సామాన్యుడికి వంద నోటు దొరకడం లేదు. కష్టపడి సంపాదించిన సొమ్ముకే చిల్లర దొరకని పరిస్థితి. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బారుల్లో నిలబడలేక కొంతమంది చనిపోతున్నారు కూడా! ఓ పక్క సామాన్యుడిని ఈ తరహా అవస్థలకు గురి చేస్తున్న బ్యాంకులు, వందల కోట్లకు టోకరా వేసిన వాళ్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. నల్లధనం నిరోధానికి చర్యలు అంటూ కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటే… కోట్ల అప్పులు ఎగ్గొట్టినవారికి అనుకూలంగా ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం ఆగ్రహం తెప్పిస్తోంది. పరిశ్రమలు స్థాపిస్తామనీ, దేశాన్ని ఉద్ధిరించేస్తామనీ, యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని బ్యాంకుల దగ్గర వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నిర్ణయం తీసుకుంది. వారికి సంబంధించి దాదాపు రూ. 7 వేల కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం! ఇందులో విజయ్ మాల్యాకు చెందినవే రూ. 1201 కోట్ల రుణం ఉండం విశేషం!
అయితే, ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్న వేళ… ఈ నిర్ణయంపై మరింత స్పష్టత ఇస్తున్నారు. రుణాలు రద్దు అంటే మాఫీ కాదనీ, వేరే ఖాతాల్లోకి వాటిని మళ్లించడం అని చెబుతున్నారు. అడ్వాన్స్ అండర్ కరెక్షన్ అకౌంట్స్ (ఆకా) అనే పద్ధతి ప్రకారం మొండి బకాయిల్నీ నిరర్థక ఆస్తుల్నీ ఒక ప్రత్యేక ఖాతాలోకి బదిలీ చేస్తారు. అయితే, అలా ఖాతా మార్పిడి జరిగిన తరువాత మొండి బకాయిలేవీ బ్యాంకు బ్యాలెన్స్ షీట్లో కనిపించవన్నమాట. సాంకేతికంగా ఈ అప్పులు రైటాఫ్ చేసినట్టు కనిపిస్తున్నా… ఆకా ఖాతాలో ఉంటాయట. అంటే, వాటి వసూళ్లకు సంబంధించిన ప్రాసెస్ మరోపక్క నడుస్తూ ఉంటుందని చెబుతున్నారు. ఈ పద్ధతిలోనే విజయ్ మాల్యా ఎగ్గొట్టిన అప్పును కూడా రైటాఫ్ చేసి, ఖాతాలోకి మళ్లించినట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఇదే అంశమై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా పార్లమెంటులో స్పష్టత ఇచ్చారు. విజయ్ మాల్యా తీసుకున్న అప్పులు రద్దు చేసినట్టు కాదు, ఖాతా మాత్రమే మారిందని స్పష్టం చేశారు. సాంకేతికంగా రద్దు అంటారు… కానీ, అది మాఫీ కాదన్నారు!
అయినా, అన్ని వందల కోట్ల అప్పులు ఎగ్గొట్టి ఎక్కడో విదేశాల్లో తలదాచుకుంటున్న మాల్యాను వెనక్కి రప్పించడంలో ప్రభుత్వం వైఫల్యం స్ఫష్టంగానే కనిపిస్తోంది. ఆయన్ని రప్పించి, ముక్కుపిండి రుణాలు వసూలు చేయాల్సింది పోయి… ఎగ్గొట్టిన అప్పును వేరే ఖాతాలోకి మార్చుతున్నాం అంటూ ఈ ప్రకటనలు ఎందుకు..? మాల్యాకి ఇచ్చిన అప్పుడు నిరర్థక ఆస్తి అని బ్యాంకులే ప్రకటించాక… వసూళ్లు ప్రక్రియలో సీరియస్ నెస్ ఎక్కడ కనిపిస్తుంది..? బ్యాంకు ప్రకటించిన 63 మంది డిఫాల్టర్లలో ఈయనా ఒకరు! ఆ లిస్టు అలానే ఉంటుంది. ఆకా ఖాతా కూడా అలానే ఉంటుంది. మాల్యా మాత్రం ప్రజల సొమ్ము దోచుకుని విదేశాల్లో కులుకుతూ ఉంటారు! అయినా… రూ.9 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన పెద్ద మనిషి దేశం దాటి ఎలా వెళ్లిపోతాడండీ! వెళ్తూ ఉంటే చూస్తూ ఏం చేశారండీ..! అందుకే, ఇప్పుడు ఎస్బీఐ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వంపై నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ నిర్ణయం వెనక సాంకేతిక కారణాలు ఎన్ని చెప్పినా… మాల్యాపై చర్యలు ఎందుకు ఉండటం లేదన్నది సూటి ప్రశ్న.