సెన్సెక్స్ శాంతిః… పృథ్వీశాంతిః

సెన్సెక్స్ కుప్పకూలడంతో అంతా బేంబేలుపడిపోతున్నారు. ఒకే ఒక్క రోజులో ఏడులక్షలకోట్లు ఆవిరైపోయాయి. దీంతో దేశఆర్థిక పరిస్థితిపై ఎన్నో అనుమానపునీడలు పరుచుకుంటున్నాయి. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ధైర్యవచనాలు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులకు శాశ్వత పరిష్కారం ఉన్నదా? ఉంటే అది ఏమిటన్నదే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రధాన అంశం.

ఆగస్టు 24, 2015 స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో `బ్లాక్‌ మండే’గా మిగిలిపోయింది. ఈ దయనీయమైన స్టాక్ మార్కెట్ స్థితికి అనేక కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ ప్రతికూల ప్రభావం చూపడమేనట. ప్రపంచ గ్లోబల్ మార్కెట్లు సంక్షోభంలో చిక్కుకోవడం, అమెరికా వాల్ స్ట్రీట్ ప్రభావం, ముడిచమురు ధరలు ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోవడం, విదేశీ పెట్టుబడులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడం, గ్రీస్ సంక్షోభం వంటి కారణాలుకూడా చెబుతున్నారు.

స్టాక్ మార్కెట్ లెక్కలు తెలిసినవాడి సంగతేమోగానీ, సామాన్యుడు మాత్రం ఈ పతనాలేమిటో అర్థంకాక బుర్రగోక్కుంటున్నాడు. ఇదంతా ఎకనమిక్స్ గారడీ లెక్కలు. చాలామందికి అర్థంకాకపోవచ్చు. అయితే, ఒకటి మాత్రం అర్థమవుతూనే ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి కేవలం మనచేతుల్లోలేదన్నది. డబ్బున్నంతమాత్రాన మనం మేడల్లో మిద్దెల్లో ఉన్నా, సుఖం ఉండదన్న విషయం అర్థమవుతోంది. పక్క దేశాలు కూడా సవ్యంగా ఉంటేనే మనకాళ్లూచేతులూ ఆడతాయన్ననిజం బయటపడుతోంది. అంటే, దీనిబట్టి ఏం అర్థమవుతోంది? ప్రపంచంలో ఎక్కడ అశాంతి కలిగినా అదిమనపై ఏదో రకంగా ప్రభావం పడుతుందనే అర్థంచేసుకోవాలి.

ఎక్కడో ఇరాక్ లో యుద్ధం వస్తే మనకు ఇబ్బంది. చమురుదేశాల్లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తితే మనకు గడ్డుకాలం. అమెరికాలో వాల్ స్ట్రీట్ తుమ్మినా, దగ్గినా మనకు తలనొప్పే. గ్రీస్ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తితే మనకిక్కడ దిగులు. మొత్తంగా ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి కష్టం వచ్చినా మనకిక్కడ కష్టం, నష్టం. ఎప్పుడు రూపాయి విలువ పడిపోతుందో, మరెప్పుడు గట్టెక్కి ఊపిరిపీల్చుకుంటుందో తెలియని అయోమయపరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆర్థికమాంద్యం, స్టాక్ మార్కెట్ పతనం, ఉగ్రవాదం, యుద్ధాలు, కరువుకాటకాలు, సునామీలు, పెనుభూకంపాలు…ఇవి ఏదేశానికి వచ్చినా మనమంతా ఒక్కటే అన్నట్టు ఆ సవాళ్లను అధిగమించాల్సిందే.

ఈ ప్రపంచమంతా పచ్చగా ఉండాలి. ఈ భూమి చల్లగా ఉండాలి. ఎక్కడా కరువుకాటకాలు రాకుండా, యుద్ధభయాలు లేకుండా, విధ్వంస దుశ్చర్యలకు ఎవరూ దిగకుండా ఉండాలి. అప్పుడే మనమూ బాగుంటామన్న సందేశాన్ని ప్రస్తుత `బ్లాక్ మండే’ మరోసారి మనకు అందించింది.

శాంతి సూక్తం

మన పూర్వీకులు అందుకనే మనకు శాంతి సూక్తం అందించారు. అందులో ఏమున్నదంటే…

ఓం ద్యౌః శాంతిః అంతరిక్షం శాంతిః పృథ్వీ శాంతిః ఆపః శాంతిః ఓషధయః శాంతిః వనస్పతయః శాంతిః విశ్వేదేవాః శాంతిః బ్రహ్మా శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః

దీని అర్థం…

`ఆకాశంలో శాంతి నెలకొనుగాక! అంతరిక్షంలో శాంతి నెలకొనుగాక! భూమండలంలో శాంతి నెలకొనుగాక! నీటిలో శాంతి నెలకొనుగాక! చేట్టుచేమలలో శాంతి నెలకొనుగాక! సకల దేవతలు శాంతిని ప్రసాదింతురుగాక! సమస్తమూ మనకు ప్రశాంతతను ప్రసాదించుగాక!’

అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే ఇక్కడ మనం (భారతీయులం) ఎందుకని కుదేలు చెందాలి.. గ్లోబల్ మార్కెట్లు ఏమైతే మనకేంటి? అని అనుకుని కూర్చునే పరిస్థితిలేదు. ఇలాంటి దుర్భర పరిస్థితులు దాపురిస్తాయనే మన పెద్దలు ప్రపంచమంతటా సమతౌల్యం ఉండాలని కోరుకున్నారు. బ్యాలెన్స్ ఎక్కడ తప్పినా అది అనర్థాలకు దారితీస్తుందన్నదే వారి ఉవాచ. ఈ సమతౌల్యం చెట్టూచేమ విషయంలో కావచ్చూ, లేదా సాంఘిక, ఆర్థిక స్థితిగతుల్లో కావచ్చు.

ఏకసూత్రం

ఆర్థిక సూత్రాలుకానీ, లేదా సాంఘికపరమైన సూత్రాలు కానీ అన్నిదేశాల నడుమ సమతౌల్యం ఉంటేనే ప్రపంచ శాంతిస్థాపన జరుగుతుందని ఆనాడే మహర్షులు , జ్ఞానులు చాటిచెప్పారు. అయితే ఆ సిద్ధాంతాలను ఎగతాళిచేస్తూ ఏవగించుకోవడం వల్లనే ఇలాంటి వైపరీత్యాలు ఉద్భవిస్తున్నాయి. ఆర్థికసంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముడితే ఫలితాలు ఎంతటి దారుణంగా ఉంటాయో ప్రపంచదేశాలు గతంలో రుచిచూశాయి. అయినా ఏదేశానికి ఆదేశం పృధ్వీ శాంతి సూత్రాన్ని మరచిపోయి స్వార్థపూరిత చర్యలు తీసుకోవడంవల్లనే సంక్షోభాలు తలెత్తుతున్నాయి. మానవజాతి వికృత ఆలోచనలే ఆ జాతి అంతానికి దారితీస్తాయేమోనన్న భయం పట్టుకుందిప్పుడు. ఒకరికి మోదం, మరొకరికి ఖేదం అన్న చందంగా గ్లోబల్ మార్కెట్ సాగుతోంది. చమురు ధరలు తగ్గాయని సంతోషించాలా, లేక బంగారం ధరలు పెరిగాయని విచారించాలా ?? రూపాయి విలువ పడిపోయిందని దుఃఖించాలా, లేక మనవాళ్లు అమెరికాలో ఉన్నారు కనుక డాలర్ కి ఎక్కువ రూపాయలు వస్తాయని సంతోషించాలా? తెలియని పరిస్థితి. దేనికి బాధపడాలో, మరి దేనికి సంతోషించాలో తెలియనంతగా గ్లోబలైజేషన్ జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వకల్యాణం కోరుకోవడమే ఏకైకమార్గం. ప్రపంచదేశాల శాంతి కోసమే ఆలోచించాల్సిన తరుణం. పృధ్వీశాంతి, అంతరిక్షశాంతి లేకపోతే మనం ఎక్కడుంటాం? సెన్సెక్స్ భారీ పతనంతోనే ఇంతగా కలవరపడేమనం రాబోయే పెను సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోగలమా? ఆ స్థైర్యం రావాలంటే పృధ్వీ శాంతి మంత్రమే శరణ్యం. మానవ మనుగడకు కావాల్సిందిప్పుడు ఏకసూత్రమే. అదే శాంతి సూక్తం. అందరి అవసరాలు మనవి, మన అవసరాలు అందరివన్న ఆలోచన పెంపొందాలి. ఈ దిశగా గ్లోబల్ ఎవేర్ నెస్ పెరగాలి. అప్పటిదాకా ఇలాంటి ఆటుపోట్లు తప్పవు. కాదంటారా ?

– కణ్వస
([email protected])

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]