యూ ట్యూబ్ తో ఫేమ్ తెచ్చుకొన్నాడు షణ్ముఖ్ జశ్వంత్. కొన్ని వెబ్ సిరీస్ లలోనూ కనిపించాడు. ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తాడు. షణ్ముఖ్ హీరోగా ‘ప్రేమకు నమస్కారం’ అనే సినిమా రూపుదిద్దుకొంటోంది. భీమ శంకర్ దర్శకుడు. శివాజీ, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం షణ్ముఖ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ప్రేమలో ఫెయిల్ అయిపోతే, బ్రేకప్ చెప్పేస్తే… అబ్బాయిలంతా తాగుబోతులు అవ్వాల్సిన పనిలేదని, అమ్మాయిలపై రివైంజ్ తీర్చుకోవచ్చని హీరో తాగుబోతులందరికీ క్లాస్ పీకిన సీన్ ఇది. సినిమా కాన్సెప్ట్, కాన్ఫ్లిక్ట్ ఈ గ్లింప్స్ లో రిజిస్టర్ అయ్యేలా చెప్పగలిగారు.
యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కథతో సినిమా రూపుదిద్దుకొంటుందన్న విషయం అర్థం అవుతోంది. ఈమధ్య ‘లిటిల్ హార్డ్స్’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. మౌళి కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినవాడే. సోషల్ మీడియా ద్వారా తాను సంపాదించుకొన్న ఇమేజ్ మౌళికి, ఆ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు షణ్ముఖ్ విషయంలోనూ అదే జరుగుతుందేమో చూడాలి. షణ్ముఖ్ కూడా క్లిక్ అయితే.. మరింతమంది సోషల్ మీడియా స్టార్లు హీరోగా అవతారం ఎత్తే అవకాశం వుంది.