సెటైర్: నీ వెంట నేను, నా వెనుక నీవు.. ఓ మోదీ, ఎక్కడున్నావు…?

రచయిత జంబులింగం మాంచి కథ కోసం దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. సరిగా అప్పుడు అతని మూడ్ పాడుచేయడానికన్నట్టుగా వెంగళప్ప ఊడిపడ్డాడు.

`బావా ఇది విన్నావా… రాహుల్ దేశంలో లేడు’

`ఓరేయ్ వెంగళప్పా… ఈ చద్దివార్తలు చెప్పడం ఎప్పుడు మానుకుంటావ్? వినలేక చస్తున్నాను’

`మరి టీవీల్లో చద్దివార్తలనే గంటలకొద్దీ స్పెషల్ షోలంటూ చూపిస్తుంటే తెగ చూస్తుంటావుగా..’

`ఖర్మరా బాబూ, ఖర్మ. నీతో వాదించలేనుకానీ, ఇంతకీ విషయం ఏమిటో చెప్పితగలడు’ విసుక్కున్నాడు జంబులింగం.

`అద్గదీ అలారా దారికి… రాహుల్ దేశంలో లేడు’

`అవును, లేడు..ఆయన ఉన్నాడని ఎవరన్నారు ? ఆయనగారు ఉన్నట్టుండి ఏదో పని ముంచుకొచ్చిందట… అమెరికా చెక్కేశారు’

`కదా… ముందు బ్రిటన్ వెళ్ళాడని వార్తలొచ్చాయ్, కానీ అమెరికానే వెళ్ళాడట అతగాడు’

`ఆయన ఎక్కడకు వెళితే మనకెందుకురా. అయినా, హఠాత్తుగా మాయమవడం ఆయనగారికి అలవాటేగా. జనరల్ ఎలక్షన్స్ అవగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా… ఈ ఏడాది మొదట్లో పార్లమెంట్ సమావేశాల టైమ్ లో లాంగ్ లీవ్ పెట్టి చెక్కేశాడా…ఇప్పుడు మరోసారి… అయినా, బిహార్ ఎన్నికలు దగ్గర్లో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుని హోదాలో ఉన్న వ్యక్తి ఇలా సెలవులు పెట్టి జంప్ చేయడమేమిటో…?!’ అర్థంకానట్టు అడిగాడు జంబులింగం.

`వైద్యానికి పనికిరాని చెట్టు పెరట్లో ఉన్నా, అడవిలోఉన్నా ఒకటే. ఇప్పుడు నా పాయింట్ అదికాదు’ తాను మరేదో చెప్పాలనుకున్నట్టు జంబులింగం మాటల్ని కట్ చేశాడు వెంగళప్ప.

`సరే, రాహుల్ అమెరికా వెళ్ళాడు….ఐతే…’

`బావా… నీకు న్యూస్ క్రియేట్ చేయడం రాదు. పెద్ద రచయితనంటావ్ పైగా…’

`మధ్యలో నామీదెందుకు సెటైర్లు. టివీల్లో రిపోర్టర్ గా చేరాలని తెగ ఉబలాటపడిపోతున్నావుకదా, నువ్వే చెప్పు. నీ క్రియేటివిటీ చూపించి తగలడు ‘

`అలాఅన్నావ్ బాగుంది. ఇక రెచ్చిపోతా చూడు… రాహుల్ అమెరికా వెళ్ళాడు. అంతలో ప్రధానమంత్రి మోదీగారు కూడా అమెరికా ప్రయాణం కట్టేశారు. ఈ రెండు వార్తల్ని పక్కపక్కనపెట్టి చూడు…నీకేం అనిపించడంలేదూ…’

`ఇందులో ఏముందిరా… ఎవరిదారి వారిది. చిన్నాయనేమో ఒక గ్లోబల్ సదస్సుకోసం వెళ్ళాడాయె, పెద్దాయనేమో పెట్టుబడులు రాబట్టడానికి వెళ్లాడాయె.. ‘

`కాబోయే టివీ రిపోర్టర్ని కాబట్టి నేను పసిగట్టేశాను. రాహుల్ ఈమధ్య ఎక్కడ సభకు వెళ్ళినా మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు కదా. అలా విమర్శిస్తూ..విమర్శిస్తూ చివరకు మోదీ పేరు ప్రస్తావించకుండా ఒక్క ఘడియకూడా ఉండలేకపోతున్నాడు. కలలో కూడా మోదీనే కనబడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల్ వెంట మోదీ నీడలా వెన్నంటే ఉన్నాడు’

`వీళ్లిద్దరూ రాజకీయ శత్రువులు కదరా… మరి అలాంటప్పుడు రాహుల్ అంతగా మోదీ జపం చేయడమెందుకట…’

`అదే బావా లాజిక్కూ… నీకు పురాణ జ్ఞానం కూడా లేదు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఏం చేశారు. నిత్యం హరినామ జపమేగా. ఇదీ అలాంటిదే. శత్రువు నామం జపంచేసిచేసి చివరకు ఆ శత్రువుని చూడకుండా ఉండలేని స్థితికి వచ్చేయడమన్నమాట’ వెంగళప్ప వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

`అబ్బే ఏమీ అర్థంకాలేదు’ అయోమయంగా ఫేస్ పెట్టాడు జంబులింగం.

`రాహుల్ నిత్యం మోదీ జపం చేయడంతో చివరకు ఆయన్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఇదోరకం జబ్బట. మోదీ అమెరికా పోతున్నాడని తెలుసుకున్న రాహుల్ వెంటనే తానూ పెట్టాబేడా సర్దుకుని ముందే చెక్కేశాడన్నమాట’

`అంటే, ఎంత రాజకీయంగా శత్రుత్వమున్నా, `నీవెనుక నేను, నా వెనుక నీవు…’అంటూ రాహుల్ వెంటబడుతున్నాడంటావా? ‘

`తప్పు బావా, వెంటబడుతున్నాడని అనకూడదు. ఇది ఆ జబ్బుకున్న లక్షణం. జబ్బు ప్రారంభదశలో ఉన్నప్పుడు కేవలం నామజపంతోనే సరిపెట్టుకుంటారు. అదికాస్తా ముదిరితే, ఇక అవతలి వ్యక్తి ఎక్కడకు వెళితే అక్కడకు తామూ వెళుతుంటారు. మన వీధి చివరి డాక్టర్ ని అడిగితే ఈ రోగలక్షణాలు చెప్పారు బావా’

చక్కటి కథ రాసుకుందామని కూర్చుంటే వెంగళప్ప చెప్పిన కబుర్లతో మూడ్ ఆఫ్ అయిపోయింది జంబులింగానికి. కోపం తారాస్థాయికి చేరింది.

`ఛాల్లే ఆపు. జర్నలిస్ట్ కాకముందే, టివీ రిపోర్టర్ లక్షణాలన్నీ వచ్చేశాయ్ నీకు. ఇప్పటికే రాజకీయనాయకుల్లోని అవలక్షణాలు చూడలేక చస్తుంటే, ఇప్పుడు మరో కొత్త జబ్బు తగిలిస్తావా? పో…వెళ్ళి ఏ ఛానెల్ లోనైనా చేరిచావు…’

`ఇహ్హీహ్హీ.. మరి వెంగళప్ప అంటే మజాకానా.. మరో వార్తతో మళ్లీ వస్తా బావా… అంతవరకు సెలవు… నీ వెనుక నేను, నా వెనుక నీవు.. ‘ పాడుకుంటూ వెళ్లిపోయాడు వెంగళప్ప.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ నిస్సహాయతను ఎగతాళి చేసిన జేఎంఎం..!

అసలు సంబంధమే లేకపోయినా కల్పించుకుని తమ ముఖ్యమంత్రికి సుద్దులు చెప్పబోయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జార్ఖండ్ ముక్తి మోర్చా...గట్టిగా రిప్లయ్ ఇచ్చింది. " మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసు.....

తేడా వచ్చిందిగా పుట్ట మధు కూడా ఇక నిందితుడే..!?

చట్టాలు పాలకుల చేతుల్లో ఎలా చుట్టాలుగా మారుతాయో.. మరో ఉదాహరణ తెలంగాణలో కళ్ల ముందు సాక్ష్యాలతో సహా కళ్ల ముందు కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట.. తెలంగాణలో వామనరావు అనే లాయర్‌తో పాటు.....

కరోనా భయపెడుతోంది సారూ.. కాస్త అణిచివేయకూడదూ..!?

రాజకీయం తీరెరుగదు - పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదంటారు...! ఇదెంత నిజమో కానీ.. భయపెట్టి పాలన సాగించేస్తున్నారని.. ఎవరు నోరెత్తినా కేసులు.. అరెస్టులు.. దాడులు.. దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు...

సాక్షిలో జగన్ ట్వీట్ వార్త కిల్..! ఇంత అవమానమా..!?

ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్శించిందుకు జార్ఖండ్ సీఎంపై జగన్ విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్‌కు ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ ట్వీట్ సూపర్ వైరల్ అయింది. చర్చోపచర్చలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఇంత డేరింగ్ అండ్...

HOT NEWS

[X] Close
[X] Close