సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త క్రెడిట్ వార్ కు తెరలేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్న ఈ ప్రాజెక్టు తమ ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకుందని, దీనికి కావాల్సిన 62 ఎకరాల భూమిని తామే సేకరించామని బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా హరీశ్ రావు గట్టిగా వాదిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఏ అభివృద్ధి పని జరిగినా అది మా ఘనతే అని చెప్పుకోవడమే బీఆర్ఎస్ ప్రధాన వ్యూహంగా మారింది. ఈ తరహా ఓల్డ్ మోడల్ ప్రచారం ఇప్పుడు ఆ పార్టీకే ప్రతికూలంగా మారుతోంది.
పూర్తి చేసి ప్రారంభించినవారిదే క్రెడిట్
ప్రజల నాడిని గమనిస్తే, ఏ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు లేదా ఎవరు ప్రతిపాదించారు అనే సాంకేతిక అంశాల కంటే, ఎవరి హయాంలో అది ప్రజలకు అందుబాటులోకి వచ్చిందనే దానికే ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి చిన్న పనికీ మాదే క్రెడిట్ అని గగ్గోలు పెట్టడం వల్ల, ప్రజల్లో అది క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ. 1070 కోట్ల పనులను రేవంత్ సర్కార్ రద్దు చేసిందని హరీశ్ రావు ఆరోపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పోరాటాన్ని ప్రజలు అంత సీరియస్ గా తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మంచి జరిగితే మాదే..మాదే అంటూ తెరపైకి వస్తున్న బీఆర్ఎస్
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో మైనస్‌లు ఉంటే వాటిని ఎత్తిచూపడంలో సఫలమవుతున్న బీఆర్ఎస్, పాజిటివ్‌లన్నీ తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం ఆ పార్టీ ప్రచార లోపంగా కనిపిస్తోంది. మంచి జరిగితే మా వల్ల.. చెడు జరిగితే కాంగ్రెస్ వల్ల అనే ఈ పాత పద్ధతిలోని వాదన ప్రజలకు విసుగు తెప్పిస్తోందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో కొత్త సమస్యలపై పోరాటం చేయకుండా, కేవలం పాత పథకాలపైనే ఆధారపడటం వల్ల బీఆర్ఎస్ విపక్షంగా తన పట్టును నిరూపించుకోలేకపోతోందనే వాదన బలంగా ఉంది.
ఇప్పుడుచెప్పుకుంటే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు తెలిసేలా చేయాలి!
రేవంత్ రెడ్డి సర్కార్ రూ. 3,590 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ దూసుకుపోతుంటే, బీఆర్ఎస్ మాత్రం ఇంకా గతంలోనే ఉండిపోవడం ఆ పార్టీ కేడర్‌ను కూడా అయోమయానికి గురిచేస్తోంది. విపక్షంగా బీఆర్ఎస్ తన పోరాట శైలిని మార్చుకోకపోతే, భవిష్యత్తులో ఈ క్రెడిట్ వార్ ఆ పార్టీకి కేవలం ఆత్మరక్షణ చర్యగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజలకు కావాల్సింది ప్రస్తుత సమస్యలకు పరిష్కారమే కానీ, గతంలో ఎవరు ఏం చేశారనే చర్చ కాదని ఎక్కువ మంది అభిప్రాయం.


