ప్రీరిలీజ్ ఈవెంట్స్ స్పీచులు పరమ రెగ్యులర్ గా వుంటాయి. మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ మేకప్ మ్యాన్ తో మొదలుపెట్టి డైరెక్టర్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మొదలుపెట్టి హీరో వరకూ వచ్చేసరికి పుణ్యం కాలం కాస్త గడిచి ఉత్సాహం సన్నగిల్లుతుంది. పాడిందే పాడరా అన్నట్టుగా వుంటుంది వ్యవహారం. ఎదో గౌరవార్థం అన్నట్టుగా సాగుతుంటాయి మాటలు. కానీ అప్పుడప్పుడు కొందరు చాలా కొత్తగా ఆలోచిస్తారు. స్పీచ్ ని కూడా క్రియేట్ గా ప్రిపేర్ అవుతారు.
తాజాగా సిద్దు జొన్నలగడ్డ అలాంటి ఓ క్రియేటివ్ స్పీచ్ ని వదిలాడు. తెలుసు కదా ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా కంటెంట్ ని ఎమోషనల్ గా ప్రజెంట్ చేశాడు. ‘తెలుసు కదా’లో వరుణ్ క్యారెక్టర్ ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వైలెన్స్ ని క్రియేట్ చేస్తాడని తన పాత్రపై హైప్ పెంచాడు. సినిమాని బెర్ముడా ట్రైయాంగిల్ తో పోల్చి ఈ సినిమా చూసిన అందరినీ తనలోకి లాగేస్తుందని చెప్పాడు.
అమ్మాయిలు అబ్బాయిలు టాపిక్ తీసుకొచ్చి మీ ముందు మేము చాలా తక్కువ అన్నాడు. ఒక అమ్మాయి వదిలి వెళిపోతుందంటే పోనివ్వండి. వెంటపడితే మన మీద రెస్పెక్ట్ తగ్గిపోతుందని, అలా ఆత్మ గౌరవం తగ్గే పని చేయకూడదని సలహా ఇచ్చాడు. దీపావళికి వస్తున్న అన్ని సినిమాలు విజయం సాధించాలనే రెగ్యులర్ లైన్ కాకుండా మంచి సినిమా విన్ అవ్వాలని ఆకాంక్షించాడు. మొత్తానికి రెగ్యులర్ కి భిన్నంగా సాగిన సిద్దు స్పీచ్ ఈవెంట్ లో హైలెట్ గా నిలిచింది.