హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. శివోం ప్రాజెక్ట్స్ అనే కంపెనీ తమకు ప్రిలాంచ్ పేరుతో ప్లాట్లు అమ్మి మోసం చేసిందని కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రీలాంఛ్ పేరుతో రూ. 50 కోట్లు వసూలు చేసిన శివోం రియల్ ఎస్టేట్ సంస్థ తర్వాత పట్టించుకోవడం మానేసింది. జీడిమెట్ల పరిధిలో 3 ఎకరాల 35 గుంటల స్థలంలో అపార్టుమెంట్లు కడుతున్నామని చెప్పింది. డెవలప్ మెంట్ చేయకుండానే ప్లాట్లుగా అమ్మేసిన శివోం సంస్థ ..తర్వాత పట్టించుకోలేదు. డబ్బులు కట్టిన వాళ్లు అడిగితే ఎక్కడో రాళ్లు- రప్పలు, ముళ్లపొదలతో భూమిని చూపించిన శివోం.. సంస్థపై కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2017లో ఈ సంస్థ ఆకర్షణీయమైన బ్రోచర్లు వేసింది. సింగపూర్, జపాన్ టెక్నాలజీతో ఇంటీరియర్స్ చేస్తామని క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల, జిమ్, గేమింగ్ జోన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారని కొనుగోలుదారులు అంటున్నారు. రెరా, హెచ్ ఎండీఏల నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారని ఆరోపించారు. ప్రీలాంచ్ పేరుతో సింగిల్ పేమెంట్ కు తక్కువ రేటు అని చెప్పి డబ్బులు వసూలు చేశారని ఇప్పుడు ఏదీ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోసపోయామని లబోదిబోమంటున్నారు.
ఇసుకపట్ల సాంబమూర్తి అనే వ్యక్తి పేరు మీద 2017లోనే శివోం రియల్ ఎస్టేట్ ప్రారంభమయింది. ఇతనికి మరికొన్ని కంపెనీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే..నేరాలు పెరుగుతూనే ఉంటాయని అమాయకుల్ని మోసం చేస్తూనే ఉంటారన్న విమర్శలు వస్తున్నాయి. తక్కువ ధరల పేరుతో ప్రీలాంచ్ ఆఫర్లను నమ్మవద్దని చెబుతున్నా..కొంత మంది మాత్రం మోసపోతూనే ఉన్నారు.