సెటైర్:30రోజుల్లో కిలికిలి

బాబుగారి కళ్లలో ఆనందం తాండవిస్తోంది. వెంటనే సెక్రటరీని పిలిపించారు.

`అర్జెంట్ గా నువ్వోపని చేయాలి’

`చిత్తం సారూ’

`ఇది చాలాసీక్రెట్ గా ఉంచాలి’

`అలాగే సారూ’

`నువ్వెళ్ళి మౌళిని కలు. ఈ చీటీ ఆయనకు ఇవ్వు’

`చిత్తం, కానీ, మౌళి అంటే ఎవరుసార్. రాజమౌళిగారేనా…’

`నీకు డౌట్ అక్కర్లేదు. ఆయనే ఈయన’

సెక్రటరీ కళ్లలో ఆనందం. పెద్ద డైరెక్టర్ తో పనిపడినందుకు సంతోషపడ్డాడు.

`తప్పకుండా సార్, ఎప్పుడు బయలుదేరమంటారు’

`ఇప్పుడే, ఆ విధంగా ముందుకుపోతున్నామ్, అర్థమైందా’

`ముందుకుపోతున్నామనగానే నాకు లోగుట్టంతా అర్థమైందిసార్, ఇక చూస్కోండి. మూడోకంటివాడికి తెలియకుండా ఎలా చక్కబెడతానో’

ఇక్కడ సీన్ కట్ చేస్తే….

అది రాజమౌళి చాలా గోప్యంగా పెట్టుకున్న ఆఫీస్. ఈ ఆఫీస్ ఒకటి ఉన్నట్టు బయటప్రపంచానికి తెలియదు. ఆఫీస్ కు చేరుకునే దారి ఎవ్వరికీ తెలియదు. కళ్లకుగంతలుకట్టి మరీ తీసుకెళతారక్కడికి. బాబు సెక్రటరీని కూడా అలాగే తీసుకువెళ్లారు. మధ్యలో ఎత్తైన రోడ్లు రావడంతో అక్కడ కొండలున్నాయనీ, పల్లం రావడంతో లోయలోకి బస్సు పోతున్నదనీ, నీళ్ల శబ్దం అదేపనిగా వినిపిస్తుంటే జలపాతాల పక్కనుంచి పోతున్నామని, జంతువుల అరుపులు వినబడుతుంటే అడవి దారి వెంబడి వెళుతున్నామని తెలివైన సెక్రటరీ ఇట్టే పసిగట్టేశాడు. బహుశా తననేదో బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి తీసుకువెళుతున్నారేమోననుకున్నాడు. ప్రభాస్, రానా, అనుష్క, కాలకేయ ప్రభాకర్ లాంటివాళ్లను త్వరలో చూస్తానన్న ఊహే అతగాడికి గిలిగిలి పెట్టింది.

అంతలో `కిలికిలి’ అన్న శబ్దం గరుకుగా వచ్చింది.

కళ్లకు గంతలు విప్పేశారు. కాసేపు అటూఇటూ చూశాక అది రాజమౌళి ఆఫీస్ అని అర్థమైంది. సంతోషమేసింది. అక్కడ గోడమీద `30 రోజుల్లో కిలికిలి’ అని రాసుంది. తనను తీసుకువచ్చిన వారిలో ఒకడు `కిలికిలి’ అన్నాడు.

అప్పుడే వచ్చిన రాజమౌళి కూడా నవ్వుతూ `కిలికిలి’ అన్నాడు.

సెక్రటరీకి కర్తవ్యం గుర్తుకువచ్చింది, ఇక క్షణం ఆలస్యం చేయదలుచుకోలేదు . వెంటనే బాబుగారిచ్చిన చీటిని రాజమౌళికి ఇచ్చేశాడు.

చదివాడు. కాసేపు ఆలోచించాడు. తర్వాత నవ్వాడు. బాగానేఉందన్నట్టుగా అన్నట్టు తలఊపాడు. తన అనుచరుడివైపు తిరిగి –

`చూడు, ఈ కిలికిలి మాత్రం చాలా సీక్రెట్. ఎవ్వరికీ తెలియకూడదు. బాహుబలితో మనకు యమక్రేజ్ వచ్చేసింది. బాహుబలి వీడియో గేమ్స్ ప్రాజెక్ట్ నుంచికూడా మనకు లాభాలొచ్చేలాఉంది. ఇప్పుడు కేకె అదే కిలికిలి ప్రాజెక్ట్ కి కూడా మంచిరోజులొచ్చేశాయి. దీంతో వేలకోట్ల బిజినెస్ రాబోతుంది. సరే, నువ్వు ఇతగాడికి మళ్ళీ గంతలుకట్టి మన కేకె సైట్ కి తీసుకువెళ్ళు.’

ఇలా రాజమౌళి అనగానే, ఆ వ్యక్తి అదోలా నవ్వేస్తూ, `కిలికిలి’ అంటూ సెక్రటరీకి గంతలుకట్టేసి వ్యాన్ ఎక్కించేశాడు.

మళ్ళీ ప్రయాణం… మరోసారి అవే శబ్దాలు… అవే అరుపులు… గంటసేపు వెళ్ళాక, వ్యాన్ ఆగింది. దింపారు. దిగితే తెలిసింది సెక్రటరీకి అది కారడవని. అంతలో అడవిఏనుగుమీద ఓ బొగ్గులాంటి శరీరఛాయతో ఉన్న బలిష్టమైన వ్యక్తి ఒకడు వచ్చాడు. అతణ్ణిచూడగానే సెక్రటరీ చటక్కున గుర్తుపట్టేశాడు.

`కాలకేయ…కాలకేయ’ – అంటూ అరిచేసినంతపనిచేశాడు.

`ఉష్ అట్టా అరవొద్దు, ఏనుగు బెదురుతుంది’ అన్నాడు పక్క వ్యక్తి.

`ఎన్నాళ్లకు కాలకేయను నిజంగా చూశాను. ఎంతటి భయంకరమైన ఆకారం. ఇంతటి వికృతంగాఉన్నా, ఏదో సౌందర్యం ఉట్టిపడుతోంది…ఆహా ఏమీ ఆ నలుపు, ఏమీ ఆధగధగ…’అంటూ స్తుతించడం మొదలుపెట్టాడు సెక్రటరీ.

కాలకేయుడు ప్రసన్నత చెందాడు. ఏనుగు దిగివచ్చి

`కిలికిలి’ అన్నాడు.

ఎందుకైనా మంచిదని సెక్రటరీ కూడా

`కిలికిలి’ అన్నాడు.

వెంటనే కాలకేయ
` లడ్చ్… నూచ్…కిప్ఫా’ అన్నాడు.

సెక్రటరీకి ఒక్క ముక్క అర్థంకాలేదు.
పక్కనున్న వ్యక్తి అందుకుంటూ-

`అందర్నీ తీసుకు రమ్మంటున్నాడు’

అలాగే అని తలఊపాడు సెక్రటరీ.

సీను అక్కడ కట్ చేస్తే…

బాబుగారు చెప్పినట్టే ఓ పదిమందిని సెలెక్ట్ చేసి వారంరోజుల్లో తీసుకొచ్చి కాలకేయ ముందు నిలబెట్టారు.

కాలకేయ వారిని చూసి… అదోలా నవ్వేస్తూ..

`లుంబ ఇన్బస్త్ ఫీ.. లోట్రు, ప్రెంబ్త్.. ప్చ్…’ అన్నాడు.

`అంటే…’ అయోమయంగా అడిగాడు సెక్రటరీ.

`మీ వాళ్లు బాగానే నచ్చారట. వాళ్ల 30 రోజుల్లో కాలకేయ భాష పూర్తిగా నేర్పిస్తాడట’ పక్కనున్న వ్యక్తి తర్జుమాచేసి చెప్పాడు.

మళ్ళీ సీన్ కట్ చేస్తే…..

బాబుగారు తెగ మండిపడుతున్నారు. సెక్రటరీని పిలిచారు.

`ఏంటిది ?, ఎందుకు ఇలా జరిగింది??’

సెక్రటరీ బిక్కమొహం వేశాడు. తెలుగుతల్లి సాక్షిగా నాకేం తెలియదన్నాడు.

`30 రోజుల్లో కిలికిలి భాష మనవాళ్లు బాగానే నేర్చుకున్నారు. అంతవరకు బాగానేఉంది. ఆ ధైర్యంతో ఈకోడ్ లాంగ్వేజ్ లోనే నోట్ల వ్యవహారాలన్ని చక్కదిద్దాలనుకున్నాను. వేలకోట్లు చేతులుమార్చాలనుకున్నాము. ఆ విధంగా ముందుకుపోదామనుకున్నాము. కానీ..’

`ఏమైందిసార్ ?’ ఆదుర్దాగా ఆడిగాడు సెక్రటరీ.

`ఏమైందా…చూడు, ఎంతో గోప్యంగా ఎవ్వరికీ అర్థంకాని కిలికిలి భాషలో మనం సాగించిన రహస్య ఒప్పందాలన్నీ అదిగో మన పొరుగు రాష్ట్రం వాళ్ళకు తెలిసిపోయాయి’

సరిగా అప్పుడే పొరుగురాష్ట్రంలోని వారి గూఢచారి హడావుడిగా లోపలకు తోసుకుంటూ వచ్చేశాడు.

`ఏమిటి విషయం ?’ అడిగాడు బాబు.

`అయ్యా, చాలా ఆశ్చర్యమండయ్యా, మనమేదో కిలికిలితో లోగుట్టు వ్యవహారాలు చక్కబెడుతుంటే, పొరుగురాష్ట్రంవారు కూడా ఇదే భాష నేర్చేసుకుని రహస్యఒప్పందాలు కుదుర్చుకోవడమే కాదూ, మన కోడ్ భాషను డీకోడ్ చేసేసి, కేసుల్లో ఇరికించేస్తున్నారు. ఇప్పటికే ఓ వందదాకా కేసులుపడ్డాయి మనమీద’

`బాబుకి కోపం తారాస్థాయికి చేరుకుంది…వెంటనే –
ఓరినా కిలికిలి… ఎంత పనిచేశావ్. పద సెక్రటరీ, వెళ్ళి ఆ కిలికిలిగాడ్ని అడిగేద్దాం. కడిగేద్దాం. ఆ విధంగా ముందుకుపోదాం…’

ఇంకోసారి సీన్ కట్ చేస్తే..

కిలికిలి భాష నేర్పిన కాలకేయునిదగ్గరకు, అప్పుడే కేసీఆర్ వెళ్లాడు. అక్కడి ఒక గదిలోనుంచి మాటలు బయటకు వినబడుతున్నాయి.

` నీ బొందపెడ్తా, నీ బొక్కలేరుతా, నేనేమన్నా హవాలాగాడ్ననుకున్నవా. ఏంటీ తిరకాసు. కిలికిలి అన్నావ్, గిది నేర్చుకుంటే మంచిగుంటదన్నావ్. సరేనంటి, అవతోళ్ల డీల్లు మాకెరుకైపోతాయంటే సర్లే నంటి. ఇప్పుడైమైంది నీకెరుకేనా… వాళ్ల డీల్లు మనకు తెల్వడంమాట ముచ్చటగనే ఉండె, కానీ మా డీల్లు కూడా వాళ్లకెరుకైపోవట్లా… ఏం జేస్తున్నావయ్యా, నువ్వీడ బోర్డుబెట్టి. నీ సంగతి చూస్తా, నీ ముక్కునేలకు రాస్తా… నేనింత అరుస్తున్నా ఆ నవ్వేంది బిడ్డా, నామాట నీకు తెల్వటెల్లే… నువ్వూ నీకిలికిలికీ ఓ దండం. నేబోతా…’

విసవిసలాడుతూ బయటకుపోయాడు కేసీఆర్. నెమ్మదిగా లోపలకు అడుగుపెట్టాడు బాబు.

అదే వరుస. కాకపోతే మరో మాండలీకంలో అరిచేశాడు. అంతా విన్న కాలకేయుడు తనకేమీపట్టనట్టు నవ్వాడు. అప్పుడు స్పీకర్ లోనుంచి రాజమౌళి గొంతు వినిపించడం మొదలైంది…

`కాలకేయ, మనం ఎవ్వరికీ భయపడకూడదు. ఎవరి స్వార్థంకోసం వాళ్లు వచ్చారు. కిలికిలి నేర్చుకున్నారు. భాషనేర్పడం వరకే మన ఎగ్రిమెంట్. నేర్చుకున్నాక దాన్ని ఎలా ఉపయోగిస్తారన్నది వారిఇష్టం. అది మన ఎగ్రిమెంట్లో లేదు. నువ్వు తర్వాతి డీల్ చూసుకో నిర్భయంగా..’

`అలాగే బాస్ …’

ఇదేంటీ, కాలకేయ తెలుగు మాట్లాడుతున్నాడు – బాబు సెక్రటరీకి బోలెడు ఆశ్చర్యం.

పక్కనే ఉన్న ఆఫీస్ బాయ్ అందుకుంటూ…

`అతనెవరో కాదండీ, మన తెలుగోడే. కిలికిలి ప్రాజెక్ట్ కోసం బాస్ తీసుకొచ్చారు’

బాబు తన గణంతో బయటకు వెళుతుంటే, జగన్ గణం లోపలకు ఎంట్రీ అవుతోంది… ఈ భాష పాపులరైతే ఇందులో కూడా ఓ పేపర్ పెట్టొచ్చన్న ఆలోచనలో జగన్-

` జై కాలకేయ, జైజై కిలికిలి అంటూ…’ లోపలకు అడుగుపెట్టాడు.

– రాత: కణ్వస
గీత: రాజేష్turlapati

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close