ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ ప్రారంభించిన ఉద్యమంలో అసలు నిజాలను నిరూపించడానికి రాహుల్ గాంధీతో పాటు ఆయన పార్టీ నేతలు సిద్ధం కాలేకపోతున్నారు. బీహార్ లో స్పెషల్ ఇంటిన్సివ్ రివ్యూ ప్రక్రియతో ఈ వివాదం ప్రారంభమయింది. న్యాయపోరాటం కూడా చేశారు. సుప్రీంకోర్టు… తీసేసిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఆదేశించింది. ఆ ప్రకారం సీఈసీ ఓటర్ల జాబితాను రెండు రోజుల కిందట.. ప్రకటించింది. బీహార్ లో బూత్ లెవల్లో.. రాష్ట్ర లెవల్లో వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. మరి అంత భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగితే గగ్గోలు పెట్టాలి కదా. మరి ఎందుకు సైలెంటుగా ఉన్నారు?
తమ ఓటు గల్లంతయిదన్న ఫిర్యాదులు చాలా తక్కువ !
బీహార్లో తొలగించిన అరవై ఐదు లక్షల మందిలో తమ పేర్లు ఉన్నాయని, తాము బీహార్ లోనే ఉంటున్నామని అక్రమంగా తమ పేర్లను తొలగించాలన్న ఫిర్యాదులు రెండు రోజులైనా పెద్దగా రావడం లేదు. నిజానికి తన ఓటు కూడా లేదని ఆర్జేడీ వారసుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. కానీ ఆయనకు రెండు ఓట్లు ఉన్నట్లుగా తేలింది. అందులో ఓ ఓటు ఓటర్ కార్డు అసలు ఈసీనే జారీ చేయలేదు. ఫేక్ ది సృష్టించుకున్నారు. ఇలాంటి లోపాలతో ఉన్న ఓటర్ జాబితాను పూర్తిగా సవరించారు. చనిపోయిన వాళ్లు, వలసపోయిన వాళ్లు, డబుల్ ఓట్లు ఇలా అన్నింటినీ తొలగించారు. ఇది తప్పని ఎలా చెప్పగలరు?
బీహార్లో ఓట్ల చోరీ నిరూపించకపోతే రాహుల్ విశ్వసనీయత ప్రశ్నార్థకం
రాహుల్ గాంధీ చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే.. ఎన్నికలను నిర్వహించే రాజ్యాంగ వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకు ఓటర్లను గోల్ మాల్ చేస్తున్నారన్నది ఆయన ఆరోపణ. అలాంటిదేమీ లేదని.. పకడ్బందీగా చేస్తున్నామని.. ఫేక్ ఓటర్లను మాత్రమే తీసేస్తున్నామని ఈసీ అంటోంది. దాన్ని నిరూపించాల్సిన అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పా పైడింది. వారు అడిగినట్లుగా డిజిటల్ ఓటర్ల దాబితాను.. వెబ్ సైట్ లో పెట్టారు. ఆయా ఓటర్లను ఎందుకు జాబితా నుంచి తీసేశారో కూడా చెప్పారు. ఇప్పుడు ఓట్ల చోరీ చేశారని .. ఈసీపై తాము చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన అవసరం రాహుల్ ముందు ఉంది.
రాహుల్ చేతకాని తనాన్ని ఎన్నికల సంఘంపై రుద్దగలరా ?
రాహుల్ గాంధీ తమ వైఫల్యాలకు.. ఎన్నికల సంఘాన్ని బాధ్యుల్ని చేయాలనుకుంటున్నారు. హర్యానాలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా..బీజేపీ గెలిచిందని.. మహారాష్ట్రలో లోక్ సభలో తమకే అనుకూల ఫలితాలు వచ్చినా అసెంబ్లీకి మారిపోయాయని అనుకుంటున్నారు. కానీ రాజకీయం చేయడం చేతకాకపోతే.. ప్రజలతో ఓట్లు వేయించుకోకుండా అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు ఇలాగే రెస్పాండ్ అవుతారు. హర్యానాలో ఎలా ఓడిపోయారో కాంగ్రెస్ కు బాగా తెలుసు. అయినా తప్పు ఓట్ల జాబితా మీద వేస్తున్నారు. తమ చేతకాని తనాన్ని ఏసీపై రుద్ది.. ప్రజల్ని తాము ఓడిపోలేదని.. నమ్మించాలని అనుకుంటున్నారు. కానీ అలా చేయడం భారత ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేయడమే అవుతోంది. ఎన్నికలపై , ఎన్నికల సంఘంపై నమ్మకం తగ్గిస్తే ఎవరికి నష్టం ?