హైదరాబాద్ శివారు పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అత్యంత ఘోర ప్రమాదాల్లో ఒకటి. ఎంతటి ఘోరం అంటే.. పది మందికిపైగా కనిపించకుండా పోయారు. డ్యూటీలకు వెళ్లే ముందు తమ ఫోన్లు, దుస్తులు పెట్టిన లాకర్లలో అవి అక్కడే ఉన్నాయి కానీ మనుషులు లేరు. కాలి బూడిదైపోయారు. కనీసం ఆనవాళ్లు పట్టనంతగా కాలిపోయారు. అంత ఘోర ప్రమాదం జరిగితే.. ప్రభుత్వ స్పందన, ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందన, ఇంకా చెప్పాలంటే సామాన్య జనం స్పందన కూడా పట్టనట్లుగా ఉంది.అందుకే మీడియా కూడా బాధితుల గురించి పట్టించుకోవడంలేదు.
ప్రభుత్వ స్పందన పేలవం
సిగాచిలో జరిగింది చిన్న ప్రమాదం కాదు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ ప్రమాద స్థాయిలో స్పందించలేదు. అది ప్రైవేటు పరిశ్రమే కావొచ్చు కానీ అందులో వందల ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి. అయినా ప్రభుత్వ స్పందన అనుకున్నంత స్థాయిలో లేదు. రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ అంతే ఉంది. వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తరపున లక్ష సాయం చేశారు. ఆర్థిక సాయం పక్కన పెడితే ఇతర విషయాల్లో అయినా బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ.. ధైర్యం చెప్పాల్సిన బాధ్యతను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. కంపెనీ కోటి పరిహారం ప్రకటించింది. గల్లంతయిన వారి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
యాజమాన్యం తీరు మరీ ఘోరం
సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే పరిశ్రమ యాజమాన్యానిదే మొదటి బాధ్యత.కానీ యాజమాన్యం పారిపోయింది. ఎవరూ రాలేదు. పట్టించుకోలేదు. మూడో రోజు మాజీ డైరక్టర్ వచ్చి మేము ఇక్కడే ఉన్నామని చెప్పుకున్నారు. అంతకు ముందు కంపెనీ యాజమాన్యం ఎక్కడా అని సీఎం అడిగితే ఒక్కరూ రాలేదు. బాధితులకు కనీస సాయం అందించేందుకు ముందుకు రాలేదు. స్టాక్ మార్కెట్ కు మాత్రం.. కోటి ఇస్తున్నామని సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ అసలు ఎంత మంది డ్యూటీలో ఉన్నారు. ఎంత మంది చనిపోయారు.. ఎంత మంది గల్లంతయ్యారు అనే విషయాలు చెప్పేందుకు ముందుకు రావడం లేదు. గల్లంతయిన కార్మికుల కుటుంబ సభ్యులు పడిగాపులు పడుతున్నా పట్టించుకోవడంలేదు .
మీడియాలోనూ పెద్దగా కనిపించని సానుభూతి
నిజానికి ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మీడియా ఎన్నో కోణాల్లో విశ్లేషించి.. తప్పుఎక్కడ జరిగిందో.. బాధితులకు ఎలా న్యాయం చేయాలో.. బాధిత కుటుంబాల వేదనేంటో చెప్పేవి. కానీ పెద్దగా ప్రజల్లోనూ స్పందన లేకపోవడంతో.. తాము కూడా కథనాలను తగ్గించుకున్నామని మీడియా ప్రతినిధులు.. సోషల్ మీడియా ఖాతాల్లో చెబుతున్నారు. అంటే ప్రజల్లోనూ పెద్దగా సున్నితత్వం కనిపించలేదు.
పరిశ్రమలో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. చాలా కొద్ది మంది మాత్రం తెలుగు ప్రజలు ఉన్నారు. మా వాళ్లు కాదు కదా అని అందరూ లైట్ తీసుకున్నారేమో కానీ.. ఎవరివైనా ప్రాణాలే కదా అని మాత్రం బాధపడలేకపోయారు. అదే సమయంలో పరిహారం కోసం డ్రామాలు వేసేందుకు పెద్ద ఎత్తున చనిపోయిన వారి కుటుంబాలు వచ్చాయి. వారి వేషాలు మరింత చిరాకు తెప్పిస్తున్నాయి. ఇది సమాజంలో వస్తున్న స్పష్టమైన మార్పు అనుకోవాలేమో ?