టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో టీమిండియా నమ్మకమైన ఓపెనర్‌గా ఎదిగిన గిల్, మెగా టోర్నీకి ఎంపికవుతాడని అందరూ భావించారు. సెలెక్టర్లు ఆయనను ప్రధాన జట్టులోకి తీసుకోకుండా కేవలం నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాకే పరిమితం చేశారు.
శుభ్‌మన్ గిల్‌ను 15 మంది సభ్యుల ప్రధాన జట్టులోకి తీసుకోకపోవడం సెలెక్షన్ కమిటీకి అత్యంత కఠినమైన నిర్ణయమని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చారు. టీమ్ కాంబినేషన్ , టాప్ ఆర్డర్లో వికెట్‌కీపర్ అవసరం అని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ , కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెబుతున్నారు. టాప్ ఆర్డర్లో వికెట్‌కీపర్-బ్యాటర్ ఉంటే జట్టుకు మరిన్ని ఆప్షన్లు లభిస్తాయని అందుకే సంజూ శాంసన్ , ఇషాన్ కిషన్‌లను ప్రాధాన్యత ఇచ్చారు. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా కూడా ఆడగలడు, ఇది జట్టు బ్యాలెన్స్‌కు బాగా సరిపోతుంది.
గిల్ ఫామ్‌పై ఇటీవల చాలా విమర్శలు వస్తున్నాయి. గిల్ 2025లో టీ20ల్లో పరుగులు సాధించలేకపోయాడు. ఆసియా కప్ తర్వాత వచ్చిన సిరీస్‌ల్లో తక్కువ స్కోర్లు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా టీ20 స్టాండర్డ్స్‌కు తగ్గట్టు లేదు. అతను క్వాలిటీ ప్లేయర్ కానీ ఇప్పుడు పరుగులు చేయడం లేదని అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఇషాన్ కిషన్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి రీ-ఎంట్రీ ఇచ్చాడు. రింకు సింగ్ కూడా తిరిగి వచ్చాడు. ఇది గిల్ స్థానాన్ని గల్లంతు చేసింది.
గిల్ టెస్ట్ , వన్డే కెప్టెన్ కావడంతో ఆయనకు టీ ట్వంటీ జట్టులో చోటు లభించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఆయన పరుగులు చేయకపోయినా బోలెడన్ని అవకాశాలు ఇస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక భరించలేకపోయారు.
