చిన్న సినిమాలు ఈమధ్య ఓవర్సీస్ లో దుమ్ము దులుపుతున్నాయి. పెళ్లి చూపులు సినిమాని అక్కడ ఇరవై లక్షలకు కొన్నార్ట. ఇప్పుడు ఆరు కోట్లు వసూలు చేసింది. పెళ్లి చూపులు మ్యాజిక్ చూసి… ఇప్పుడు ఓవర్సీస్లో చిన్న సినిమాల్ని కొనడానికి ఎగబడుతున్నారు. నాని సినిమా మజ్ను రూ.3 కోట్లకు ఆల్రెడీ అమ్ముడు అయిపోయింది. ఇప్పుడు శర్వానంద్ సినిమాకీ మంచి రేటు పలికిందని సమాచారం. రన్‌రాజారన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్ రాజా.. ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు శర్వానంద్. సినిమా సినిమాకీ అతని రేంజ్, మార్కెట్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. కరుణాకరన్ శిష్యుడు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి అప్పుడే క్రేజ్ మొదలైపోయింది. ముందస్తుగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు మంచి ధరకు అమ్ముడుపోయాయని సమాచారం.
నిర్వాణ సినిమాస్ సంస్థ 2.25 కోట్లకు ఈ సినిమా హక్కుల్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. శర్వా పరంగా ఇది మంచి రేటే. ఇందులో తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు శర్వానంద్. పోలీస్ పాత్రే అయినా.. సరదాగా సాగిపోయే సినిమా అని, ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలు ఓవర్సీస్లో బాగా ఆడతాయన్న నమ్మకంతో శర్వా సినిమాని అంత రేటు పెట్టి కొన్నారని తెలుస్తోంది. మొత్తానికి మంచి రేట్లతో శర్వా కూడా పండగ చేసుకొంటున్నాడు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.