సినిమా ప్రమోషన్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమా ప్రచారం చేసే క్రమంలో ఇంటర్వ్యూలు, క్యూఅండ్ఏలు, పాడ్‌కాస్ట్‌లు వంటి అనేక రూపాల్లో సృజనాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమా, అందులోని కంటెంట్‌ను ప్రేక్షకుల దగ్గరికి చేర్చడమే ఈ స్ట్రాటజీల ప్రధాన లక్ష్యం.
అయితే ఈ లక్ష్యం పక్కదారి పడుతోంది. సోషల్ మీడియాలో “రీచ్” రావాలనే తాపత్రయంతో కొందరు జర్నలిస్టులు సినిమా ప్రమోషన్లను తమ స్వీయ ప్రమోషన్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. “ఎనీ పబ్లిసిటీ గుడ్ పబ్లిసిటీ” అన్న తత్వంతో ట్రోల్ అయినా పర్వాలేదు కానీ వైరల్ కావాలనే వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల చేత చీవాట్లు తింటున్నారు.
ఇటీవలే ఓ పాత్రికేయుడు మంచు లక్ష్మీకి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మరో మహిళా జర్నలిస్టు జుగుప్సాకరమైన ప్రశ్నలతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఆమె హీరో ప్రదీప్ రంగనాథన్‌ను “మీరు హీరో మెటీరియలా?” అని ప్రశ్నించింది. సిద్దు జొన్నలగడ్డను “మీరు విమెనైజరా?” అని ప్రశ్నించింది. ‘తెలుసు కదా’ ట్రైలర్ ఆధారంగా ఆ ప్రశ్న వేసింది. ఈ రెండు ప్రశ్నలూ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ ప్రశ్నలు వ్యక్తిగతమైనవైనా, వాటివల్ల మొత్తం ఫిల్మ్ జర్నలిజం మీద మచ్చ పడింది.
తాజాగా హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ విషయం గురించి మాట్లాడుతూ తన అసహనం వ్యక్తం చేశాడు. “కొంతమంది మైక్ పట్టుకుంటే ఒక పవర్ ఫీల్ అవుతున్నారు. ఏదిపడితే అది అడగొచ్చనే లెక్కలేనితనం కనిపిస్తోంది. ఇది సరైంది కాదు. ఒక సినిమా ట్రైలర్ చూసి అలాంటి ప్రశ్న అడగడం వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాం కదా అని ఏది పడితే అది అడగడం మంచిది కాదు,” అని ఆవేదన వ్యక్తం చేస్తూనే క్లాస్ తీసుకున్నాడు.
సిద్దు ఆవేదనలో అర్థం ఉంది. ఒక నటుడు ఎంతో కష్టపడి ఒక స్థాయికి చేరుకుంటాడు. తన కష్టాన్ని, ప్రతిభను, వినోదాన్ని ప్రజల దగ్గరికి చేర్చడంలో మీడియా ఒక వారధిగా ఉండాలి. ఇది జర్నలిస్టుల బాధ్యత, కర్తవ్యం. కానీ ఆ బాధ్యతను పక్కన పెట్టి ఒకరిని కించపరిచే విధంగా వ్యవహరించడం సరికాదు. ఎదురుగా క్రేజ్ ఉన్న హీరో ఉన్నాడని, ఓ వింత ప్రశ్న వేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి ఫేమ్ తెచ్చుకోవాలనే తాపత్రయం వల్ల జరుగుతున్న వైపరిత్యం ఇది.
నిజానికి కళాకారులు, జర్నలిస్టుల మధ్య పరస్పర గౌరవంతో కూడిన బంధం వుంటుంది. మంచి సినిమాలను గుర్తించి సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారా పరిశ్రమ అభివృద్ధికి స్ఫూర్తినిచ్చే మాధ్యమంగా ఫిల్మ్ జర్నలిజం నిలుస్తుంది. కానీ కొందరు చేస్తున్న ఈ విపరీత చర్యల వలన మొత్తం ఫిల్మ్ జర్నలిజంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ విషయాన్ని ఫిల్మ్ జర్నలిస్టుల సంఘాలు కూడా ఆలోచించుకోవాలి.