“ వైఎస్ రాజారెడ్డి సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తారు “ అని ఉల్లి రైతుల్ని పరామర్శించేందుకు కర్నూలు వచ్చిన షర్మిల ప్రకటించారు. తల్లితో పాటు రాజారెడ్డి కూడా ఆ పరామర్శకు వచ్చారు. ఇది ఎంట్రీ పాయింట్. నిజానికి కుమారుడికి రాజకీయంగా ఉండే ప్రత్యక్ష పరిస్థితులపై అవగాహన కల్పించడానికి ఆమె తీసుకు వచ్చి ఉంటారు. కానీ ఖచ్చితంగా తన వల్ల కానిది రాజారెడ్డి వల్ల అవుతుందన్న నమ్మకంతోనే షర్మిల ఉన్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
జగన్ జైలుకెళ్తే అనేది సమాధానం లేని ప్రశ్న
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనిశ్చితంగా ఉంది. జగన్మోహనరెడ్డి జైలుకెళ్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎక్కువ మందికి వస్తోంది. జగన్ రెడ్డి చేసినవి చిన్న చిన్న తప్పులు కాదు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నింటినీ వేధించారు. చేయకూడనంత అవినీతి చేశారు. అక్రమాలకు పాల్పడ్డారు. అంతకుముందు అక్రమాస్తుల కేసు విచారణ తేలాల్సి ఉంది. ఎలా చూసినా.. జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ గందరగోళంగా ఉంది. ఆయన జైలుకెళ్లడం ఖాయమని అత్యధిక శాతం నమ్ముతున్నారు. ఆ తర్వాత వైసీపీ పరిస్థితేమిటి?. షర్మిల ఇక్కడే తన ఆలోచనలకు పదును పెట్టారని అనుకోవచ్చు.
భారతి నాయకత్వానికి ఆమోదం లభించడం కష్టం
జగన్ జైలుకెళ్తే వైఎస్ భారతినే పార్టీని నడిపిస్తారు. అందుకే ఇప్పటి వరకూ ఆ కుటుంబంలో జరగాల్సినంత రచ్చ జరిగింది. ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయం లేదు. జగన్ అందుబాటులో లేని సమయంలో పార్టీ వైఎస్ భారతి నడిపిస్తారు. కానీ ప్రజామోదం ఉంటుందా అన్నది మాత్రం చెప్పడం కష్టం. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన వారసుడు రాజారెడ్డి అని షర్మిల తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దళితులు, ముస్లింలు జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎన్డీఏకు అమ్ముడు పోతూ ఉండటం వారిని నిరాశపరుస్తోంది. వారు కూడా సరైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను వెనక్కి తెచ్చుకునేలా షర్మిల ప్లాన్
షర్మిల సామర్థ్యం పై నమ్మకం లేకపోవడమో.. జగన్ బలంగా ఉండటం వల్ల కమో కానీ..గత ఎన్నికల్లో ఓటు బ్యాంకులో పెద్దగా మార్పు రాలేదు. కానీ కొంత మార్పు వచ్చింది. కడపలో కొన్ని సీట్లు వైసీపీ కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ చీల్చిన ఓట్లే. వచ్చే ఎన్నికల నాటికి.. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన దళితులు, ముస్లింలు నిజం తెలుసుకుని కాంగ్రెస్ వైపు ఐదు నుంచి పది శాతం మారినా.. అది వైసీపీని పాతి పెట్టేస్తుంది. ఆ తర్వాత అనివార్యంగా..కాంగ్రెస్ బలపడుతుంది. షర్మిల ఇలా దూరదృష్టితోనే ఆలోచించి.. రాజారెడ్డిని రంగంలోకి తెస్తున్నారని అనుకోవచ్చు. పాస్టర్ గా మారిన రాజారెడ్డి.. రాజకీయ ప్రసంగాల్లోనూ మంచి ప్రతిభ కనబరిస్తే.. జగన్ రెడ్డితో పోలికలు ఆటోమేటిక్‌గా వస్తాయి. అప్పుడు సులువుగా అడ్వాంటేజ్ సాధించగలడు.