ఆయ‌న్ని అడ్డుకున్న‌ది సీఎం ర‌మేష్‌..?

రాజకీయాల్లో పైపైకి స్నేహం న‌టిస్తూ వెనక గోతులు తవ్వటం, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవటం మామూలే. ఏపీ మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా పైకి కనిపించని ఇలాంటి సంగ‌తి ఒక‌టి నెమ్మ‌దిగా వెలుగులోకి వ‌స్తోంది. మంత్రి పదవి కోసం ఆశపెట్టుకొని, చివరకు దక్కక నిరాశపడిన వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే, వీరికి పదవి రాకపోవడానికి తగిన సామర్థ్యం లేక కాదు, పక్కనే ఉంటూ అడ్డుపడేవాళ్లే. ఇలాంటి రాజకీయాలకు బలైన వాళ్ల లిస్టులో తాజాగా మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి ఒకరు.

సతీశ్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనే పలుసార్లు పోటీ చేశారు. గెలుపు దక్కకపోయినప్పటికీ తన వంతు ప్రయత్నం చేశారు. వైఎస్ కంచుకోట పులివెందుల లో టీడీపీకి అన్నోఇన్నో ఓట్లు వస్తున్నాయంటే దానికి సతీశ్ రెడ్డే కారణం అనడంలో సందేహం లేదు. దీన్ని గుర్తించిన చంద్ర‌బాబు ఈయ‌న‌కి గ‌త‌సారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అలాగే మండలి డిప్యూటీ చైర్మన్ ను చేశారు. అయితే, అది మూణ్నాళ్ల‌ ముచ్చటగానే మిగిలింది. ప్రస్తుతం సతీశ్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన మరో దఫా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అయితే, దీనివెనక కడప జిల్లాకే చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఉన్నారని సతీశ్ అనుచరులు అనుమానిస్తున్నారు. దీనికి తగిన కారణాలనూ వాళ్లు చూపుతున్నారు.

గండికోట నుంచి పులివెందులకు నీళ్లు తెచ్చే అంశంలో సతీశ్ ప్రయత్నానికి సీఎం రమేశ్ అడ్డుపడ్డారని అంటున్నారు. పులివెందులకు నీళ్లు తీసుకెళితే సతీశ్ కు మరింత పేరొస్తుందని, జిల్లాలో అందరూ తనమాటే వినాలని అనుకొనే సీఎం రమేశ్ … కావాలనే గండికోట నీటిని ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరుకు తాగునీరు కోసం అంటూ అడ్డుపడేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే, దీనిని గుర్తించిన సతీశ్ ఆయన ప్రయత్నాన్ని తెలివిగా అడ్డుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రమేశ్.. సతీశ్ పై కోపం పెంచుకున్నారని సమాచారం. మరోవైపు పులివెందులకు గండికోట నీరు తెచ్చేంతవరకు గడ్డం తీయనని సతీశ్ చేసిన ప్రతినపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఆగ్రహం వెలిబుచ్చినట్లు ఓ వార్త చ‌క్క‌ర్లు కొట్టింది. ‘ఇలా శపథాలు చేయడం వల్ల రాయలసీమలోని ఇత‌ర‌ నేతలూ ఇదే బాట‌లో ప‌య‌నిస్తారు. అప్పుడు నా ప‌రిస్థితేంటీ’ అని సతీశ్ పై ఆగ్ర‌హించిన‌ట్టు స‌మాచారం.

ఈ విష‌యం సీఎం రమేశ్ వరకు చేరడంతో దీన్ని ఆయన అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి 80 ఓట్లు క్రాస్ కాగా, టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీకి 50 ఓట్లు క్రాస్ అయినట్లు కడప జిల్లాలో వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పటికీ క్రాస్ ఓట్లలో సగానికి పైగా సతీశ్ వర్గీయులవేనని ఎమ్మెల్సీగా గెలిచిన బీటెక్ రవి, సీఎం రమేశ్ అధిష్టానానికి చేరవేసినట్లు సమాచారం. పులివెందులో తనకు పోటీగా బీటెక్ రవి గెలవకూడదనే సతీశ్ రెడ్డే ఇలా చేయించార‌ని వారు ఫిర్యాదు చేసినట్లు వినిపిస్తోంది. అప్పటికే గండికోట నీళ్ల విషయంలో సతీశ్ చేసిన శపథంపై గుర్రుగా ఉన్న చంద్రబాబు .. తాజా ఫిర్యాదుతో రెండో దఫా ఎమ్మెల్సీ ఇవ్వకుండా నిరాకరించినట్లు సమాచారం. ఆ రకంగా సతీశ్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి శుభం కార్డు పడిందని అంటున్నారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో ఆయన పులివెందుల నుంచి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పోటీకి దిగడం అనుమానమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com