సెటైర్: ప్రేతమే ఉత్తమ ప్రేక్షకుడు

ఫేక్ న్యూస్ ఛానెల్ టివీ 999 ప్రారంభించి మూడేళ్లయిన సందర్భంగా ఉత్తమ ప్రేక్షకుడు ఎవరో గుర్తించి అవార్డు ఇచ్చే కార్యక్రమం మొదలైంది.

యాంకర్ నాగ్ : ప్రేక్షకులంతా ఈ ప్రొగ్రామ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా..అని ఎదురుచూస్తుంటారని నాకు తెలుసు. హిహ్హీహ్హీ… మూడేళ్ల ప్రస్తానంలో మాతోపాటు తనకళ్లు, చెవులు మాకే అప్పగించిన ఉత్తమ ప్రేక్షకుడు ఎవరో పసిగట్టే ప్రయత్నం జరుగుతోంది. మరికాసేపట్లోనే ఆ ప్రేక్షకుణ్ణి గుర్తించి అవార్డు అందజేస్తాం. దీనికి సంబంధించిన వివరాలను మా రిపోర్టర్ ప్రేమ్ నుఅడిగి తెలుసుకుందాం. ప్రేమ్ చెప్పండి.

రిపోర్టర్ ప్రేమ్ : ఇవ్వాళ నాకెంతో సంతోషంగా ఉంది నాగ్. ప్రతిరోజూ మనం ఇచ్చే ఫేక్ న్యూస్ ని గంటలకొద్దీ చూస్తూ మూడేళ్లుగా మనల్ని భరిస్తున్న ఆ ప్రేక్షకుడెవరో మరికాసేపట్లో మనం పసిగట్టేయబోతున్నాం నాగ్.

నాగ్ : అవునవును, నాకూ సంతోషంగానేఉంది. ఈ సందర్భంగా నాలో కవిత్వం పొంగిప్రవహిస్తోంది.

ఎవడువాడు ?
ఎచటివాడు?
ఇటువచ్చే
ప్రేక్షకగాడు

(అంతలో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం)

ప్రేమ్ నువ్వు లైన్ లోనేఉండు. ఇక్కడ ఒక ప్రేక్షకుడు కాల్ చేస్తున్నారు. బహుశా ఆయనే మన ఉత్తమ ప్రేక్షకుడు కావచ్చు.
హలో…హలో…

కాలర్ : (అదోలా నవ్వు) హ్హీహ్హీహ్హీ…

నాగ్: (కాస్తంత భయపడుతూ) అదేమిటయ్యా, ఆ నవ్వేంటీ… హలో..హలో మీరెవరు?

కాలర్ : హీహ్హీహ్హీ….అహ్హాహ్హాహ్హా…

నాగ్ : అంటే, మీ పేరు హీహ్హీహ్హీ…అహ్హాహ్హానా..

కాలర్ : (గంభీరంగా) నువ్వు ఎలా పిలుచుకున్నా ఫర్వాలేదు. కానీ నేనే అత్యుత్తమ ప్రేక్షకుణ్ణి తెలుసా?

నాగ్ : అలా బెదిరించకూడదు. అది తేల్చాల్సింది మేము. మీరు ఎక్కడుంటారో చెప్పండి. మా రిపోర్టర్ ప్రేమ్ వచ్చి మిమ్మల్ని కొన్ని కొశ్చన్స్ అడుగుతాడు. వాటికి సరైన సమాధానాలు చెబితే మీరే ఉత్తమ ప్రేక్షకుని అవార్డు గెలుచుకుంటారు. మీ అడ్రెస్ చెప్పండి.

కాలర్ : శ్మశానం పక్కన

నాగ్ : (కంగారుపడిపోతూ) ఏఁ..ఏంటీ… శ్మశానం పక్కనా? అదెక్కడా…??

కాలర్ : ఊరికి ఉత్తరాన… మర్రిచెట్టుపక్కనే ఉన్న శ్మశానం తెలుసా…

నాగ్ : ఆఁ తెలుసుతెలుసు.. మర్రిచెట్టుమీద దెయ్యాలుంటాయటగదా, మా బామ్మ చెబుతుండేది.

కాలర్ : అవును. మర్రిచెట్టేకాదు, ఆ పక్కనే ఉన్న చింతచెట్టును కూడా దెయ్యాలే ఆక్రమించాయి. మీ బామ్మకు ఈ విషయం తెలిసుండదు.

నాగ్ : (తన జర్నలిస్ట్ బుద్ధి పోనివ్వకుండా) ఓహ్..ఇదేదో సెన్సేషనల్ వార్తలాగుందే… ఓ గంటలాగించేయచ్చు. హలో… లైన్ లో ఉన్నారా… ఆఁ చెప్పండి. మర్రిచెట్టునే కాకుండా చింతచెట్టుని కూడా దెయ్యాలు ఎందుకు ఆక్రమించాయి? ఆ కారణాలేమిటో చెప్పండి.

కాలర్ : హీహ్హీహ్హీ… చెబుతాను విను. మీ హైదరాబాద్ లాగానే తయారైంది మాఊరు. ఎటు చూసినా అపార్ట్ మెంట్లే. జనం కొండలుతవ్వేసి ఇల్లుకట్టేశారు. అంటే మీఊర్లో మణికొండలో లాగా, గుట్టలు తవ్వేశారు. పంజాగుట్టలాగా అన్నమాట. అంతేనా కుంటల్లో ఇల్లు కట్టేశారు. నల్లగుంటలోలాగా. ఎక్కడెక్కడి జనం ఊర్లోకి వచ్చిపడుతుంటే అందుకుతగ్గట్టుగా చచ్చి దెయ్యాలయ్యేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. మొదట్లో మర్రిచెట్టు సరిపోయేది. హాయిగా `ఒక కొమ్మకు ఒక దెయ్యం పథకం’ చక్కగా నడిచేది. కానీ ఇప్పుడు ప్రతికొమ్మమీదా కోట్లాది దెయ్యాలు ఇరుక్కుంటున్నాయి. కొమ్మకో దెయ్యం పథకం నీరుగారిపోవడంతో చాలాదెయ్యాలు పక్కనే ఉన్న చింతచెట్టుతో అగ్రిమెంట్ కుదుర్చుకుని అటు దూకేస్తున్నాయి.

నాగ్ : మరి ఇప్పుడు వాటికి లివింగ్ స్పేస్ సరిపోతుందా?

కాలర్ : లివింగ్ స్పేసేంట్రా నీ బొంద. వాళ్లు బతికుంటేగా.. పైగా ఈ దెయ్యాలనేవాళ్లు డ్రాయింగ్ రూమ్, బెడ్ రూమ్, కిచన్ రూమ్, వాష్ రూమ్ లాంటివి అడుగుతున్నారా ఏంటీ, కాదే, ఏదో కొమ్మకు అతుక్కుని తలక్రిందులుగా వ్రేలాడటానికి ఓ అంగుళం స్పేష్ అడుగుతున్నారు. అది కూడా కరవైపోయిందిప్పుడు. చివరకు రేపోమాపో గడ్డి మొక్కలమీద కూడా వాలాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయపడిపోతున్నాయి దెయ్యాలు.

నాగ్ : (అనుమానంతో) అవునూ, ఇంతకీ మీకు ఈ సంగతులన్నీ ఎలా తేలిశాయి?

కాలర్ : (విసుక్కుంటూ) చెప్పానుగా, మా ఇల్లు శ్మశానం పక్కనే అని. రీసెర్చ్ చేస్తుంటా.

నాగ్ : (ఊపిరిపీల్చుకుంటూ) అమ్మయ్యా, నేను ఇంకేదో అనుకున్నాను. సరే, మా రిపోర్టర్ ప్రేమ్ మీ ఇంటికి వస్తాడు. మీరే ఉత్తమ ప్రేక్షకుడు అయినాఅవ్వొచ్చు. ఆల్ దబెస్ట్.

(ఫోన్ కాల్ కట్ అయింది)

హలో, ప్రేమ్ లైన్ లో ఉన్నారా…ప్రేమ్.

ప్రేమ్ : ఉన్నాను నాగ్. చెప్పండి

నాగ్ : ఇప్పుడే ఒక కాలర్ ఫోన్ చేసి తానే ఉత్తమ ప్రేక్షకుడినంటున్నాడు. అతను చెప్పిన ఫేక్ న్యూస్ చూస్తుంటే మనఛానెల్ వీరాభిమానిలా ఉన్నాడు. నువ్వు వెంటనే ఊరికి ఉత్తరానఉన్న శ్మశానం దగ్గరకు వెళ్లు

ప్రేమ్ : శ్మశానం దగ్గరకా, ఎవరైనా ప్రముఖులు కన్నుమూశారా ? అంత్యక్రియలు కవర్ చేయాలా?? సెలెబ్రటీస్ ఎవరైనా హాజరవుతున్నారా? వారితో ఇంటర్వ్యూలు గట్రా చేయాలా?? చెప్పునాగ్, చెప్పు.

నాగ్ : అదేమీకాదు. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. శ్మశానం పక్కనే ఒక ఇల్లుంటుంది. ఆ ఇంట్లోనే మన ఉత్తమ ప్రేక్షకుడుఉంటాడు. వెళ్ళి వివరాలు కనుక్కుని సెలెక్ట్ చేయి.

ప్రేమ్ : అర్థమైంది నాగ్. రవ్వంత చెబితే చాలు, రైలంత సాగదీస్తాడు ఈ ప్రేమ్. ఇప్పుడే వెళ్ళి సెలెక్ట్ చేస్తాను.

నాగ్ : ఉత్తమ ప్రేక్షకుడెవరో మరికాసేపట్లోనే తెలిసిపోతుంది. ఇప్పుడో చిన్న బ్రేక్. చూస్తూనే ఉండండి ఫేక్ న్యూస్ ఛానెల్ టివీ త్రిబుల్ నైన్.

(బ్రేక్ అయ్యాక…)

నాగ్ : టెన్షన్ పెరిగిపోతోంది. ఊపిరాడనంత ఉత్కంఠ. ఉత్తమ ప్రేక్షకుడెవరో తెలుసుకోవాలని మీరంతా కళ్లు, చెవులు అప్పగించి చూస్తున్నారని మాకు తెలుసు. ఇక కౌంట్ డౌన్ మొదలైంది. ప్రేమ్ ని అడిగి వివరాలు తెలుసుకుందాం. ప్రేమ్… ఎక్కడున్నావ్?

ప్రేమ్ : (భయంభయంగా) నా..నా..గ్.గ్.. ఇక్కడో పాడుబడ్డ ఇల్లుంది. లోపలకువెళ్లాలంటే భయమేస్తోంది నాగ్.

నాగ్ : భయపడకు ప్రేమ్. నేనెప్పుడూ నీవెంటే ఉంటాను. వెళ్ళు…

ప్రేమ్ : (కోపంగా) నువ్వు నాపక్కన ఎక్కడున్నావ్ నాగ్. ఎక్కడో స్టూడియోలో ఏసీ రూమ్ లో హాయిగా కూర్చుని ఉన్నావ్. ఇక్కడ నా బ్రతుకే శ్మశానాలపాలైంది. ఓర్నాయనో… లోపల ఎవరున్నారో, ఏమో…

నాగ్ : వెళ్లు ప్రేమ్, వెళ్లు. అక్కడ ఎవరున్నారో చూడు.

ప్రేమ్ : (భయపడిపోతూ) నాగ్, లోపల మనుషులెవరూ లేరు. కానీ ఇక్కడ టీవీలో మన ఛానెలే వస్తోంది. అమ్మో, ఇక్కడో అస్థిపంజరం కుర్చీలో కూర్చుని టివీవైపే చూస్తోంది నాగ్. ఇల్లు పాడుబడిన తీరుచూస్తుంటే ఓ మూడేళ్ల కిందటే అంటే మన ఛానెల్ ప్రారంభమైనప్పడే ఈ ఇంట్లో ఒకతను చనిపోయినట్టనిపిస్తోందినాగ్. ఆ వ్యక్తి మన ఛానెల్ లో వచ్చే ఫేక్ న్యూస్ తాకిడికి తట్టుకోలేక పోయినట్టు నాకనిపిస్తోంది నాగ్. ఆ కసితో ఇప్పటికీ మన ఛానెలే ఇంకా టివీలో చూస్తున్నట్టున్నాడు. అనుమానంలేదు నాగ్, ఈ అస్థిపంజరమే నీకు కాల్ చేసింది. నోడౌట్ ఇతనే మన ఉత్తమ ప్రేక్షకుడు. ఇక ఇక్కడ ఒక్కక్షణంఉంటే ఏమవుతుందో ఏమో… ఇదీ నాగ్ నా రిపోర్ట్. శ్మశానం దగ్గర్నుంచి కెమేరామెన్ రామ్ తో మీ ప్రేమ్ దౌడోదౌడ్…

– కణ్వస
kanvasa19@gmail.com

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close