ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ముందస్తుగానే నిర్వహించాలని అనుకుంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఈవీఎంలు వాడే ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చింది. స్థానిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలను ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లలోఇప్పటికే అమలు చేశారు. అక్కడ ఎన్నికలను పరిశీలించిన తర్వాత ఏపీలో కూడా ఆ విధానం అమలు చేస్తే బాగుంటుందని .. ఎస్సీఈ నీలం సహాని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెడతానంటున్నారు.
స్థానిక ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలంటే.. కొత్తగా ఈవీఎంలు కొనుగోలు చేయాలి. ఆ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే సాధ్యం కాదు. అయినా నీలం సహాని ప్రయత్నిస్తానంటున్నారు. నాలుగు దశల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈవీఎంలతో పోలింగ్ కు అంగీకరించే అవకాశాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు ప్రజలు తమ ఓట్లు ఎటు పోతున్నాయో తెలుసుకునే అవకాశం ఉండాలంటే.. బ్యాలెట్ మంచిదని ప్రభుత్వ అభిప్రాయం.
వైసీపీ కూడా ఈవీఎంలను అంగీకరించదు. తాము గెలిచినప్పుడు ఈవీఎంలు అద్భుతమని.. ఓడిపోయినప్పుడు ఓట్ల చోరీ అని మాట్లాడతారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నియమించిన ఎస్ఈసీనే ఈ ప్రతిపాదన తెచ్చినప్పటికీ వారు అంగీకరించే అవకాశం ఉండదు. ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికల విషయంలో వాటి జోలికి వెళ్లే అవకాశాలు ఉండవని.. నీలం సాహ్ని ఓ ప్రతిపాదనను మాత్రమే ప్రభుత్వం ముందు పెట్టబోతూ.. మీడియాతో చెప్పారని అంటున్నారు.