కాంగ్రెస్ ను రేసులోకి తీసుకురావాలనే ఆరాటమో, తను మాత్రమే ఏపీ కాంగ్రెస్ కు ఆశాకిరణం అని చెప్పాలనుకుంటున్నారో.. విమర్శలకు ఆస్కారం కల్పించేలా వైఎస్ షర్మిల రాజకీయం చేస్తున్నారు. కొన్నాళ్లుగా గురి తప్పిన రాజకీయం చేస్తున్న షర్మిల రాజధాని విషయంలోనూ అదే పొరపాటు చేసినట్టుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధానమంత్రి మోదీకి షర్మిల గిఫ్టు పంపించారు. ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్ళీ మట్టేనా ? అంటూ మోడీకి అమరావతి మట్టిని పంపిస్తున్నానని చెప్పారు. తాను పంపించే మట్టిని చూసైనా మోడీకి అమరావతికి ఇచ్చిన పాత హామీలు గుర్తుకు వస్తాయని ఆమె ఉద్దేశ్యం.
మట్టిని పంపడం పూర్తిగా రాజకీయమే,అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మట్టికి బదులు గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ , మరికొన్ని డిమాండ్లను పేర్కొంటూ షర్మిల లేఖ రాసి ఉంటే ఏదైనా ప్రయోజనం ఉండేది. లేఖలో తను పేర్కొన్న అంశాలు భవిష్యత్ లో అమల్లోకి వస్తే , వాటిని తన ఖాతాలో వేసుకునేందుకు అవకాశం ఉండేది.
దారితప్పిన రాజకీయం, సీనియర్ల ఉక్కపోత పాలిటిక్స్ తో ముందు వెనకా చూసుకోకుండా షర్మిల పాలిటిక్స్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె తాజా రాజకీయం ద్వితీయ శ్రేణి నాయకులు చేసే కార్యక్రమంలా ఉందని పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొత్త పంథాలో రాజకీయం చేసేందుకు సునీల్ కనుగోలు తరహలో ఆమెకూ ఓ కొత్త వ్యూహకర్తను నియమించాలని డిమాండ్లు వస్తున్నాయి.