళలు ఒరిజనల్ గోల్డ్ ఛైన్స్ వేసుకుని వీధుల్లోకి రావాలని కోరతాము.

నాగ్ : గొలుసుదొంగగారూ ఒక్క నిమిషం … నాకు ఫోన్ వచ్చింది. హలో.. ఆ…ఎంటీ !! మన ఆఫీస్ లోని వాళ్ల గొలుసులన్నీ మాయం అయ్యాయా ! స్టాఫ్ అంతా బోరున ఏడుస్తున్నారా… ఓర్నాయనో… నేను మేకప్ రూమ్ లో దాచుకున్న గొలుసు, మా అత్తగారిచ్చిన గొలుసు కూడా పోయిందా ! మొత్తం కొల్లగొట్టేశారా…

గొలుసుదొంగ : (చిద్విలాసంగా నవ్వుతూ) నేనొచ్చిన పని అయిపోయింది. ఆల్ ఇండియా ఛైన్ స్నాచర్స్ సంఘం వర్దిల్లాల్లి… (కోపంగా చూస్తూ) ఏయ్ నీకే చెప్పేది…అను `వర్ధిల్లాలి’ అని అను… అఖిల భారత గొలుసుదొంగల సంఘం వర్దిల్లాల్లి..

నాగ్ : (గొంతులో తడారిబోతుంటే.. ఏడుపు గొంతుతో) వర్థిల్లాలి… వావ్వ్…వా…ఆప్…

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు,...

పులివెందుల బాధ్యతలు భారతికి ఇచ్చిన జగన్ !

పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం...

జక్క‌న్న‌కు అంత టైమ్ ఉందా?

రాజ‌మౌళి ఈమ‌ధ్య బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఫంక్ష‌న్ల‌లో మెర‌వ‌డం చాలా త‌క్కువ‌. సినిమా వేడుక‌ల్లో చూడ‌డం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. త‌న టైమ్ అంతా మ‌హేష్ బాబు సినిమా కోస‌మే....

శ్రీ‌నువైట్ల‌… రూటు మార్చేశాడా?

కామెడీని పండించ‌డంలో శ్రీ‌నువైట్ల‌ది సెప‌రేట్ స్కూల్‌. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ గుర్తింపు వ‌చ్చింది ఎంట‌ర్‌టైన్మెంట్ సినిమాల వ‌ల్లే. 'దూకుడు' లాంటి ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన రికార్డ్ శ్రీ‌నువైట్ల‌కు ఉంది. అయితే... కొంత‌కాలంగా వైట్ల‌కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close