కోహ్లీ రిటైరయ్యాడు.. రోహిత్ శర్మ దూరమయ్యాడు. బుమ్రా కూడా అందుబాటులో లేడు. గిల్ కుర్రాడు.. కెప్టెన్సీ ఇచ్చారు.. అనుభవం లేదు.ఎలా అని అందరూ మథనపడిపోయారు. కానీ ఇంగ్లాండ్‌లో వారెవరూ ఉన్నా లేకపోయినా ఆట మాత్రం మారదని నిరూపించేశారు. ఓ టెస్టులో విజయం దగ్గరకు వచ్చి చిన్న చిన్న తప్పులతో… మిస్ అయినా .. ఆ తప్పుల్ని వేగంగా సవరించుకున్నారు. రెండో టెస్టులో అలవోకగా రికార్డుల మీద రికార్డులు నెలకొల్పి సునాయాస విజయం సాధించారు. ఇంగ్లాండ్ లో గతంలో ఎన్నడూ సాధ్యం కాని నిఖార్సైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
రెండో టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచింది. ఓ టెస్టు మ్యాచ్‌లో విజయాన్ని అస్వాదించాలంటే మ్యాచ్ ఎలా జరగాలో ఖచ్చితంగా అలాగే జరిగింది. ఎక్కడా తోట్రుపాటు లేదు. కంగారు లేదు. చాలా పద్దతిగా విజయాన్ని చెక్కుకుంటూ వెళ్లారు. ఈ విజయంలో కెప్టెన్ శుభమన్ గిల్ది కీలక పాత్ర. ఓ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, మరో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి పిల్లర్‌గా నిలబడ్డారు. మిగతా ఆటగాళ్లూ .. తక్కువగా ఆడలేదు. తమ పాత్రను తాము ఖచ్చితంగా పోషించారు. దాంతో విజయాన్ని అందుకున్నారు.
సాధారణంగా ఇంగ్లాండ్ టూర్ అంటే.. భారత ఆటగాళ్లకు అక్కడి పేస్ పిచ్‌లు సమస్యగా మారుతాయి. టపాటపా వికెట్లు పడిపోయే టెస్టు మ్యాచుల్ని ఎన్నో చూశారు. కానీ ఇప్పుడు అంతా యువ ఆటగాళ్లు.. ఆ పేస్..ఇంగ్లిష్ పిచ్‌లు తమకు పెద్ద సమస్య కాదని.. ఆటతోనే నిరూపిస్తున్నారు. అలవోకగా పరుగులు సాధిస్తూ… టీం అంతా మారిపోయిందని సంకేతాలిస్తున్నారు. బౌలింగ్ లో ఆకాశ్ దీప్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి పది వికెట్లు తీసి.. ప్యూచర్ బౌలర్‌గా నిరూపించుకున్నారు. ఎంత దిగ్గజం ఆటగాడికైనా.. ప్రత్యామ్నాయం ఉంటుందని కుర్రాళ్లు నిరూపించారు.
ఇంగ్లాండ్ పై సాధించిన విజయం.. విదేశాల్లో భారత్ సాధించిన అతి ఎక్కువ పరుగుల తేడా విషయం. అంతే కాదు ఇంత వరకూ ఎడ్జ్ బాస్టన్లో భారత్ గెలవలేదు. ఇప్పుడే ఆ విజయం సాకారం అయింది. ఎలా చూసినా భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ప్రారంభమయిదన్న సంకేతాలను గిల్ నేతృత్వంలో టెస్టు టీం ఇచ్చింది.