సంక్రాంతి అనగానే సినిమాలన్నీ వరుస కట్టేయడం మామూలే. స్టార్ హీరోల నుంచి.. మీడియం రేంజ్ హీరోల వరకూ అందరి చూపూ పొంగల్ సీజన్ పైనే ఉంటుంది. ప్రతీ యేడాదీ కనీసం 4 సినిమాలైనా ఈ సీజన్లో సందడి చేయడం షరా మామూలుగా మారిపోయింది. అయితే ఈసారి.. ఈ అంకె పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే చిరంజీవి (మన శంకర్ వర ప్రసాద్ గారు), ప్రభాస్ (రాజాసాబ్) సినిమాలు సంక్రాంతికి రావడానికి ఫిక్సయ్యాయి. రవితేజ (అనార్కలి) కూడా ఈ సీజన్లోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. నవీన్ పొలిశెట్టి సినిమా `అనగనగా ఒక రాజు` సంక్రాంతి బరిలో నిలపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈనెలలో రావాల్సిన అఖండ నవంబరు, లేదా డిసెంబరులో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అయితే ఈ సినిమా సంక్రాంతికి ఫిఫ్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఎందుకంటే బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ బలంగా ఉంది. ఆయన ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందే అంటే దర్శక నిర్మాతలు కాదనలేరు. తమిళం నుంచి విజయ్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమా కూడా ఈ సంక్రాంతికే విడుదల అవ్వబోతోంది. ఇవి రెండూ డబ్బింగ్ సినిమాలే అయినా, తెలుగు మార్కెట్ పై ప్రభావం చూపించగలవు.
వీటితో పాటుగా ఇప్పుడు శర్వానంద్ కూడా సమరానికి సై అంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. శర్వా కొత్త సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్సయ్యార్ట. ఇదో ఫ్యామిలీ డ్రామా. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు బాగా వర్కవుట్ అవుతాయని జనాల నమ్మకం. పైగా శర్వానంద్ `శతమానం భవతి` సంక్రాంతికే విడుదలై పెద్ద హిట్ అయ్యింది. అందుకే ఆ సెంటిమెంట్ ని ఈసారీ ఫాలో అవ్వాలనుకొంటున్నారు.
సంక్రాంతి సీజన్లో ఉన్న మ్యాజిక్కే వేరు. ఓ యావరేజ్ సినిమా కూడా హిట్టయిపోతుంది. హిట్టయితే కలక్షన్లకు అడ్డు ఉండదు. కాబట్టి అందరి గురీ దీనిపైనే. కాకపోతే శర్వానంద్ ఇప్పుడు కాస్త వెనుకబడ్డాడు. ఈమధ్య అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. ఇలాంటి సందర్భంలో రిస్క్ తీసుకోవడం ఇబ్బందే. టాప్ స్టార్లంతా రంగంలో ఉన్నప్పుడు వాళ్లతో పోటీకి దిగి నలిగిపోవడం ఎందుకు అనిపిస్తోంది. మరి,, మేకర్స్ ధైర్యం ఏమిటో?