‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడు వెంకటేష్ మహా. ఇప్పుడు సత్యదేవ్ తో ఓ సినిమా చేస్తున్నాడని, ఈ సినిమా షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా మొదలైపోయిందని టాక్. ఈ చిత్రానికి ‘రావు బహదూర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ‘రావు బహదూర్’ అనేది బ్రిటీష్ కాలం నాటి బిరుదు. టైటిల్ ని బట్టి ఈ కథ పిరియాడిక్ డ్రామా అయ్యుండొచ్చనిపిస్తోంది. ఇందులో సత్యదేవ్ గెటప్, క్యారెక్టరైజేషన్ కూడా విచిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు రూ.25 కోట్లతో ఈ సినిమా రూపొందిస్తున్నార్ట. సత్యదేవ్పై ఇంత పెట్టుబడి పెట్టడం అంటే… కథని నమ్మి నిర్మాతలు చేస్తున్న రిస్క్ అనుకోవాలి. సత్యదేవ్ టాలెంటెడ్ యాక్టర్. ఇందులో అనుమానం లేదు. తనకో కమర్షియల్ హిట్ అవసరం.
సత్యదేవ్ హీరోగా ‘జీబ్రా’ అనే సినిమా ఆమధ్య విడుదలైంది. ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. సత్యదేవ్ కెరీర్లో కాస్ట్లీ సినిమా ఇది. ఆ తరవాత బడ్జెట్ పరంగా ‘రావు బహదూర్’నే పెద్ద సినిమా అనుకోవాలి. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసి, అప్పుడు మెల్లగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్లు ఇస్తుండొచ్చన్నది నిర్మాతల ప్లాన్. వెంకటేష్ మహా తీసిన రెండు సినిమాలూ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. ఇప్పుడు ఓ కమర్షియల్ ప్రయత్నం చేస్తున్నాడు. కమర్షియల్ సినిమాలపై వెంకటేష్ మహా ఆమధ్య చేసిన కామెంట్లు చాలా వైరల్ అయ్యాయి. మరిప్పుడు వెంకటేష్ ఎలాంటి కమర్షియల్ హంగులతో ఈ సినిమా చేస్తున్నాడన్నది ఆసక్తికరం.