వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు ఆస్తుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హత్య కేసు గురించి మాట్లాడుతుంటే, వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. నాకు ఆస్తులు ఎజెండా కాదు, ఆస్తుల కోసం నేను రాజకీయం చేయడం లేదు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన కట్టుకథల వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని నేను చెబితే, దానికి సమాధానం చెప్పలేక నాపై అపనిందలు వేస్తున్నారు అని ఆమె మండిపడ్డారు.
తన తల్లి వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై వైసీపీ చేస్తున్న విమర్శలను షర్మిల తీవ్రంగా ఖండించారు. ఆ లేఖ అబద్ధమైతే జగన్ నేరుగా తన తల్లిని అడగొచ్చు కదా అని ప్రశ్నించారు. విజయమ్మ లేఖ అబద్ధమని భావిస్తే, సాక్షి రిపోర్టర్‌ను పంపి ఆమె బైట్ తీసుకోవచ్చు కదా? ఆ ధైర్యం లేకే వైసీపీ నేతలతో అడ్డగోలుగా మాట్లాడిస్తున్నారు. వైఎస్సార్ ఆశయం ప్రకారం మనుమలందరికీ ఆస్తులు సమానంగా పంచాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే, దాన్ని కూడా ఫేక్ అనడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన తల్లిని, తనను విమర్శిస్తున్న వారిని సైతాన్లు, మొరిగే కుక్కలు గా షర్మిల అభివర్ణించారు. జగన్ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారని, సాక్షి పత్రికలో వైఎస్సార్ ఫోటో పెట్టుకుని సత్యమేవ జయతే అని రాస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఆస్తులే ముఖ్యం అనుకుంటే తాను తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదని, ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళింది కూడా తాను కాదని షర్మిల గుర్తు చేశారు. అక్రమంగా వేరే వాళ్ళ ఆస్తులు అనుభవించాల్సిన దుస్థితి తనకు పట్టలేదని, జగన్ లాగా తనకు స్వార్థ రాజకీయాలు తెలియవన్నారు.