రివ్యూ: సావిత్రి

యువ హీరోలంతా మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే న‌యం అనుకొంటున్న స‌మ‌యంలో… నారా రోహిత్ కాస్త డిఫ‌రెంట్ ఎటెమ్ట్‌లే చేశాడు. బాణం, ప్ర‌తినిధి.. సినిమాలు గొప్ప హిట్లేం కావు. కానీ.. ఆ ప్ర‌య‌త్నం ఆక‌ట్టుకొంది. నారా రోహిత్‌పై ప్రేమ పెరిగింది. అది అభిమానంగా మారేలోగా స‌డ‌న్‌గా క‌మ‌ర్షియాలిటీ వైపు అడుగులు వేయ‌డం మొద‌లెట్టాడు రోహిత్‌. అదిగో.. అక్క‌డే త‌ప్ప‌ట‌డుగులు ప‌డ్డం మొద‌లెట్టాయి. మిగిలిన హీరోలు ఏదో విధంగా కొత్త‌ద‌నం ట్రై చేస్తున్న‌ప్పుడు.. నారా రోహిత్ రూటు మార్చ‌డం కేవ‌లం యాదృచ్ఛిక‌మే కావొచ్చు. కానీ అత‌ని కెరీర్‌కి అవే అడ్డుగోడ‌లుగా మారే ప్ర‌మాదం వ‌చ్చింది. తుంట‌రితో చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయింది. ఆ ప్ర‌మాదం నుంచి తేరుకొనే లోగా సావిత్రిని రంగంలోకి దించేశాడు. పేరు, ప్ర‌చార చిత్రం, అందులోని డైలాగులు వింటుంటే.. రోహిత్ మ‌ళ్లీ ఓ కొత్త క‌థ వినిపిస్తున్నాడ‌న్న భ‌రోసా క‌లిగింది. మ‌రి… ఆ న‌మ్మ‌కం ఏమైంది? రోహిత్ మారాడా, ప్రేక్ష‌కుల్ని మార్చాడా.. సావిత్రి రంగు రూపు తీరు ఎలా సాగాయి. లెట్స్ గో.. ఇన్ డిటైల్స్‌.

* క‌థ

సావిత్రి (నందిత) కి పెళ్లంటే ఎంతిష్ట‌మో. పుట్ట‌డ‌మే ఓ పెళ్లి వేడుక‌లో పుడుతుంది సావిత్రి. అప్ప‌ట్నుంచి పెళ్లీ.. పెళ్లీ అంటూ ప‌డి చ‌స్తుంది. తండ్రి (ముర‌ళీ శ‌ర్మ‌) ఓ సంబంధం కుదరుస్తాడు. షిర్డీ ప్ర‌యాణంలో సావిత్రికి రిషి (నారా రోహిత్) ప‌రిచ‌య‌మ‌వుతాడు. అత‌నో డాక్ట‌ర్‌. కానీ ఫుల్ మాస్ క్యారెక్ట‌ర్‌. సావిత్రిని తొలి చూపులోనే ప్రేమించి, వెంటబడతాడు. కానీ సావిత్రి మాత్రం ‘నాకు పెళ్లి కుదిరిపోయింది మ‌హాప్ర‌భో..’ అంటూ త‌ప్పించుకొంటుంది. అప్ప‌టికి రిషికి కూడా పెళ్లి ఫిక్స‌వుతుంది. తాను కోరుకొన్న ల‌క్ష‌ణాలున్న సావిత్రి దొరికింద‌న్న ఆనందంలో.. అత్యుత్యాహంలో ఆ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొంటాడు. కానీ.. చివ‌రికి తేలిందేంటంటే.. త‌న‌కు ఫిక్స‌యిన ఆ పెళ్లి కూతురు సావిత్రినే అని. విష‌యం తెలుసుకొని… సావిత్రి తండ్రిని బ‌తిమాలాడ‌తాడు రుషి. కానీ ‘సంస్కారం లేని నీలాంటివాడికి నా కూతుర్ని ఇవ్వ‌ను…’ అంటూ తిర‌స్క‌రిస్తాడు. మ‌రి.. సావిత్రిని రుషి ఎలా ప్రేమ‌లోకి దింపాడు. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకొన్నారా, లేదా? అనేదే ఈ చిత్ర క‌థ‌.

* విశ్లేష‌ణ‌

ప్రేమ ఇష్క్ కాద‌ల్ అంటూ… ఓ స‌మ‌కాలిన ప్రేమ‌క‌థ‌ని వినూత్నంగా తెర‌పై ఆవిష్క‌రించాడు ప‌వ‌న్ సాదినేని. ఆ సినిమా చూశాక‌.. ప‌వ‌న్ తీయ‌బోయే సావిత్రిపైనా అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం. మ‌రోవైపు హీరో నారా రోహిత్ కావ‌డంతో వీరిద్ద‌రూ క‌లిసి సావిత్రిని కొత్త పుంత‌లు తొక్కించేయ‌డం ఖాయం అనుకొంటారు. కానీ.. అలాంటి ఆశ‌ల‌కు ఏమాత్రం స్కోప్ ఇవ్వ‌లేదు వీళ్లిద్ద‌రూ. ఎంచుకొన్న‌ది పాత రొటీన్ చింత‌కాయ్ ప‌చ్చ‌డి లాంటి క‌థ‌. ఆల్రెడీ వివాహం నిశ్చ‌య‌మైన అమ్మాయిని ప్రేమించ‌డం… అనే పాయింట్‌ని వెంక‌టేష్ ఒక‌టికి పదిసార్లు చేసీ చేసీ బోర్ కొట్టించేశాడు. ఇప్పుడు అదే పాయింట్‌ని.. ఓ చిన్న ట్విస్టు జోడించి రాసుకొన్నాడు ప‌వ‌న్‌. ద్వితీయార్థం చూస్తే.. ప‌రుగు లాంటి క‌థ‌లు ప‌రుగందుకొంటూ.. మ‌న మ‌న‌సుల్లోకి చొర‌బ‌డ‌తాయి. మొత్తానికి క‌థ విష‌యంలో ద‌ర్శ‌కుడు పెద్ద‌గా ఆలోచించ‌లేదు అన్నది అర్థ‌మైపోతుంది. ఇక క‌థ‌నం, స‌న్నివేశాల్ని న‌డిపించిన విధానం రెండూ రొటీన్ ఫార్ములాను అనుగుణంగా సాగేవే. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌.. ఆ పాట చూస్తే.. ప‌వ‌న్ ఎత్తుకొంది రొటీన్ సినిమానే అనిపిస్తుంది. ఆ న‌మ్మ‌కం ప్ర‌తీ సీనుకీ నిజం చేసుకొంటూ వెళ్లాడు ప‌వ‌న్‌. ఇప్ప‌టి ప్రేక్ష‌కుడికి క‌థ అవ‌స‌రం లేదు… వినోదాత్మ‌క స‌న్నివేశాల్ని పేర్చుకొంటూ వెళ్తే చాల‌ని ప‌వ‌న్ భావించి ఉంటాడు. సావిత్రి ఫ‌స్టాఫ్ కామెడీని న‌మ్ముకొని సాగించిన ప్ర‌యాణ‌మే. ట్రైన్ ఎపిసోడ్ ఎంత‌కీ పూర్త‌వ్వ‌దు. ప్రభాస్ శీను, షకలక శంకర్, స‌త్య‌, పోసాని ఇలా హాస్య‌న‌టులు చాలామంది ఉన్నా.. వాళ్ల నుంచి ద‌ర్శ‌కుడు పిండుకొన్న వినోదం మాత్రం చాలా త‌క్కువ‌. సీనంతా హాస్య‌న‌టులతో నిండిపోయినా.. ప్రేక్ష‌కుడికి ఆవులింత‌లు త‌ప్ప న‌వ్వే రాదు. ఫ‌స్టాఫ్ ఏదోలా గ‌డిచిపోయిందిలే అనుకొంటే.. సెకండాఫ్ మ‌రింత ఇబ్బంది పెడుతుంది. ఓ స‌న్నివేశాన్ని ఫ‌న్ జోడించి చెప్పాలా, ఎమోష‌న్ టచ్‌తో సాగాలా.. అనే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు స‌రిగా అర్థం చేసుకోలేక‌పోయాడు. అటు ఎమోష‌న్ పీక్స్‌కి వెళ్ల‌క‌, ఇటు వినోదం పండ‌క‌.. చాలా సీన్లు పైపైనే తేలిపోయాయి. ప‌తాక స‌న్నివేశాల‌తో మ‌ళ్లీ ఈ సినిమాని గాడిన పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఒక‌ట్రెండు ట్విస్టులు ఉన్నా.. అవేం స‌రిగా పండ‌లేదు. దాంతో… ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం వృథాగా మారింది.

హీరో, హీరోయిన్ల క్యారెక్ట‌ర్లు చూడ్డానికి భీక‌రంగా క‌నిపిస్తున్నా.. లోలోప‌ల బ‌ల‌హీనంగా మారాయి. హీరో పాత్ర లెంగ్త్‌, అండ్ లైన్ స‌రిగా కుద‌ర‌లేదు. ఏదోదో చేస్తాడు. హీరోయిన్ నందిత‌దీ సేమ్ క్యారెక్ట‌ర్‌. అల్ల‌రో, తింగ‌రిత‌న‌మో, అమాయ‌క‌త్వ‌మో అర్థం కాదు. ఓ స‌మ‌యంలో ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో చెప్ప‌లేం. సావిత్రి అని పేరు పెట్టి సినిమా తీసి… ఆ పాత్ర‌నీ బ‌ల‌హీనంగా రాసుకోవ‌డం ఇబ్బంది క‌లిగించే విష‌య‌మే. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ పండ‌డం అత్య‌వ‌స‌రం. కీల‌క‌మైన విష‌యం. దాన్నీ ద‌ర్శ‌కుడు తుంగ‌లో క‌లిపేశాడు.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

నారా రోహిత్‌కి సూట‌య్యే క‌థ కాదిది.. త‌నేదో ఎన‌ర్జిటిక్‌గా న‌టిస్తున్నా.. అనుకొంటున్నాడుగానీ అంతలేద‌న్న సంగ‌తి తెలియ‌డం లేదు. కామెడీ పండించ‌డం అంత ఈజీ కాదు. దానికి టైమింగ్ కావాలి. ఎక్స్‌ప్రెష‌న్స్‌లో బ‌లం ఉండాలి. ఈ రెండు విష‌యాల్లోనూ రోహిత్ తేలిపోయాడు. నందిత లాంటి మంచి న‌టి కూడా అప్పుడ‌ప్పుడూ డ‌మ్మీగా క‌నిపించింది. అదంతా.. పాత్ర డిజైన్ తాలుకూ ఉన్న లోప‌మే. ముర‌ళీ శ‌ర్మ‌.. ఇది వ‌ర‌కు భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌లో చేసిన పాత్ర‌నే ఇక్క‌డా కంటిన్యూ చేసిన‌ట్టు అనిపిస్తుంది. న‌టీన‌టుల లిస్టు చాంతాడంత ఉంది. కానీ… ఉప‌యోగం మాత్రం శూన్యం..

* సాంకేతికంగా

శ్ర‌వ‌ణ్ పాట‌లు ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. ఓ చిన్న సినిమా నిల‌బ‌డాలంటే… ఆ సినిమా సాంకేతికంగా అద్భుతంగా ఉండాల్సిందే. కానీ.. సంగీతంలో అన్ని అద్భుతాలు ఆశించ‌లేం. పాట‌లు సో సోగా అనిపిస్తాయి. కెమెరా వ‌ర్క్ బాగుంది. డైలాగులు అక్క‌డ‌క్క‌డా పేలాయి. కానీ.. వినోదం పండించే సీన్ల‌లో పంచ్‌లు ప‌డ‌లేదు. ద‌ర్శ‌కుడిగా ప‌వ‌న్ లో ప్ర‌తిభ‌ని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం గానీ. ఇలాంటి సాదా సీదా క‌థ‌ని ఎంచుకోవ‌డంలోనే పెద్ద త‌ప్పు చేశాడ‌నిపిస్తోంది. క‌థ బ‌ల‌హీనంగా ఉన్న‌ప్పుడు స్ర్కిప్టు విష‌యంలో మ‌రింత క‌స‌ర‌త్తు చేయాల్సింది.

* చివ‌రిగా…

సావిత్రి.. పేరు గోల్డు.. సినిమా ఓల్డు..

తెలుగు360.కామ్ రేటింగ్ 2/5

బ్యానర్ : విజన్ ఫిలిం మేకర్స్
నటి నటులు : నార రోహిత్, నందిత రాజ్,పోసాని కృష్ణ మురళి, అజయ్ , రవి బాబు, జీవా, వెన్నెల కిశోర్, ‘సత్యం’ రాజేష్, శ్రీ ముఖి, ధన్యా బాలకృష్ణన్, మధు నందన్ , శక లక శంకర్, ప్రభాస్ శ్రీను తది తరులు….
సినిమాటోగ్రఫీ :ఏ .వసంత్,
సంగీతం : శ్రావణ్,
మాటలు : కృష్ణ చైతన్య
ఎడిటింగ్ : గౌతం నేరుసు,
నిర్మాత : డా వి బి రాజేంద్ర ప్రసాద్,
కథా, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : పవన్ సాదినేని
విడుదల తేది :01.04.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాబోయే పవన్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ ట్విట్టర్ ట్రెండింగ్ ప్రాక్టీస్..!

ఈ రోజు డేట్ ఎంత.. జూలై 15. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ఎప్పుడు సెప్టెంబర్ రెండో తేదీ. ఈ రెండింటి మధ్య నెలన్నర గ్యాప్ ఉంది. కనీసం.. తర్వాతి...

పార్టిసిపెంట్స్ కోసం వేట మొదలు పెట్టిన బిగ్ బాస్ 4.

ప్రపంచంలో అత్యంత పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా ఒక సీజన్ ను నుంచి మరొక సీజన్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు 4వ సీజన్...

“గంటా”పైకి సైకిల్ వదిలిన విజయసాయిరెడ్డి..!

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్‌ఐ స్కాం అరెస్ట్ చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు గంటా శ్రీనివాస్‌పైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. ముందస్తుగా.. విజయసాయిరెడ్డి ట్వీట్ హింట్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు...

మేడిన్ ఇండియా 5G జియోదే..!

రాబోయే 5G కాలం ఇండియాలో జియోదేనని ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో సొంతంగా 5G సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని.. వచ్చే ఏడాది నుంచే.. ప్రపంచ స్థాయి సేవలను భారత్‌లో అందిస్తామని స్పష్టం చేసింది....

HOT NEWS

[X] Close
[X] Close