రాజకీయాల్లో వ్యూహం ఫలించకపోతే ఎంతటి హేమాహేమీలైనా రెంటికి చెడ్డ రేవడి లా మిగిలిపోతారనడానికి శశిథరూర్ ప్రస్తుత పరిస్థితి ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. శశిథరూర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంతకాలంగా కేరళ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం , కేరళలోని సీనియర్ నేతలు ఆయన దూకుడును అడ్డుకున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడం, సీఎం రేసులో తన పేరును పరిశీలించకపోవడంతో థరూర్ అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయన భావజాలం కొంత సాఫ్ట్ హిందుత్వ వైపు మళ్లింది.
బీజేపీతో దోస్తీ.. అటు ఇటు కాని పరిస్థితి
కేరళలో బలపడాలని చూస్తున్న బీజేపీకి థరూర్ వంటి గ్లోబల్ ఇమేజ్ ఉన్న నాయకుడు అవసరమని భావించి, ఆయనను ఆకర్షించే ప్రయత్నాలు జరిగాయి. థరూర్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రధాని మోదీ పనితీరును ప్రశంసించడం, బీజేపీకి దగ్గరవుతున్నారనే సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, కేరళలో ఉన్న ప్రత్యేక రాజకీయ సామాజిక పరిస్థితులు వల్ల ఆయన బహిరంగంగా బీజేపీ కండువా కప్పుకోవడానికి వెనుకాడారు. అటు కాంగ్రెస్‌లో పట్టు కోల్పోయి, ఇటు బీజేపీలో చేరలేక ఆయన ఒక సందిగ్ధ స్థితిలో చిక్కుకుపోయారు.
ఎన్నికల వేళ సందడి లేని నాయకుడు
ప్రస్తుతం కేరళలో ఎన్నికల వాతావరణం వేడెక్కినా, ఒకప్పుడు స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న శశిథరూర్ ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. అటు బీజేపీ శ్రేణులు ఆయనను తమవాడిగా గుర్తించడం లేదు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఆయనపై నమ్మకాన్ని కోల్పోయి పక్కన పెట్టేశాయి. తనకున్న మేధో సంపత్తి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కేరళ రాజకీయాల్లో సీఎం పదవిని తెచ్చిపెడతాయని ఆయన ఆశించారు కానీ, క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలను అంచనా వేయడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్‌లోనే ఉండి ఓపిక పట్టి ఉంటే కనీసం రేసులో ఉండే అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అడ్రస్ లేని కేరళ సీఎం కల
శశిథరూర్ అటు సొంత పార్టీలో తిరుగుబాటుదారుడిగా ముద్రపడి, ఇటు ప్రత్యర్థి పార్టీకి పూర్తిస్థాయిలో దగ్గర కాలేక తన రాజకీయ ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఆయన ఇప్పుడు ఐసోలేషన్ లో ఉన్నారు. ఒక మేధావిగా ఆయనకు ఉన్న గౌరవం అలాగే ఉన్నప్పటికీ, ఒక రాజకీయ నాయకుడిగా అధికారాన్ని చేజిక్కించుకోవడంలో ఆయన అనుసరించిన వైఖరి ఆయన కెరీర్‌కు గొడ్డలిపెట్టుగా మారింది. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.
