సెటైర్: 2016లో ఇదీ మా స్టైల్…

నూతన సంవత్సరం (2016)లో ప్రముఖులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలా ముందుకు వెళతారో, వారి స్టైల్ ఏమిటో తెలుసుకోవాలని ఒక టివీ ఛానెల్ రిపోర్టర్ మైక్ పట్టుకుని బయలుదేరాడు. ముందుగా సినీ దర్శకుడు రాజమౌళి దగ్గరకు వెళ్లాడు.

రాజమౌళి :

నిజం చెబుతున్నానండి. మీరు చెప్పేవరకు 2015 అయిపోతున్నట్లే తెలియలేదండి. 2017లోకి అడుగుపెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అరే, అదేంటీ ! 2016 జంప్ చేశారని అడుగుతున్నారా ? 2016కని తీసుకున్న నిర్ణయం, అదేనండీ బాహుబలి -2 రిలీజ్ చేయాలన్న నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నాను. అందుకే 2016 నిర్ణయాలు ఏవీ లేవు. ఏడాది ఫార్వార్డ్ చేయండి. 2017లో బాహుబలి 2 తీసుకొస్తాను. ఏదైనా బాహుబలిని మాత్రం వదిలిపెట్టను. సినిమా పూర్తిచేసినా బాహుబలి దీక్షలు, బాహుబలి యాత్రలు, బాహుబలి యాగాలు, యజ్ఞాలంటూ ఏదో ఒకటి కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటాను. ఎందుకంటే బాహుబలి నా ప్రాణం, నా శ్వాస కదండి.

పవన్ కల్యాణ్ :

మీరిలా మైక్ పట్టుకుని లోపలకు రాకూడదు. ముందుగా ట్విట్టర్ లో అనుమతి తీసుకోవాలి. సరే, వచ్చారే అనుకోండి, 2016లో తీసుకునే నిర్ణయం ఏమిటని మీరిలా అడగేయకూడదు. నేను ఏదీ నోటితో కరెక్ట్ గా చెప్పను. నాకో లెక్కుంది. దానికో ట్విట్టర్ ఆకౌంట్ ఉంది. ఏదైనా చెప్పాలంటే ట్వీట్ చేస్తాను. మొన్నీమధ్యనే ఎన్నికల కమిషన్ వాళ్లను కలుసుకున్నాను. ట్విట్టర్లోనే ఎన్నికలు జరిపించమని అడిగాను. వారు ఒకే అంటే జనసేనును ట్విట్టర్ సేనగా మార్చేస్తాను. నాకు బయట రాజకీయాలకంటే ట్విట్టర్ రాజకీయాలే ఇష్టం. ఇప్పటికే ఎక్కువగా మాట్లాడాను. ఇంకో నాలుగు నెలల దాకా మాట్లాడను. ట్వీట్ చేసే సమయం అయింది. బై..

అమితాబ్ బచ్చన్ :

ఏడు పదుల కుర్రాడ్ని. అహ్హహ్హా…అదేమిటో, నా వయసు ఏడాదికేడాది తగ్గుతోంది. దానికి కారణం సెల్ఫీలే. ఏ సత్యహై.. ఈ సెల్ఫీలు వచ్చాక నాలో ఉత్సాహం ఎక్కువైంది. 2015 గుడ్ బై సెల్ఫీ పెట్టేశాను, 2016 వెల్ కమ్ సెల్ఫీ పెడుతున్నాను. చూస్తూనే ఉండండి నా ట్విట్టర్ అకౌంట్.

తామన్నా :

మీరు అడిగారు కనుక చెబుతున్నాను. ఇది ఎవ్వరితోనూ చెప్పలేదు. ఏ పత్రికకు ఇవ్వలేదు. ముఖ్యంగా తమిళ పత్రికల వాళ్లకు. ఈ మధ్య ఓ తమిళ పత్రిక నేను ఇవ్వని ఇంటర్వ్యూని వేశారుగా అందుకనే వాళ్లంటే నాకు కోపం. సరే, కొత్త సంవత్సరంలో నా నిర్ణయం ఏమంటే, కాస్తంత రంగు తగ్గించుకోవడం. అదేంటని ఆశ్చర్యపోతున్నారా ? లేకపోతే ఏమిటండీ, `మిల్కీ బ్యూటీ…మిల్కీ బ్యూటీ’ అంటూ పైకి మెచ్చుకుంటూనే, పక్కకు వెళ్ళి, `ఏమిటో ఈ అమ్మాయి గోడకు కొట్టిన తెల్ల సున్నంలా ఉంది..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే కాస్తంత రంగుతగ్గించుకోవాలనుకుంటున్నా. రంగు తగ్గిన తమన్నాను చూసేందుకు మీరు రెడీగా ఉండండి.

చంద్రబాబు :

చెప్పడానికి ఏమీ ఉండదు. అంతా కలసికట్టుగా ముందుకుపోవడమే, ఏం తమ్ముళ్లూ,మరి మీరు సిద్ధమేనా ? ఆ విధంగా, నాతో వచ్చేవాళ్లు చేతులు ఎత్తండి. ఆ మాదిరిగా చూస్తే, 2015లో చాలావాటికి శంకుస్థాపనలు చేశాము. కొత్త సంవత్సరంలో కూడా అలాగే చేస్తాము. 2019 దాకా శంకుస్థాపనలతోనే ముందుకుపోతాం, మళ్ళీ గెలిపిస్తే ప్రారంభోత్సవాల దగ్గరకు వెళతాము. జై తెలుగుదేశం. జైజై తెలుగుదేశం.

కేసీఆర్ :

ఎవరేం జెప్పినా పట్టించుకునే ప్రశ్నేలేదు. నేనేమన్నా హవలాగాడ్నననుకున్నార. మీ జేబులో డబ్బు ఇస్తున్నార, లేదె, నా సొంత డబ్బుతో యాగాలు చేస్తున్న. కేసీఆర్ చేస్తున్న` యాగాలు పార్ట్ 1′ మీరిప్పటిదాకా చూశారు. పార్ట్ -2 కోసం రెడీగా ఉండండి. ఈ కొత్త సంవత్సరంలో కూడా నీనింతే. ఏ బద్మాష్ గాడు అడ్డం వస్తాడొ చూస్త. నా తెలంగాణ మంచిగుండాల, ఇప్పుడు అయుత చండీయాగం చేస్తి. అప్పుడె ఈ యాగాలు అవల. ఇంకా చాల యాగాలు మిగిలె ఉన్నాయ్. నియుత, ప్రయుత, అర్బుద, మయర్బుద, పరర్థ, అంత…. ఇలా ఎన్నో యాగాలు ముందుముందు చేస్త. అమ్మదయ నాకు మస్తుగుంది. ఎంతటి వాడైనా సరే నా దగ్గరకు రావాలంటే భయపడాల. యుగపురుషుడ్ని కాకపోయినా `యాగ పురుషుడ్ని’ అవ్వాలనుకుంటున్న. ఈ ప్రతిపక్షాల వారికి ఏం పనిలె, విమర్శిస్తునె ఉంటరు. ఎవ్వరేమన్న అంటే నేనూరుకుంటాన, వారి తాటతీస్త, డోలు కడత, బొంద పెడ్త, లొల్లి చేస్త… అరె ! నువ్వెందుకలా దౌడ్ తీస్తావ్, ఇంకా అసలు మచ్చట్లు చెప్పలె.

నరేంద్ర మోదీ :

2016లో నిర్ణయాలా… `లోకం చుట్టిన వీరుడు’గా పేరుతెచ్చుకోవాలనుకుంటున్నాను. నూతన సంవత్సరంలో మరో 20 దేశాలు కవర్ చేద్దామనుకుంటున్నా. ఎక్కడకు వెళ్ళినా మన భారతదేశం మట్టి తీసుకెళ్ళి వాళ్లకు ఇద్దామనుకుంటున్నా. ఈ విషయంలో చంద్రబాబు మంచి ఐడియా ఇచ్చాడు. ప్రతి దేశంలో `మన మట్టి, మన నీరు ఉండటం’ వల్ల చిటికీమాటికీ వేరే దాశాలకెళుతున్నాడన్న అపవాదు తొలిగిపోతుంది. ఏ దేశమెల్లినా మన దేశ మట్టి, నీరే ఉంటాయి కనుక నేను నా మాత్రుదేశంలో ఉన్నట్లే లెక్క. ఇలాంటి లెక్కల లాజిక్కులు, మ్యాజిక్కులు నాకూ, చంద్రబాబుకు చాలానే తెలుసు.

రాంగోపాల్ వర్మ :

2015లో ఏం చేశానో, 2016లోనూ అదే చేస్తాను. ఆకలేస్తే తింటాను. నిద్రవస్తే పడుకుంటాను. సినిమా తీయాలనిపిస్తే తీస్తా, మీకు చూడాలనిపిస్తే చూడండి. శ్రీదేవి మీద ప్రేమను మాత్రం 2016లోనూ కొనసాగిస్తా.

మంచు లక్ష్మీ :

నా దగ్గరకెందుకు వచ్చారు. మీకేం పనిలేదా ? అవసరమైతే నేనే మీడియా దగ్గరకు వస్తాను. అంతేకానీ, మీడియావాళ్లు రావడం నాకు నచ్చదు. పైగా నేను రెండు రోజుల నుంచి అన్నం తినడంలేదు. మా నాన్న మోహన్ బాబుగారు టివీల్లో నాకు కోపం ఎక్కువని చెప్పారు. దీంతో నాకు కోపంవచ్చేసింది. ప్రస్తుతానికి మొండికేశాను. నో రైస్. అంతే. అన్నం తినడం లేదన్నానేగానీ, పిజ్జా, బర్గర్ లు తినడంలేదని అన్నానా….హ్హాహ్హాహ్హా… ఇంకాసేపు ఆగితే తిడతాను. నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడే వెళ్ళిపోండి. దటీజ్ మంచు. కరిగితే మంచు, కరగకపోతే కంచు.

జగన్ మోహన్ రెడ్డి :

నూతన సంవత్సరం సందర్బంగా 2016లో నిరాహార దీక్షలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఎప్పుడు నిరాహార దీక్ష చేబట్టినా అపోహలొస్తున్నాయి. ఎన్నిరోజులు నిరాహారంగా ఉన్నా, ఈ జగన్ హుషారుగానే ఉంటారంటూ విమర్శిస్తున్నారు. హుషారుగా ఉండటం కూడా తప్పనే అంటున్నారు. నేను ఒక్కమాట అడుగుతున్నానూ…నేను దీక్షలో కూర్చుంటే నా బెడ్ చుట్టూ ఏరకమైన ఆహారపదార్ధాలున్నాయో చూడటమేనా ఈ అధికార పార్టీ పని. బిస్కెట్ ప్యాకెట్టో, బ్రెడ్డో దొరికితే నానా గొడవ చేస్తున్నారు. పైగా వారంటారూ.. నిరశన దీక్షలో కూర్చునే మిగతావాళ్లలాగా షుగర్ లెవల్స్ పడిపోవడంలేదట, నీరసం రావడంలేదట… గిట్టనివాళ్లు నా దీక్షలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఎంత వరకు ఓపిక ఉంటుందన్నది వీరే నిర్ణయిస్తారా, పైగా, దీక్షా శిబిరం దగ్గర్లో మల్టీ పర్పస్ వ్యాన్లు ఉండకూడదంట. అలా అయితే నాకు కష్టం. దీని గురించి గవర్నర్ ని కలుసుకుని మాట్లాడతాను. అందుకే ఈ కొత్త సంవత్సరం నో నిరశన దీక్షలు. ఓన్లీ ఓదార్పు యాత్రలు. ఇందులో నేనే ఎక్సపర్ట్ ని.

రామోజీ రావు :

వయసులో ఉన్నప్పుడు నాస్తికుడ్ని. కానీ ఇప్పుడు ఆస్తికుడ్ని అయిపోయా. `ఈనాడు’ పెట్టిన కొత్తల్లో రాశిఫలాలు లేవు, వినాయక చవితి పూజా పుస్తకం లేదు. కానీ ఇప్పుడు అలా కాదు, అవన్నీ వచ్చేశాయ్. ఈ మధ్య దేవుడు కలలో కనిపిస్తున్నాడు. ఆధ్యాత్మిక కేంద్రం కట్టమంటున్నాడు. చేసిన తప్పులు దిద్దుకోమంటున్నాడు. అందుకే కేసీఆర్ చండీయాగానికి పిలవగానే వెళ్ళాను. ఆధ్యాత్మిక కేంద్రం కట్టాక, అక్కడే ఉందామనుకుంటున్నాను. రామోజీరావుగా కాదు, రామోజీ స్వామిగా.

కేజ్రీవాల్ :

నా ఢిల్లీ ప్రజలకు హ్యాపీ న్యూఇయర్ చెబుదామనుకుంటే ఎవ్వరూ నా మాట వినడంలేదు. నన్ను చూడగానే తలుపులు బిగిస్తున్నారు. అందరికీ గుర్రుగా ఉంది. `ఆడ్ అండ్ ఈవెన్’ కారు వాడకం పద్దతి నా ప్రజలకు నచ్చినట్లులేదు. అయినా నేను ఎవ్వరిమాట వినను. ఏది నచ్చితే అదే చేస్తాడీ మప్లర్ మ్యాన్. కార్ల వ్యవహారం తేలినతర్వాత ఢిల్లీ జనభాపై ఓ పట్టుపడతా. ఏనీ డౌట్.

చిరంజీవి :

సినిమాలు, రాజకీయాలు నాకు రెండు కళ్లలాంటివి. ఒక కన్ను మూస్తే, మరో కన్ను తెరుచుకుంటుంది. రెండు కళ్ల మధ్య సమన్వయం ఉండదు. అలాగే కాళ్లు కూడా. నాలుగడుగులు ముందుకువేస్తే, రెండడుగులు వెనక్కి వెళుతుంటాయి. రాజకీయాల గురించి చెప్పేదేముంది. ఆ కన్ను మూసుకుపోయింది. అలా అని సినిమాల కన్ను తెరవలేకపోతున్నాను. చివరకు ఏమవుతుందో ఏమో… 150 సినిమాకు మంచి హీరోయిన్ దొరకాలి. ఎంతో మంది రెడీగా ఉన్నారు. కానీ హీరోయిన్ ప్రాబ్లం అలాగే ఉంది.

బాలకృష్ణ :

ఆఁ, 2015 …మరి, నిర్ణయాలంటే…అదే మరి.. 2016లో నిర్ణయాలంటే, మరి నా అభిమానులు, నన్నూ…ఆఁ మరి, మనవడు దేవాన్ష్ హీరో అవుతాడు. నాన్నగారి దీవెనలు.. మరి నేను హీరోగానే ఉంటాను, ఆ దేవుడి ఆశీస్సులు… మరి ఇక నేను సెలవు తీసుకుంటున్నాను.

రోజా :

ఐరెన్ లెగ్ అంటారు. ఎక్కడండీ, జబర్దస్తీ ఎపిసోడ్లు 150 దాటలేదా. అక్కడ ఏనాడైనా కోపంగా చూశారా నన్ను. మరి ఆయనగారి మొహం చూస్తే చాలు ఒళ్లు మండుతుంది. నోటికి దురద ఎక్కువవుతోంది. అదేంటో పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటా. మీరలా చూస్తుండండి, జగన్ గారిచేత గోల్డెన్ లెగ్ అనిపించుకుంటా. హ్హాహ్హాహ్హా… చూశారా ఎలా నవ్వేస్తానో… దటీజ్ రోజా.

(వివిధ రంగాల్లోని ప్రముఖులు తీసుకున్న ఈ నిర్ణయాలు కేవలం సరదాగా నవ్వుకోవడం కోసమే, హర్ట్ చేయడం కోసం కాదని మనవి)

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఓటర్ సర్వే : కేసీఆర్ కన్నా జగన్ పాపులారిటీనే చాలా..చాలా ఎక్కువ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా... ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పాపులర్. ఈ విషయాన్ని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాల పనితీరుపై ఈ సంస్థ...

శ్రీవారి దర్శనం రోజుకు ఐదు వేల మందికే..!?

తిరుమల గతంలోలా భక్తులతో కళకళలాడటం సాధ్యమేనా..? ఒక్కో భక్తుని ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. రోజుకు పదివేల మందికి అయినా దర్శనం చేయించగలరా..? లఘు దర్శనం..మహా లఘ దర్శనం...

ఎనిమిదో తేదీ నుంచే అమరావతి రైతుల “మరో పోరాటం”..!

అమరావతి రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ...ప్రత్యక్ష ఉద్యమాలకు దూరంగా ఉన్న రైతులు.. మధ్యలో భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకున్న...

సర్కారు వారి లాయర్లకు పిటిషన్లు వేయడం కూడా రాదా..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంలోనూ తడబడింది. తీర్పు వచ్చిన మూడు రోజుల తర్వాత..స్టే కోరుతూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్...

HOT NEWS

[X] Close
[X] Close