సెటైర్: సభను మ్రింగే`రాహు’వు

అది దేవలోకం. అయినా అన్నిలోకాలను పాలించే హక్కుఉన్న లోకం అది. అందుకే అక్కడి దేవసభను `లోక’సభ అనికూడా అంటారు. దేవలోకంలోని ఆ సభాప్రాంగణం శోభాయమానంగా ఉంటూ సమావేశాలతో కళకళలాడుతుంటుంది. అలాంటి లోకసభ ఉన్నట్టుండి మాయమైంది ! అలా ఎందుకు మాయమైందో ఇంద్రుడితోసహా ఎవ్వరికీ అర్థంకాలేదు. అంతా అయోమయంలోపడిపోయారు.

ఇంద్రుడు తెగమదనపడిపోతున్నాడు.

`ఇప్పుడెలా, సమావేశాలు జరగకపోతే ఎలా? పలులోకాలను పాలించే `లోక’సభే కనిపించకుండాపోతే పాలనాపరమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు ? చట్టాలు ఎవరు తయారుచేస్తారు? రేపోమాపో త్రిమూర్తులు వచ్చి అడిగితే ఏముఖం పెట్టుకుని సమాధానం చెప్పాలి ? ‘
దేవలోకసభ పాలకసభ్యుల్లో అలజడిరేగింది. సరిగా ఆసమయంలో వారికి గురుదేవులైన బృహస్పతివారు గుర్తుకువచ్చారు.

అంతా కలసి బృహస్పతివారి దగ్గరకు వెళ్లారు.

`ఏమిటి అంతా కట్టకట్టుకుని వచ్చారు?’

`సమస్య గురూజీ, సమస్య’

`మళ్ళీ ఏమొచ్చింది? రాక్షస మూకను తరిమికొట్టాక బాగానే పరిపాలిస్తున్నారు కదా…’

`అనే అనుకున్నాం. కానీ పాలించాలంటే సభలు జరగాలికదా, సభామందిరాలు ఉండాలికదా’ -అన్నాడు ఇంద్రుడు జోక్యం చేసుకుంటూ.

`అదేంటీ అలా అంటావు ఇంద్రా, దేవతల శిల్పి అయిన మయుడిచేత పెద్ద సభామందిరాలను నిర్మించుకున్నారుకదా.’

`అవును గురుదేవా మీరు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి `లోక’సభ భవంతులు అదృశ్యమయ్యాయి’

`అంటే!’

`ఏముంది గురుదేవా, నిన్నటిదాకా ఆపెద్ద భవంతి నిండుగా అందరికీ కనిపిస్తూ కళకళలాడుతుండేది, అలాంటిది నిన్న అక్కడికివెళ్ళి చూస్తే ఏముందీ, హాంఫట్’

బృహస్పతి నవ్వాడు. ఆ నవ్వు `మీ అసమర్థత ఇలా ఏడ్చిందన్న’ట్టుంది.

`భూలోకంలో భారతావని ఉందికదా, అది భూలోకస్వర్గమని త్రిమూర్తులుసైతం అంగీకరించారుకదా, ఒకానొకకాలంలో ఆదేశంలో …’

`గురుదేవా చరిత్ర ఎందుకు? ఇప్పుడు అసలు పాయింటికి వస్తే బాగుంటుందేమో…’ ఇంద్రుడు నసిగాడు.

`ఇదే ఈ తొందరే నీకు ఎన్నో అనర్థాలు తెచ్చిపెట్టింది. అహల్య వృత్తాంతం గుర్తుచేయమంటావా?’

`వద్దులే గురూజీ, అసలు విషయంచెప్పండి, ఓపిగ్గానే వింటాను’

`అలారా దారికి, తెలుగులో వచ్చిన ఓపాత సినిమా గురించి చెబుదామని’ – తీరుబడిగా గడ్డం నిమురుకుంటూ అన్నాడు బృహస్పతి.

`ఏంటీ పాతసినిమాగురించా? ‘ అసహనంగా అన్నాడు ఇంద్రుడు.

`ఆ పాతసినిమానే, ఆ సినిమా పేరు, పాతాళభైరవి. అందులో ఒక పెద్ద మహల్ ఉన్నట్టుండి మాయమైపోతుంది. అలాఉందినువ్వుచెప్పే కట్టుకథ’

`గురూజీ, మేము అబద్దం చెబుతామా… నిజం, ఇదిగో ఈ చంద్రుడిమీద ఒట్టు.’

పక్కనున్న చంద్రుడు ఉలిక్కిపడ్డాడు.

`మధ్యలో నామీదెందుకు, అసలే నేను రాహుగ్రహపీడితుణ్ణి. ఎప్పుడు వాడు నన్ను పట్టేస్తాడోనని హడలిఛస్తుంటేనూ..’

చంద్రుడు అన్న ఆమాటలు బృహస్పతి బుద్ధికి పదునుబెట్టింది. ఆలోచించాడు.

`ఇప్పుడర్ధమైంది. ఇంద్రా, నీ `లోక’సభ కనిపించకుండా పోవడానికి కారణం… రాహువే’

`ఏంటీ, ఈ చంద్రుడిగాడ్ని పట్టేసే రాహువు మన దేవలోకసభను కూడా పట్టేశాడా…ఇదేలా సాధ్యం ?’

`ప్రస్తుతం కలియుగం నడుస్తోంది, దుస్సాధ్యమనుకున్నవి సాధ్యమైపోతుంటాియ. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి, భూలోకంలో రాహుల్ అనేవాడొకడున్నాడు. అతను ఎలా చెబితే అలా సభ నడవాలనుకుంటాడు. దీనికితోడు మాత సోనియా సపోర్ట్ ఒకటి. తనకు నచ్చకపోతే సభే లేదంటాడు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారమంతా తనదే అనుకుంటాడు. మిగతా పార్టీలు వద్దువద్దని వారించినా వినడు. సభాకాలం చాలావిలువైనదీ, ప్రతినిమిషానికీ 29వేల రూపాయలు వ్యయమవుతున్నా లెక్కలుచెప్పినా పట్టనట్టే ఉంటాడు. 15రోజులపాటు సభాకార్యక్రమాలు జరగకపోతే, 33కోట్ల రూపాయలు ఖజానా నుంచి కరిగిపోతాయన్నమాట. ఇవేమీ పట్టించుకోకుండా, సభాసమయాన్ని వృధాచేస్తుంటాడు. రాజకీయాల్లో ఎదిగీఎదగని వయసుకావడంతో తొందరపడటం, ఆ తొందరకు తల్లి మద్దతుఇవ్వడం, అంతా ఓ ఫార్స్ గా మారిపోయింది. సభలో గౌరవసభ్యుల విలువలు దిగజారిపోతున్నాయని పెద్దలు ఆందోళన చెందుతున్నా వీరు పట్టించుకోవడంలేదు. అంతేకాదు,మిగతా ప్రతిపక్షసభ్యులు కలసిరాకపోయినా ఈ తల్లీకొడుకులు ఒంటరి పక్షుల్లా సభను కసిగా అడ్డుకుంటున్నారు’

`గురుదేవా, అంతగా ఆవేశపడిపోయి మాకు చెప్పకండి, మీకుతెలుసుగా, అది భూలోకం. అక్కడి రాహుల్ ఇక్కడికెలా వచ్చాడన్నదే నాకు అర్థంకాని విషయం’

`ఇది కలియుగం, మరిచావా ఇంద్రా.. కలిపురుషుడు ఆడించేనాటకంలో మనం కూడా పాత్రధారులమే. కలిప్రభావంతో రాహుల్ శక్తి రోజురోజుకీ పెరిగిపోతూ ఇప్పుడు దేవలోకాన్నీ కూడా తాకింది. ఆ శక్తే ఇప్పుడు నీ లోకసభను కూడా మాయం చేసింది.

`అమ్మో, మరి ఎలా, రాహుగ్రస్తమైన `లోక’సభను ఎలా రక్షించుకోవడం, చెప్పండి గురుదేవా..’ అడిగాడు జాలిగా ఇంద్రుడు.

` ముల్లును ముల్లుతోనేతీయాలి. తిక్కకు తిక్కే విరుగుడు’

`అంటే, అర్థంకాలేదు గురుదేవా’

`అంటే, ఏమందీ, రాహులుకు విరుగుడు జగన్. రాహుల్ చేస్తున్న పనినే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న జగన్ మీ సమస్యపరిష్కారానికి సరైనవాడు. రాహుల్ చాలా కష్టాల్లో ఉన్నట్టు మీరు అతగాడ్ని నమ్మించాలి. ఆ తర్వాత అతగాడు ఉండబట్టలేక రాహుల్ ని ఓదార్చడానికి బయలుదేరతాడు. ఈ విషయం రాహుల్ చెవినపడేలా చూడండి. దీంతో రాహుల్ భయపడి పట్టువీడుతాడు. మీ సమస్య తొలిగిపోతుంది. పోండీ, జగన్ దగ్గరకు వెళ్ళి మీ సమస్య మొరపెట్టుకోండి’

అంతే, దేవగణం క్షణంలో అక్కడ మాయమైంది. రెండో ముల్లును వెతికేపనిలో పడింది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]lugu360.com