ఓటుకు నోటు కేసు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు.. తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే, స్టీవెన్సన్తో బేరాలు సాగించినట్టు వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయింది ఆయనే! స్టీవెన్సన్కు డబ్బు ఎరజూపుతూ ఆ వీడియో టేపుల్లో రేవంత్ మాట్లాడిన వైనాన్ని అందరూ చూశారు. ఆ తరువాత, ఆయన జైలుకు వెళ్లారు. చినికి చినికి గాలివాన అన్నట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా ఈ కేసు ఓ సంచలనమైంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ సిగపట్ల వరకూ వచ్చేశారు. ఆ తరువాత, డీల్ ఎలా ఎక్కడ కురిదిందో తెలీదుగానీ… ఆ కేసు నెమ్మదిగా నీరు గారడం మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి కూడా జైలు నుంచి బయటకి వచ్చారు. అయితే, ఈ కేసు బయటపడ్డాక రేవంత్ రెడ్డి చేసింది చాలా గొప్ప పని అని ఎవరైనా అనుకుంటారా..? పోనీ, అలా గుడ్డిగా వెనకేసుకొచ్చే ధైర్యం ఆ పార్టీ అధినేతకైనా ఉంటుందా..? ఇన్నాళ్లకు రేవంత్ జైలుకు వెళ్లిన వైనాన్ని అద్భుతంగా చిత్రించే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ!
స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లడమూ… ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లడమూ ఒకేటే అవుతుందా..? ఈ రెండింటినీ ఒకేగాటన కట్టడం సాధ్యమౌతుందా..? ప్రస్తుతం అదే పనిచేశారు ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే దళవాయి సీతక్క. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడాన్ని ఎంతో గొప్పగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తున్నట్టు ఓ కుట్ర పన్ని, దాని ప్రకారమే రేవంత్‌ను జైలుకు పంపించారని అన్నారు. జైలుకు వెళ్లినవారందరూ నేరస్థులు అవుతారా అని సీతక్క ప్రశ్నించారు. మనదేశం కోసం నాడు స్వతంత్ర పోరాటం జరుగుతుంటే ఎంతోమంది జైలుకు వెళ్లి వచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికి 30 సార్లు జైలుకు వెళ్లాలనీ, ఎందుకంటే ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు.
సొంత పార్టీకి చెందిన నాయకుల్ని మరీ ఇంత గుడ్డిగా వెనకేసుకొస్తే ఎలా..? ప్రజలు అన్నీ గమనిస్తుంటారు కదా! పైగా, ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కున్నా కూడా పార్టీపరంగా ఇంతవరకూ ఆయనపై ఎలాంటి చర్యలూ లేవు. చివరికి చంద్రబాబు కూడా రేవంత్‌నే వెనకేసుకుని రావాల్సిన వైనాన్ని చూశాం. ఏదైతేనేం ఆ అంశాన్ని నెమ్మదిగా మరిపించేందుకు తెలుగుదేశం సాయశక్తులా ప్రయత్నించింది. కానీ, కేసుల్లో జైలుకు వెళ్లడానికీ, స్వతంత్ర పోరాటంలో జైలుకు వెళ్లడానికీ పోలిక ఏంటండీ… మరీ విడ్డూరంగా!