అటు శంకర్ కెరీర్లో, ఇటు రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీలో వెంటనే మర్చిపోవాల్సిన సినిమాగా మిగిలిపోయింది ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజుకు ఈ సినిమా ఆర్థికంగా చాలా నష్టాల్ని మిగిల్చింది. సినిమా ఫ్లాప్ అవ్వడం ఒక ఎత్తయితే, ఈ సినిమాకి అయిన వేస్టేస్ మరో ఎత్తు. శంకర్ సినిమా అంటేనే కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిర్మాతలు ఫిక్సయిపోతారు. ‘గేమ్ ఛేంజర్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా ఫుటేజ్ ఏకంగా ఏడున్నర గంటలు వచ్చిందట. ఈ విషయం బయటివాళ్లు చెబితే అంతగా నమ్మేవాళ్లు కాదు జనాలు. స్వయంగా ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన షమీర్ మహమ్మద్ రన్ టైమ్ గురించిన ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకొన్నారు.
తన ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు ఫైనల్ రష్ దాదాపు ఏడున్నర గంటలు వచ్చిందట. దాన్ని మూడు గంటలకు కుదించాడట షమీర్. అయితే తన వ్యక్తిగత కారణాలతో షమీర్ ఈ టీమ్ నుంచి తప్పుకొన్నాడు. ఆ తరవాత మరో ఎడిటర్ ఈ సినిమాని కాస్త ట్రిమ్ చేశాడు. అంటే.. అటూ ఇటుగా మూడు సినిమాలకు సరిపడా ఫుటేజీ అన్నమాట. దాన్ని బట్టి ఈ సినిమాలో ఎన్ని సీన్లు ఎడిటింగ్ లో లేచిపోయాయో అర్థం చేసుకోవొచ్చు.
ఈ సినిమాకు పని చేసిన చాలామంది నటీనటులు ఇచ్చిన కంప్లైంట్ ఒక్కటే. `మా సీన్లన్నీ ఎడిటింగ్ లో పోయాయి` అని. దాదాపు నాలుగు గంటల సినిమా లేపేశారంటే ఎన్ని సీన్లు కత్తెరకు బలయ్యాయో కదా? సీన్లు ఎడిట్ చేయడం పక్కన ఉంచండి. ఆయా సీన్లని తెరకెక్కించడానికి ఎంత ఖర్చయి ఉంటుంది. అంతెందుకు.. థియేటర్లో ఓ పాటే లేకుండా పోయింది. అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన పాటని కూడా థియేటర్లలో చూపించలేదంటే.. శంకర్ ఎంత నిర్లక్ష్యంగా ఈ సినిమా తీసి ఉంటాడో?