గ్రామాల్లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న రాజకీయ రణం వచ్చేసింది. సర్పంచ్ ఎన్నికలను శరవేగంగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించేసింది. ఒక్క రోజు తేడాతో అంటే గురువారం తొలి విడుదల నోటిఫికేషన్ వస్తుంది. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ , ప్రచారం అన్నీ డిసెంబర్ 10లోపు పూర్తయిపోతాయి. 11న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. రెండో విడత, మూడు విడతకు రెండు రోజుల గ్యాప్ ఇచ్చి మూడో రోజు పోలింగ్ పెట్టారు. అంటే 14, 17న మిగిలిన రెండు విడతలు పూర్తయిపోతాయి.
ప్రతి విడతలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఫలితాలుఅదే రోజు ప్రకటిస్తారు. పూర్తిగా బ్యాలెట్లతో జరుగుతాయి కాబట్టి.. ఎక్కువ ఓటర్లు ఉన్న చోట్ల కౌంటింగ్ ఆలస్యమవుతుంది. రాష్ట్రంలో సుమారు 12,000కు పైగా గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నిమిషం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ పథకాల ప్రకటనలు, శంకుస్థాపనలు, బదిలీలు, కొత్త నియామకాలు తదితర కార్యక్రమాలపై ఆంక్షలు ఉంటాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇవి పార్టీ పరంగా జరగవు కానీ.. పార్టీ మద్దతుదారులు మాత్రం పోటీలో ఉంటారు.