దళితవాడల్లో ఆలయాల నిర్మాణాన్ని షర్మిల వ్యతిరేకించడంపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. టీడీపీ ఈ అంశాన్ని పట్టించుకోలేదు కానీ ఇలాంటి రాజకీయాలకు ట్రేడ్ మార్క్ అయిన బీజేపీ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని అనుకుంటోంది. అందుకే ఏపీ బీజేపీ నేతలంతా ఒకరి తర్వాత ఒకరు.. ఎప్పుడైనా గుడికి వెళ్లారా అని షర్మిలను ప్రశ్నించడం ప్రారంభించారు. రాహుల్ తో లింక్ పెట్టి షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ డిమాండ్ చేశారు.
టీటీడీ నిధులు పూర్తిగా ధర్మ ప్రచారానికే వినియోగిస్తారు. ఆలయాల నిర్మాణం కూడా అందుకే. దళితులను ఆలయాల్లో దూరం పెడుతున్నారని చెప్పి మత మార్పిళ్లు చేస్తూ వస్తున్నారని ఇప్పుడు ఆలయాలను దళిత వాడల్లోనే నిర్మించడం ద్వారా ఆ భావన పోగొట్టాలని టీటీడీ అనుకుంటోంది. అయితే షర్మిల మాత్రం దీన్ని వ్యతిరేకించారు. తమ బ్యాక్ గ్రౌండ్ గురించి అందరికీ తెలుసన్న క్లారిటీ ఉన్న తర్వాత కూడా ఇలాంటి ప్రకటన చేశారంటే.. ఆమె ఆషామాషీగా చేయలేదని దాని వెనుక కొన్ని లెక్కలు ఉంటాయని అనుమానిస్తున్నారు.
దళిత వాడల్లో ఇప్పటికే కన్వర్టడ్ అయిన క్రైస్తవులతో ఆలయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించి క్రైస్తవులను సంఘటితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. తద్వారా ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. షర్మిల బీజేపీ నేతల్ని ఉద్దేశించి ఒక్క మాట కూడా అనలేదు. చంద్రబాబు ఆరెస్సెస్ వాదిగా మారిపోతున్నారని అన్నారు. కానీ బీజేపీ నేతలు బాధ్యత తీసుకుని.. షర్మిల రాజకీయానికి తమ వంతు సాయం చేస్తున్నారు.