బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం లభించిన 1947 ఆగస్టు 15 తర్వాత కూడా తెలంగాణ ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చే అవకాశం లభించలేదు. భారత యూనియన్ లో విలీనం కావడానికి ఇష్టం లేని అప్పటి నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్, తనది స్వతంత్ర రాజ్యమని ప్రకటించుకున్నాడు. ఖాసిం రజ్వీ సృష్టించిన రజాకార్లనే సైన్యం అరాచకాలకు పాల్పడింది. ఈ అరాచకాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, వివిధ వర్గాల ప్రజలు తిరగబడ్డారు.
నైజాం సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయడానికి చర్చలే మార్గమని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం భావించింది. సమస్య కొలిక్కి వచ్చే వరకూ యథాతథ స్థితిని అమలు చేయాలని నిర్ణయించింది. అంటే హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నవాబు పాలించుకోవచ్చన్న మాట. కానీ, అప్పటి హోం మంత్రి సర్దార్ పటేల్ మాత్రం సైనిక చర్యే మేలని భావించారు. రజాకార్ల అరాచకాలు శ్రుతిమించడంతో సైన్యాన్ని పంపడానికి సిద్ధపడ్డారు. పోలీస్ యాక్షన్ గా పేరుపొందిన ఆనాటి సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు.
1948 సెప్లెంబర్ 13న సైనిక చర్య మొదలైంది. ప్రస్తుత మహారాష్ట్రలోని షోలాపూర్ లో నిజాం సైన్యాన్ని భారత సైన్యం ఓడించింది ముందుకు కదిలింది. భారత సైన్యాన్ని మట్టి కరిపిస్తానని బీరాలు పలికిన నిజాం, ఐదురోజులకే చేతులెత్తేశాడు. సెప్టెంబర్ 17న కాల్పుల విరమణ ప్రకటించాడు. భారత యూనియన్ లో చేరుతానని ప్రకటన చేశాడు. దీంతో భారత సైన్యం ఆపరేషన్ ను నిలిపివేసింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన సర్దార్ పటేల్ కు, నిజాం వంగి వంగి సలాం చేశాడు. తాను భారత యూనియన్ లో భాగమని సవినయంగా విన్నవించుకున్నాడు. ఐదు రోజుల యుద్ధంలో భారత సైన్యం 32 మంది సైనికులను కోల్పోయింది. 807 మంది నిజాం సైనికులు మరణించారు.
రాష్ట్రాల పునర్విభజన తర్వాత ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బనీ జిల్లాలు మహారాష్ట్రలో విలీనమయ్యాయి. గుల్బర్గ, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ జిల్లాలు కర్ణాటకలో విలీనమయ్యాయి. అప్పటి నుంచీ ఆ రెండురాష్ట్రాల్లోనూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్నారు. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా నిర్వహించడం లేదు.
తెలంగాణ విమోచనం తర్వాత నిజాం పాలన అంతమైందని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. ఆ తర్వాత కూడా నిజాం రాజ ప్రముఖ్ , అంటే గవర్నర్ గా అజమాయిషీ చెలాయించాడు. 1950 నుంచి 1952 వరకు వెల్లోడీ అనే ఉన్నతాధికారి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ విజయం సాధించింది. అలా, 1952 మార్చి 6న బూర్గుల రామకృష్ణా రావు ప్రభుత్వం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రంలో అదే తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం. 1956లో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల విలీనంతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కేసీఆర్ నాయకత్వంలో తెరాస ప్రభుత్వం ఏర్పడింది. కానీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి మాత్రం ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.