గుమ్మడి నర్సయ్య… పేరుకి ఎం.ఎల్.ఏ. కానీ… డొక్కు సైకిల్, అరిగిన చెప్పులు, రాజ్యాంగం.. ఇవే అతని ఆస్తులు. ఆడంబరాలకు దూరం. నిజాయితీకి అతి దగ్గర. మంచితనం, మానవత్వం మూర్తీభవించిన ప్రజా నాయకుడు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఇలాంటి ప్రజా సేవకుడ్ని, నాయకుడ్ని భారతదేశం చూసి ఉండదు. అలాంటి’ గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ తెరపైకి వస్తోంది. ఆ పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సురేష్ రెడ్డి నిర్మాత. ఈరోజే మోషన్ పోస్టర్ విడుదల చేశారు. గుమ్మడి నర్సయ్య వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ మోషన్ పోస్టర్ డిజైన్ చేశారు. ఆ పాత్రలో… శివ రాజ్ కుమార్ ఒదిగిపోయినట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. ఎన్టీఆర్‌ని ప్రతిబింబించే ఓ క్యారెక్టర్ ని కూడా ఈ మోషన్ పోస్టర్ లో చూపించారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు, రాష్ట్ర సామాజిక స్థితిగతులకు అద్దం పట్టేలా ఈ సినిమా రూపొందించారన్న సంకేతాలు మోషన్ పోస్టర్ తో కలిగించింది చిత్రబృందం.
ఇప్పటి వరకూ తెలుగు తెరపై చాలా బయోపిక్‌లు వచ్చాయి. కానీ.. ఇది రావాల్సిన బయోపిక్. నాయకుడంటే ఎలా ఉండాలి? ప్రజా పాలన అంటే ఏమిటి? అనే విషయాలు ఈనాటి నేతలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి స్ఫూర్తివంతమైన కథలు మరుగున పడిపోకూడదు. ఆర్థికపరంగా ఈ సినిమా ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. కానీ… ఓ మంచి ప్రయత్నం అయితే తప్పకుండా జరుగబోతోందన్న భరోసా అయితే కలిగింది.