షరీఫ్..! కొత్త రాజకీయానికి ఎదురొడ్డిన పాత నాయకుడు..!

షరీఫ్ మహ్మద్ అహ్మద్…!
ఎమ్మెల్సీ ఎం.ఎ.షరీఫ్…!
శాసనమండలి చైర్మన్ షరీఫ్..!
పిలుపులో మార్పు..హోదాలో తేడా ఉండవచ్చేమో కానీ.. ఆయన వ్యవహారశైలిలో మాత్రం.. ఎలాంటి మార్పు ఉండదు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను.. తన విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపుతూ.. తీసుకున్న నిర్ణయంతో ఆయన ఒక్క సారిగా హాట్ టాపిక్ అయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నమ్మిన సిద్ధాంతానికి.. విలువకు.. కట్టుబడి వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మృధుస్వభావి… గట్టి సంకల్పం..!

శాసనమండలి సమావేశాలను.. గతంలో ఎవరూ సీరియస్‌గా తీసుకునేవారు కాదు. అక్కడ చైర్‌లో ఎవరుంటున్నారు.. ఏం చేస్తున్నారనేదానిపై.. ప్రజలు పెద్దగా ఫోకస్ పెట్టేవారు కాదు. కానీ.. రెండు రోజుల నుంచి మండలినే… అసెంబ్లీలా అయిపోయింది. దాంతో సభ జరుగుతున్న తీరు ప్రజల్లోకి వెళ్లింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని శైలి… మండలి చైర్మన్ షరీఫ్ శైలి చూసి.. చాలా మంది ఆశ్చర్యపోయారు. వైసీపీ నేతలతో.. షరీఫ్ అలా .. సుతిమెత్తగా.. మృదువుగా వ్యవహరిస్తే పరువు తీసేస్తారని.. ఆయన మనస్థాపంతో వైసీపీకి అనుకూలంగా నిర్ణయం తీసేసుకుంటారని చాలా మంది అనుకున్నారు. అనుకున్నట్లుగానే వైసీపీ మంత్రులు.. సభ్యులు కాకపోయినప్పటికీ.. 20మందికిపై మండలిలోకి వచ్చారు. పోడియం చుట్టుముట్టారు. అనరాని మాటలన్నారు. సంగతి తేలుస్తామన్నారు. అన్నింటినీ విన్నారు. ఎక్కడా ఆవేశ పడలేదు. అలాగని లొంగిపోలేదు కూడా. తను తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారు.

హీరోలనుకున్న వాళ్లు జీరోలు..! షరీఫ్ రియల్ హీరో..!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వచ్చిన బెదిరింపులకు కావొచ్చు.. అధికార ఆశ కావొచ్చు.. తాము.. ఎదురొడ్డి పోరాడి పైకొచ్చామని చెప్పుకున్న వాళ్లంతా.. కాడి దించేశారు. వల్లభనేని వంశీ, పోతుల సునీత లాంటి వాళ్లు.. తాము పరిటాల రవి వర్గీయులమని.. ఆయన తమకు పోరాటం నేర్పించారని చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. వారు భయపడి.. వెళ్లిపోయి.. జగన్ క్యాంప్‌లో చేరిపోయారు. తమను ఎదిరిస్తే వైసీపీ ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందో.. ఆత్మహత్య చేసుకున్న టీడీపీ నేతలను గుర్తుకు చేసుకుంటేనే అర్థమైపోతుంది. దానికి తగ్గట్లే మంత్రులు మండలిలో షరీఫ్‌ను బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారంటేనే.. ఏ స్థాయిలో వారి ఒత్తిళ్లు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కానీ.. షరీఫ్.. అలాంటి బెదిరింపులకు లొంగలేదు. తాను చూడటానికి మృదుస్వభావినే కానీ.. మనసు మాత్రం బలహీనం కాదని నిరూపించారు.

ఎన్టీఆర్ అభిమాని.. టీడీపీ విధేయుడు..!

ఎం.ఎ. షరీఫ్ పేరు చాలా మంది టీడీపీ నేతలకు కూడా తెలియదు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గానికి చెందిన షరీఫ్ పదవుల గురించి ఆలోచించకుండా టీడీపీలో సుదీర్గ కాలంగా ఉన్న నేత. సుదీర్ఘ కాలం అంటే.. టీడీపీ స్థాపించినప్పటి నుండి ఆయన పార్టీలోనే ఉన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి నడిచారు. చాలా కాలం పాటు పదవులు రాకపోయినా ఆయన ఎప్పుడూ అసంతృప్తి చెందలేదు. చంద్రబాబు ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు. తర్వాత ఎమ్మెల్సీని చేశారు. ఎన్నికలకు ముందు మంత్రివర్గాన్ని విస్తరించాలనుకున్నప్పుడు.. షరీఫ్ పేరు మంత్రి పదవికి ప్రచారంలోకి వచ్చింది. అయితే సమీకరణాల్లో మండలి చైర్మన్ పోస్టును చంద్రబాబు ఖరారు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com