ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాలేదు! సరే, కేంద్రం మాట నిలుపుకోలేకపోయిందో, రాష్ట్రం సాధించుకోలేకపోయిందో అనేది వేరే చర్చ. గుడ్డిలో మెల్ల అన్నట్టు ఏదో ప్యాకేజీ అయితే వచ్చిందనే అంటున్నారు! కానీ, వచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత చాలా అవసరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ముందు రోజు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమై ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నారు కూడా! ఈ సమావేశాల్లో భాజపా సర్కారుపై ఒత్తిడి పెంచి, ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధత సాధించుకోవాలని అనుకున్నారు. సాధించుకున్న ప్యాకేజీకి చట్టబద్ధత వస్తేనే దాని సార్థకత అని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. అయితే, కేంద్రంపై ఇలా పోరాటానికి ప్రిపేర్ అవుతున్నారో లేదో… పెద్దగా పోరాటం అవసరం లేకుండానే ప్యాకేజీకి చట్టబద్ధత వచ్చేసిందని చెప్పాలి!
ప్యాకేజీ చట్టబద్ధత గురించి ఆంధ్రప్రదేశ్ భాజపా వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్యాకేజీకి చట్టబద్ధతకు సంబంధించి ఒక గొప్ప లాజిక్ చెప్పారు! అదేంటంటే… ప్రత్యేక ప్యాకేజీకి మొదట్నుంచీ చట్టబద్ధత వచ్చేసినట్టే అన్నారు! అదెలా అని అడిగితే… ఎప్పుడైతే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్యాకేజీ వివరాలను ప్రకటించారో, ఆ క్షణమే దానికి చట్టబద్ధత వచ్చేసినట్టు లెక్క అన్నారు. అరుణ్ జైట్లీ ఏది మాట్లాడితే దానికి చట్టబద్ధత దానికదే వచ్చేసినట్టు భావించాలనీ, కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అంటే, ఆర్థికమంత్రి మాట్లాడారు కాబట్టి చట్టబద్ధత వచ్చేసినట్టే అన్నమాట. ప్రత్యేకంగా దాని గురించి తెలుగుదేశం మళ్లీ పోరాడాల్సిన పనిలేదన్నమాట. తెలుగుదేశం పోరాటానికి ఫలితం లభించేసిందని ప్రచారం చేసేసుకుంటే బెటర్! ఎందుకంటే, ప్యాకేజీకి చట్టబద్ధత అంటే మామూలు విషయమా..!
సరే, సిద్ధార్థ్ సింగ్ చెప్పింది బాగానే ఉంది. కానీ, ఇక్కడో లాజిక్ మిస్ అయ్యారు. అదేంటంటే… ఆర్థికమంత్రి హోదా అరుణ్ జైట్లీ ఏది మాట్లాడినా దానికి చట్టబద్ధత వచ్చేస్తుందని అన్నారు కదా! మరి, ప్రధానమంత్రి హోదాలో నాడు రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేశారు. దానికి చట్టబద్ధత ఉన్నట్టా లేనట్టా..? పోనీ.. కాంగ్రెస్ అధికారం కోల్పోయి భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చాలాసార్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ప్రత్యేక హోదా వచ్చేస్తోందని చెప్పారు. ఇదిగో అదిగో ప్రకటన వెలువడుతోందనీ చెప్పారు. మరి, ఆయన మాటలకు చట్టబద్ధత ఉందా లేదా..? మరి, ఈ పాయింట్స్ ఎలా మిస్సయ్యారు..!