ప్రపంచంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాల సంరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులపై పూర్తి నిషేధంవిధిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇది పైకి కనిపించే నిర్ణయం. అంతర్గతంగా గతంలో ఓ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఆరావళి పర్వతాల్లో 90 శాతం పర్వతాలు కాదని ఉత్తర్వులు జారీ చేయడం.
90 శాతం ఆరావళి పర్వతాలు కాదు కొండలే !
కారణం ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన కొత్త నిర్వచనం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రం ఉత్తర్వు ప్రకారం.. స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు అంటే సుమారు 328 అడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాటిని మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తామని ప్రకటించింది. అక్కడ మాత్రమే మైనింగ్ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం గతంలో పేర్కొంది. నిజానికి ఆరావళి శ్రేణిలోని దాదాపు 91 శాతం కొండలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయి. ఈ నిబంధన వల్ల ఆ కొండలన్నీ మైనింగ్ మాఫియా చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడింది.
తాజ్ మహల్ కట్టిన రాళ్లు ఆరావళి పర్వతాల్లోనివే !
ఆరావళి పర్వత శ్రేణులు అపారమైన, అత్యంత విలువైన ఖనిజ సంపదకు నిలయాలు. ఈ ప్రాంతంలో లభించే పాలరాయి, గ్రానైట్ ప్రపంచ స్థాయి నాణ్యతకు పేరుగాంచాయి. ఇక్కడి మక్రానా పాలరాయితోనే తాజ్ మహల్ నిర్మించారు. వీటితో పాటు, ఇక్కడ లభించే సీసం , జింక్ , రాగి , వెండిఖనిజాలు పారిశ్రామికంగా అత్యున్నత గ్రేడ్‌ను కలిగి ఉంటాయి. అలాగే, సిరామిక్ పరిశ్రమలో వాడే ఫెల్డ్‌స్పార్, క్వార్ట్జ్ వంటి అలోహ ఖనిజాలు , అత్యంత నాణ్యమైన రాతి సున్నం ఇక్కడ విస్తారంగా లభిస్తాయి. ఈ పర్వతాల్లోని ఖనిజాల రసాయన మిశ్రమం , దృఢత్వం కారణంగా గ్లోబల్ మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉంది. అందుకే మైనింగ్ మాఫియా కన్ను ఎప్పుడూ వీటి మీద ఉంటుంది.
ఊపందుకుంటున్న సేవా ఆరావళి ఉద్యమం
కేంద్రం కొత్త ఉత్తర్వులతో సేవ్ ఆరావళి ఉద్యమం ప్రారంభమయింది. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది కానీ.. ఆ ఉత్తర్వును నిలిపివేయలేదు. కానీ కొత్త లీజులు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒకవేళ చిన్న కొండలను మినహాయిస్తే థార్ ఎడారి వేగంగా విస్తరించి పర్యావరణ విపత్తు సంభవిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే మన దేశంలో మైనింగ్ అంటేనే పెద్ద స్కాం. అనుమతి లేకుండా తవ్వుకుపోవడమే చేస్తూంటారు.అందుకే ఆరావళిని కాపాడుకోవడం ఉత్తర్వులతో సాధ్యమా.. ఓ లూప్ హోల్ పెట్టిన తర్వాత అసలు సాధ్యమా అన్న ప్రశ్న వస్తోంది.
