సెటైర్ : `పొంగల్ వైరస్’ ఎటాక్

పెద్ద పండుగ సంక్రాంతికి అత్తవారింటికి వెళ్ళివచ్చిన రామారావుకు ఆరోగ్య పరిస్థితి రానురానూ క్షీణించిపోతున్నది. అసలు అత్తవారింట్లోనే అనారోగ్య లక్షణాలు కనిపించాయి. కానీ మొహమాటం కొద్దీ రోగం దాచాడు. ఏదో కాస్త తలనొప్పిగా ఉందంటూ తలకు గుడ్డచుట్టుకుని రెస్ట్ తీసుకుంటున్నట్లు నటించాడు. ఎలాగో అలాగా భార్యా పిల్లలతో తన ఊరు వచ్చిపడ్డాడు. అప్పటి నుంచి అతగాడి పరిస్థితి మరీ క్షీణించసాగింది. ఇక లాభంలేదనుకుని ఆస్పత్రి గడపతొక్కాడు. ఎక్స్ రేలు, స్కానింగ్ లు గట్రా యథావిధిగా చేసేశారు. అప్పుడు చెప్పాడు డాక్టర్ అసలు విషయం. వినగానే భూమి కదలిపోతున్నదా అనిపించింది రామారావుకు.

రామారావుకు వచ్చింది మామూలు రోగం కానేకాదు. మాయదారి వైరస్ సోకిందట. దాని పేరు `పొంగల్ వైరస్’ అని డాక్టర్ కన్ఫర్మ్ చేసేశాడు. అక్కడితో ఆగలేదు. ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలు, ఎటాక్ అయితే రోగి లక్షణాలు వగైరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు డాక్టర్.

– పొంగల్ వైరస్ ప్రతి ఏటా వలస పక్షుల్లా సరిగా టైమ్ కి వాలిపోతాయి.

– సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే ఈ పొంగల్ వైరస్ మానవ శరీరాల్లోకి ప్రవేశిస్తున్నది.

– క్రిందటేడాది కంటే ఈ ఏడాది దీని తీవ్రత అధికంగా ఉంది. వారాంతపు సెలవులు కలిసివచ్చేలా సంక్రాంతి పండుగ వస్తే ఇది ఎక్కువగా ప్రభావం చూపుతున్నదని తేలింది. ఇప్పటికే ఈ వైరస్ ఎటాక్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల మందిదాకా అస్వస్థతకు గురైనట్లు వార్తలొస్తున్నాయి.

– ఈ వైరస్ ఎపిడిమిక్. అంటే త్వరత్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఒకరికి పుట్టె, ఇద్దరికి పుట్టె, అర్థరాత్రి పూట అందరికీ పుట్టె -అన్నట్లుగా ఉంది దీని వ్యాపకం.

– సొంత ఊరు వెళ్ళి పెద్ద పండుగ `దురద’ తీర్చుకోవాలనిపించడం ఈ వైరస్ సోకగానే కలిగే మొదటి లక్షణం.

– వెంటనే పెట్టాబేడా సర్దుకుని ఎంత ఖర్చైనా సంతోషంగా గెంతుకుంటూ వెళ్లడం రెండో లక్షణం.

– ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులవాళ్లు మూడొందల టికెట్ ని వెయ్యి రూపాయలకు పెంచినా, `ఓస్..ఇంతేనా…’ అంటూ ఎడం చేత్తో నోట్లు ఇచ్చేసి కుడిచేత్తో టికెట్ అందుకుని అదే పరమ అదృష్టమన్నట్లు ఫీలవతుంటారు.

– ఏటీఎం సెంటర్లకు వెళ్ళి ఇంట్లో ఉన్న కార్డులన్నీ వాడేసి అకౌంట్లలో డబ్బు గుంజేసి జేబుల్లో కుక్కేస్తారు.

– సొంతూర్లలో కోడిపుంజు పందాలు ఎలా జరుగుతున్నాయి, ఎంత డబ్బు తీసుకురమ్మంటావంటూ ఫోన్లలో వాకబు చేస్తుంటారు.

– సొంతూరు లేదా అత్తగారి ఊర్లో పిండివంటలు క్షణం తీరకలేకుండా తినేయడం.

– గారెలు తినడంలోనూ, బూరెలు బొక్కేయడంలోనూ ఊర్లోవాళ్లతో పోటీ పడటం.

– పట్టణంలో బాగా సంపాదించానంటూ ఫోజులిస్తూ ఫ్రెండ్స్ కీ, మరదల్లకీ, బావమరుదులకు ఏది కావాలంటే అది కొనియ్యడం. హీరో అయిపోయినట్లు ఫీలైపోవడం. సరిగా అప్పుడే వైరస్ అతగాడ్ని జీరో స్థాయికి పడేయడానికి రెడీ అవుతుంది.

– మూడు రోజు సాయంత్రానికల్లా తలనొప్పి ప్రారంభమవుతుంది.

– తిన్న గారెలు కడుపులో గుండ్రాళ్లులాగా పడిఉన్నట్లు అనిపిస్తుంది.

– బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరిగినట్లు కళ్లుతిరుగుతుంటాయి. అయినా స్వీట్ మీద వ్యామోహం తీరదు.

– అనారోగ్యం వచ్చినా తనకేమీ కాదని పైకి బుకాయించడం.

– లోలోపల మాత్రం, `పండక్కి ఎందుకొచ్చామురా, భగవంతుడా ..’ అనుకుంటూ వేదాంత ధోరణిలో పడిపోవడం.

– ఫ్యామిలీలోని అందరూ ముఖాలు వేలాడేసుకుని ఉండటం. ఉత్సాహం అణుమాత్రమైనా లేకుండా తిరిగి ఇళ్లకు చేరుకోవడం.

– `బాలెన్స్ నిల్’ అంటూ బ్యాంక్ వాళ్ల దగ్గర నుంచి ఎస్ఎంఎస్ లు రావడంతో కళ్లు బైర్లు కమ్మడం.

– కోడిపందాల్లో గెలవకపోగా ఒళ్లు గుల్లవడంతో వాస్తవ పరిస్థితి కళ్లముందు కనిపించడం.

– ఆస్పత్రి బిల్లు కట్టలేక లోన్ కోసం అప్లై చేయడం.

– ఆఫీస్ కు వెళ్ళినా పనిమీద శ్రద్ధ తగ్గిపోవడం.

– ఛత్… ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకూడదంటూ ప్రతిజ్ఞ చేయడం.

ఇలాంటివే మరికొన్ని లక్షణాలున్నాయి. ఈ వైరస్ ఎటాక్ అయితే దీన్ని పూర్తిగా శరీరం నుంచి తొలగించలేము. కేవలం ఉపశమనం కోసమే మందులు వాడతారు. శరీరంలో మిగిలిన వైరస్ శకలాలు మళ్ళీ వచ్చే ఏడాది సంక్రాంతికి మేలుకుని తన ప్రభావం చూపడం మొదలుపెడతాయి. దీంతో సంక్రాంతికి ముందు మళ్ళీ `దురద’ మొదలవుతుంది. చివరకు దూలతీరుతుంది. అందుకే పొంగల్ వైరస్ ఒకసారి ఒంట్లోకి ప్రవేశిస్తే ఇక దాన్ని జీవితకాలం భరించాల్సిందేనని అంటున్నారు డాక్టర్లు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com