మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ తో పేరుతో ఓ బ్యానర్ పెట్టారు. నమ్రత ఈ బ్యానర్‌ని యాక్టివ్‌గా నడపాలని భావించారు. అయితే అనుకున్నంత క్రియాశీలంగా సినిమాలు రెడీ కావడం లేదు. గతంలో ‘మేజర్’ సినిమా ఈ బ్యానర్లో వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత మరో సినిమాను తీసుకొస్తున్నారు. అదే రావు బహదూర్. సత్యదేవ్ హీరో. C/o కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాలతో ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ గా పేరుతెచ్చుకున్న వెంకటేష్ మహ దర్శకుడు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వదిలారు. ఇదొక సైకాలజికల్ డ్రామా. ఓ రాజవంశం నేపథ్యంలో జరిగే కథ. రాజవంశీకుడి గెటప్‌లో సత్యదేవ్ లుక్ కొత్తగా ఉంది. మహేష్ బాబు, నమ్రత ఈ సినిమాను సమర్పిస్తున్నారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలు. ఆగస్ట్ 15న టీజర్ వదులుతున్నారు.
సత్యదేవ్ టాలెంట్‌కి లోటు లేదు. ఏ పాత్రనైనా చేయగలడు. గాడ్ ఫాదర్, కింగ్డమ్ లాంటి సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది గానీ అవి కెరీర్‌కి కలిసిరావడం లేదు. హీరోగా వచ్చిన సినిమాలు నిలబడటం లేదు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు ప్రజెంటర్‌గా సినిమా చేస్తున్నాడు. మహేష్ హస్తవాసి మంచిది. మేజర్ సినిమాకు నేషనల్ లెవల్లో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సత్యదేవ్‌కి ఓ విజయం కావాలి. రావు బహదూర్ ఆ విజయాన్ని ఇస్తుందేమో చూడాలి.