ఆ ఫొటో వెనుక.. పాట్న‌ర్ షిప్ క‌థ‌!

మొన్న ట్విట్ట‌ర్‌లో బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్ అంటూ త‌న దేవుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో తీయించుకొన్న ఫొటో ట్విట్ట‌ర్‌లో పెట్టి… త‌న ‘రీ ఎంట్రీ’ని ఘ‌నంగా చాటాడు బండ్ల గ‌ణేష్‌. ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చి, అందులో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి.. త‌న జోరు మ‌రోసారి చూపించాడు. బండ్ల రీ ఎంట్రీ మామూలుగా లేన‌ట్టే. చాలా పెద్ద ప్లాన్‌తోనే వ‌చ్చాడిప్పుడు చిన్న సినిమాలు ఎడా పెడా తీస్తూ.. మ‌రో 50 ఏళ్ల పాటు సినిమాలు తీస్తూనే ఉంటాన‌ని, ఓ స్టూడియో కూడా క‌ట్టేస్తాన‌ని త‌న ఫ్యూచ‌ర్ ప్లాన్ అంతా పూస గుచ్చిన‌ట్టు చెప్పాడు.

అంతా బాగానే ఉంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప‌ర‌మేశ్వ‌ర ఆర్ట్స్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ రెండూ క‌ల‌సి చిన్న సినిమాలు తీస్తాయ‌ట‌. అంటే.. మొన్న ప‌వ‌న్ ఫొటో వెనుక‌… ఇంత క‌థ న‌డిచింద‌న్న‌మాట‌. ప‌వ‌న్ ని క‌ల‌వ‌డానికి వెళ్లింది ‘పాట్న‌ర్ షిప్‌’ కోస‌మ‌న్న‌మాట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సంస్థ నుంచి చిన్న సినిమాలు తీస్తాన‌ని ఎప్ప‌టి నుంచో చెబుతూనే ఉన్నాడు. చెప్ప‌డం మిన‌హా ఆ ఊసెత్తింది లేదు. అయితే.. త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ కోసం, త‌న అభిమాని నితిన్ కోసం ఓ సినిమా తీస్తున్నాడు. పేరుకి ప‌వ‌న్ నిర్మాతే అయినా.. డ‌బ్బులన్నీ నితిన్‌వే అన్న టాక్ బ‌య‌ట జోరుగా వినిపిస్తున్నాయి. స‌రిగ్గా అదే ఒప్పందంతో గ‌ణేష్‌తో ప‌వ‌న్ సినిమాలు తీసినా తీయొచ్చు. నిర్మాతగా ప‌వ‌న్ పేరు జోడిస్తే.. సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. ఆడియో ఫంక్ష‌న్ల‌లో ప‌బ్లిసిటీలో ప‌వ‌న్‌ని ఎడా పెడా వాడేసుకోవొచ్చు. ఈ ట్రెండ్ క‌నీసం నాలుగు సినిమా వ‌ర‌కూ కొన‌సాగినా చాలు. బండ్ల సొమ్ములు చేసేసుకొంటాడు. ఆ వ‌చ్చిన దాంట్లో ‘బాస్‌’కి కాస్త వాటా ఇచ్చేస్తాడు. సూప‌ర్ ప్లాన్ బండ్ల‌.. ఇలాంటి విష‌యాల్లో నిన్ను కొట్టేవాడే లేడు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com