Shambhala movie review
Telugu360 Rating: 2.75/5
పురాణాల్లోంచి ఓ పాయింట్ పట్టుకొని, దానికి కాస్త మిస్టరీ జోడించి, థ్రిల్లర్ గా మలచడం ఇప్పటి ట్రెండ్. దేవుడు, దెయ్యం, మహిమలు.. ఇవి ఏ కథలో అయినా ఈజీగా మిక్స్ అయిపోతున్నాయి. దానికి తగిన ఫలితాలు కూడా వస్తున్నాయి. ‘శంబాల’ కూడా ఈ జోనర్ కథే. ఓ మిస్టీరియస్ ప్లేస్ ని ఎంచుకొని.. దాని చుట్టూ దేవుడు, ఉల్కాపాతం లాంటి ఎలిమెంట్స్ జోడించి, సైన్స్‌నీ శాస్త్రాన్ని ముడి పెట్టిన కథ ఇది. ఆది సాయి కుమార్ ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకొన్నాడు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశాడు. తన కెరీర్‌కు ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని గట్టిగా నమ్మాడు. మరి తన నమ్మకం ఫలించిందా? చాలామందికి హిట్ ఇచ్చిన ఈ జోనర్… ఆది కొత్త ఇన్నింగ్స్ ని నాంది పలికిందా?
1980 నాటి కథ ఇది. శంబాల అనే ఊరిలో ఓ ఉల్క పడుతుంది. అప్పటి నుంచీ ఆ ఊరిలో భయంకరమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఊరివాళ్లంతా ఆ ఉల్కని బండ భూతం అని పిలుస్తుంటారు. దాన్ని స్టడీ చేయడానికి సైంటిస్ట్ విక్రమ్ (ఆది సాయి కుమార్) రంగంలోకి దిగుతాడు. విక్రమ్ సైన్స్ ని మాత్రమే నమ్ముతాడు. కానీ శంబాల ప్రజలు మాత్రం శాస్త్రాన్ని, దేవుడ్ని, భూతాన్ని నమ్ముతుంటారు. బండ భూతం పడినప్పటి నుంచీ ఆ ఊర్లోని రాములు (రవి వర్మ) విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. తన ఆవు పాలు కూడా రక్తంలా మారుతుంది. ఆవుని చంపితే గానీ, ఊరికి శాంతి జరగదని ఊరివాళ్లంతా నమ్ముతారు. ఆవుని కాపాడి, తనతో పాటు తీసుకెళ్లిపోతాడు విక్రమ్. రాములు మాత్రం అనూహ్యంగా వికృత రూపం దాలుస్తుంటాడు. అడ్డొచ్చినవాళ్లందర్నీ చంపుకొంటూ వెళ్తాడు. ఓదశలో విక్రమ్ పై కూడా దాడి చేస్తాడు. అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది? ఉల్క వెనుక ఉన్న కథేమిటి? ఆ ఊర్లో భయానక ఘటనలు జరగడానికి కారణం ఎవరు? సైన్స్ ని మాత్రమే నమ్మే విక్రమ్.. దేవుడికి మొక్కాడా, లేదా? ఇదంతా మిస్టరీనే.
శంబాల అనే మిస్టీరియస్ ప్లేస్‌కి దేవుడు, దెయ్యం అనే ఎలిమెంట్స్ జోడించడంలోనే కథలో ఆసక్తి మొదలైపోతుంది. శివుడు అసురుడితో పోరాడిన కథ సాయికుమార్ వాయిస్ ఓవర్ లో వినిపించడంతోనే ప్రేక్షకులు కథలోకి వెళ్లిపోతారు. ఏఐలో చూపించే విజువల్స్‌కు సాయికుమార్ బేస్ వాయిస్ తోడవ్వడంతో ఆడిటోరియం ఎలెర్ట్ అయిపోతుంది. శంబాల ఊరిపై ఉల్క పడడం, అక్కడ వరుసగా మిస్టీరియస్ విషయాలు జరగడం… ఇలా సినిమా చక చక పరిగెడుతుంది. విక్రమ్ ఆ ఊరిలోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి సైన్స్ – శాస్త్రానికి మధ్య జరిగే డిస్కర్షన్ లా కొన్ని సీన్లు మారాయి. ఇలాంటి కథకు అలాంటి వాదోపవాదాలు అవసరమే. కాకపోతే కొన్ని చోట్ల ఈ చర్చ కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తుంది.
సుషుమ్న నాడి అనే కొత్త పాయింట్ ని దర్శకుడు ఎంచుకొన్నాడు. మన నాడీ వ్యవస్థలో చాలా కీలకమైన నాడీ ఇది. దాన్ని ఇలాంటి మిస్టీరియస్ కథలో ఓ పాయింట్ గా వాడుకోవడం మంచి ఆలోచన. అందుకే దర్శకుడు ఈ స్క్రిప్టుపై ఎగస్ట్రా కసరత్తు చేసినట్టు అర్థమవుతుంది. దుష్ట శక్తి ఆవహించిన బాడీలో ఈ సుషుమ్న నాడీ యాక్టీవ్ అవ్వడం, వాళ్లంతా వికృతంగా మారడం, దానికి అరిషడ్ వర్గాలు పాయింట్ మేళవించడం ఇదంతా కథకు కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చింది. ఇంట్రవెల్ బ్యాంగ్ ముందు జరిగిన విధ్వంసం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడే… హీరోకి దుష్ట శక్తి ఉందన్న విషయం అర్థం అవుతుంది. సైన్స్ ని నమ్మే హీరో.. శాస్త్రాన్ని నమ్మడానికి కొన్ని బలమైన సన్నివేశాలే రాసుకొన్నాడు దర్శకుడు. కథానాయిక పాత్రనీ అందులో భాగం చేయడం బాగుంది.
ద్వితీయార్థం మొత్తం ఈ సుషుమ్మ నాడీ చుట్టూనే తిరుగుతుంటుంది. దుష్ట శక్తి ఊర్లోవాళ్ల శరీరాల్లో ప్రవేశించడం, వాళ్లు వికృత చేష్టలు చేయడం.. కథంతా ఇలానే సాగుతుంది. దాంతో ఓ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి.. దర్శకుడి దగ్గర కొత్తగా చెప్పేందుకు ఏం లేదా? అనిపిస్తుంది. కథ మొదలెట్టినప్పుడు ఎత్తుకొన్న శివుడు – అసురుడు అంశం మళ్లీ ఎప్పుడొస్తుందా అనే ఎదురు చూపుల్లో పడిపోతారంతా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మలుపు, అమ్మాయి కాపాడడానికి హీరో చేసిన ప్రయత్నాలు ఇవన్నీ నచ్చేలా ఉన్నాయి. ముగింపు ఇంకాస్త శక్తిమంతంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. దుష్ట శక్తి ఉన్న ఆ ఊర్లోనే దైవ శక్తి కూడా ఉందని చెబుతుంటాడు దర్శకుడు. కానీ.. ఆ దుష్ట శక్తి యాక్టీవ్ అయినప్పుడు దైవ శక్తి ఎందుకు అడ్డుకోలేదు? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఆ దుష్టశక్తిని ఆపడానికి హీరోనే ఎందుకు రావాల్సివచ్చింది? అనేది కూడా అర్థం కాదు. అసలు ఇలాంటి కథలకు లాజిక్కులు వేయకూడదు. కాకోపోతే ఇది కేవలం దైవానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. సైన్స్ కి సంబంధించినది కూడా. అందుకే లాజిక్కులు అవసరం అవుతాయి. దేవుడి పాయింట్ పట్టుకొన్నా, దాన్ని చిత్తానికి వాడకుండా, ఎక్కడ కావాలో అక్కడే వాడుకొన్నాడు దర్శకుడు. ఈ విషయంలో మాత్రం దర్శకుడ్ని అభినందించాలి.
ఆది సాయికుమార్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో ఆ ఎదురు చూపులు ఫలించినట్టే. క్యారెక్టర్‌కి స్టికాన్ అయిపోయాడు. తన కోసం పాట, తన కోసం ఫైటు.. ఇలాంటి రూల్స్ లేవు. కనీసం హీరో పక్కన హీరోయిన్ కూడా లేదు. సిన్సియర్ గా తన ఎఫెక్ట్ పెట్టాడు. అర్చన అయ్యర్ ని హీరోయిన్ గా చూడలేం. ఓ పాత్ర అంతే. మధునందన్కి లెంగ్తీ పాత్ర పడింది. రవి వర్మపై కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు పడ్డాయి. తను కూడా రక్తి కట్టించాడు. సిజు, అన్నపూర్ణమ్మ పాత్రలు పరిధిమేర ఉన్నాయి.
విజువల్ గా సినిమా బాగుంది. చిన్న సినిమా అయినా మేకింగ్ లో రాజీ పడలేదు. భూతాల ఎఫెక్ట్స్ బాగా డిజైన్ చేశారు. కథని పరిచయం చేసినప్పుడు చూపించిన ఏఐ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన నేపథ్య సంగీతం మరింత బలాన్ని ఇచ్చింది. సన్నివేశాల రూపకల్పనలో దర్శకుడు శ్రద్ద పెట్టాడు. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా రాసుకొన్నాడు. దేవుడు – సైన్స్ వీటి ముడిపెట్టిన కథలెప్పుడూ బాగానే ఉంటాయి. ఎగ్జిక్యూషన్ సరిగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కథని వదిలిపెట్టకుండా, అందులోనే థ్రిల్లింగ్ మూమెంట్స్ జోడించుకొంటూ వెళ్లిన సినిమాలకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆ జాబితాలో ‘శంబాల’ కూడా చేరే అవకాశం ఉంది.
Telugu360 Rating: 2.75/5
