మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. న్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నర్సయ్య పాత్రను పోషిస్తున్నారు. ఆయన స్వయంగా ఇల్లెందుకు వచ్చి నర్సయ్యను కలిశారు. పాల్వంచలో సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. గుమ్మడి నర్సయ్య ప్రజల మనిషిని.. ఆయన ముందు తాను కూడా పావలా వంతు చేయలేనని అన్నారు. ఈ సినిమా ద్వారా ప్రజా ప్రతినిధులు జీవితాల్లో మార్పు వస్తుందని భావిసున్నానన్నారు.
నర్సయ్య జీవితం గురించి తెలుసుకుని రాజ్ కుమార్ నటించేందుకు అంగీకరించారు. గుమ్మడినర్సయ్యను బెంగళూరు పిలించుకునే అవకాశం ఉన్నా.. అలాంటి వ్యక్తులను పిలిపించుకోవడం కన్నా.. వెళ్లడం గౌరవం అని పాల్వంచ వచ్చారు. ఆ గౌరవానికి గుమ్మడి నర్సయ్య అర్హుడేనని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు.
వామపక్ష ఉద్యమమే జీవితంగా పనిచేసిన సీపీఐ (ఎంఎల్) పార్టీ అంటే గుర్తుకొచ్చేది గుమ్మడి నర్సయ్యే. విలువలు, నిరాడంబర జీవితం ఆయన సొంతం. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. నాటి నుంచి ఇప్పటివరకు అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. గుమ్మడి నర్సయ్య పాతికేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఒక్క పైసా కూడా సంపాదించుకోలేదు. ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే జీతం కూడా పార్టీకే ఇచ్చేశారు. ఇప్పుడు వచ్చే పెన్షన్లో ఆయన కొంత తన జీవితావసరాలకు ఉంచుకుని మిగతాది పార్టీకే ఇచ్చేస్తారు.
1983 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అప్పట్లో ప్రజల్లో మమేకమైతేనే పార్టీలు సీట్లు ఇచ్చేవి . పోటీచేసే వ్యక్తిని జనం అదే రీతిలో సొంతం చేసుకునే వాళ్లు. 1994 నుంచి రాజకీయాలు మారిపోయాయి. డబ్బు స్వామ్యం వచ్చింది. దాంతో గుమ్మడి నర్సయ్య వెనుకబడిపోయారు. కానీ ఆయన మాత్రం తన పంధా మార్చుకోలేదు.