యుద్ధం ముగించడానికి అమెరికా, ఇరాన్ మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇవి పరోక్షంగా జరుగుతున్నాయి. ఇరాన్ తన వైపు నుండి ప్రధానంగా మూడు డిమాండ్లను ముందుంచినట్లు తెలుస్తోంది. మొదటిది ఇజ్రాయెల్ తన భూభాగంపై చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలి. రెండోది ఇరాన్ నావికాదళాధిపతి అలీరెజా తంగ్సిరి వంటి ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలి. మూడోది తమ దేశంపై విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలను పాక్షికంగానైనా ఎత్తివేస్తేనే, తాము హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి చమురు సరఫరాను పునరుద్ధరిస్తామని ఇరాన్ ప్రతిపాదిస్తోందని చెబుతున్నారు.
మరోవైపు అమెరికా కూడా తనదైన శైలిలో షరతులను విధిస్తోంది. ఇరాన్ తన మద్దతుదారులుగా ఉన్న హెజ్బొల్లా, హౌతీ రెబల్స్ , హమాస్ గ్రూపులకు ఆయుధ సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, హార్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకలపై జరుగుతున్న దాడులను ఇరాన్ అదుపు చేయాలని కోరుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ షరతులకు అంగీకరిస్తే, ఇజ్రాయెల్ను సంయమనం పాటించేలా ఒత్తిడి చేస్తామని, ఆగిపోయిన అణు ఒప్పంద చర్చలను తిరిగి పునఃప్రారంభించేందుకు సిద్ధమని అమెరికా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అయితే ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే హార్మూజ్ జలసంధిని సీజ్ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఇరాన్ నౌకాదళ చీఫ్ అలీరెజాను ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఆయనతో పాటు కీలకమైన కమాండర్లు కూడా చనిపోయారు. ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు.
ఒకవేళ చర్చలు విఫలమైతే, ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన క్షిపణులతో మురు కేంద్రాలపై దాడి చేసే అవకాశం ఉంది. అదే జరిగితే అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని భావిస్తున్నారు. రాబోయే 48 గంటలు ఈ విషయంలో అత్యంత కీలకం కానున్నాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంటున్నారు.
