ఇండియాలో పాకిస్థానీ కళాకారులపై “ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్” నిషేధం విధించింది. ఆ విషయాన్ని ఖండిస్తూ… “వారంతా వర్క్ పర్మిట్లు తీసుకునే ఇండియా వచ్చారని, వారికి ఆ అనుమతి ఉందని” సల్మాన్ ఖాన్ తెలిపారు. అక్కడ నుండి సల్మాన్ పై వరుసగా విమర్శల దాడులు జరుగుతూనే ఉన్నాయి. వరుసపెట్టి సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేతలు.
ఈ విషయంలో “చాలా మంది వెనకేసుకొస్తున్నట్లుగా పాకిస్థానీ కళాకారుల్లో ఏ ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదని.. టూరిస్ట్ వీసా మీద వచ్చి సినిమాల్లో నటిస్తున్నారని.. ఇది పూర్తిగా చట్టవ్యతిరేక చర్య అని చెబుతున్నారు. ఇదే సమయంలో పాకిస్థానీ నటులు ఇండియాలో ఎక్కడకనిపించినా దాడులు చేస్తాం అని ఎంఎన్ఎస్ కీలక నేత అమేయ్ ఖోపర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!
ఇదే క్రమంలో ఇదే క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన నటీనటులంతా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ రెండు రోజుల అల్టిమేటం జారీచేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే సల్మాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ గట్టి వార్నింగే ఇచ్చారు. మన దేశంలో నటీనటుల కొరత ఉందా? అసలు పాకిస్థానీ నటులు మన సినిమాల్లో పనిచేయాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదు అని మొదలుపెట్టిన రాజ్ ఠాక్రే… మన కోసం సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న వాళ్లంతా ఆయుధాలు కింద పడేస్తే ఏమవుతుంది? సరిహద్దులను కాపాడేది సైన్యమా, సల్మానా అని ప్రశ్నించారు. సల్మాన్ కు మరీ అంత ఇబ్బందిగా అనిపిస్తే అతడి సినిమాలను కూడా నిషేధిస్తాం అని ప్రకటించారు.
ఇదే విషయంపై తాజాగా శివసేన కూడా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై తనదైన ఫైరింగ్ చేసింది. పాకిస్థాన్ నటీనటులపై అంత ప్రేమ ఉంటే ఆయన్ను కూడా పాకిస్థాన్ కే వెళ్లమనండి అని అనేశారు శివసేన నేత మనీషా కయండే! “సల్మాన్ ఖాన్ కి గట్టిపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనకి పాకిస్థాన్ నటీనటులపై మరీ అంత ప్రేమ ఉంటే.. ఆయన్ను అక్కడికే వలస వెళ్లమనండి” అని అన్నారు మనీషా.
కాగా, ఈ రేంజ్ లో సల్మాన్ ని ఒకరితర్వాత ఒకరు డోస్ పెంచుతూ వాయించేస్తుంటే… కళాకారులకు ప్రాంతాలతోనూ, దేశాలతోనూ, భాషలతోనూ సంబందం ఏమి ఉంటుందని మరికొందరు సల్మాన్ వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు.