దళిత వాడల్లో పదివేల ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించడంపై ఏపీ పీసీసీచీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు RSS వాదిలా మారిపోయారని.. దళితవాడల్లో TTD నిధులతో గుడులు కట్టమని ఎవరు అడిగారని ఆమె ప్రశ్నించారు. TTD దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే గుడులు కాదు దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలని.. సూచిచారు. దళితవాడల్లో 5 వేల గుడులు కడితే పూజారులను దళితులను పెడతారా.. అని ప్రశ్నించారు. భారత దేశం సర్వమతల సమ్మేళనం. కానీ చంద్రబాబు RSS రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారన్నారు. గుళ్లు కట్టే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
షర్మిల హఠాత్తుగా గుళ్ల నిర్మాణం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. టీటీటీ నిధులు పూర్తి ధర్మ ప్రచారానికి మాత్రమే వినియోగిస్తారు. అందుకే వినియోగించాలి. ఇతర అవసరాలకు వినియోగించకూడదు. అదే సమయంలో షర్మిల చెప్పినట్లుగా సమస్యలు ఉంటే అవి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎవరి పనులు వారు చేస్తారు. టీటీడీ దళిత వాడల్లో ఆలయాలు కట్టడాన్ని ఇప్పటి వరకూ ఎవరూ వ్యతిరేకించలేదు. ఒక్క షర్మిల మాత్రమే.
షర్మిల కుటుంబం అంతా మత ప్రచారంలో ఉన్నారు. ఆమె భర్త క్రైస్తవ మత ప్రచారకుడు. కుమారుడు కూడా అమెరికా బైబిల్ కాలేజీలో డిగ్రీ చదివి ఇప్పుడు ప్రసంగాలు ప్రారంభిస్తారు. ఇలాంటి నేపధ్యం ఉన్న షర్మిల.. గుళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తే అది వివాదం అవుతుంది. ఆలయాలను నిర్మిస్తే మత మార్పిళ్లు తగ్గుతాయని .. అందుకే షర్మిల వ్యతిరేకిస్తున్నారని అనుకుంటారు. అయినా షర్మిల ఆలయాల నిర్మామాన్ని వ్యతిరేకిస్తున్నారు.