తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభమో.. మంత్రుల సిబ్బంది చేస్తున్న అరాచకమో పూర్తిగా బయటకు రాలేదు కానీ.. కొండా సురేఖ ఎపిసోడ్ ఓ రోజు హైవోల్టేజ్ రాజకీయాలను తెరపైకి తెచ్చింది. అర్థరాత్రి ప్రారంభమైన ఈ వ్యవహారం తర్వాత రోజు రాత్రి వరకూ ఎప్పుడేం జరుగుతుందా అన్నట్లుగా సీన్ మారిపోయింది. కానీ ఇప్పుడు అందరూ ఎవరికి వారు ఏమీ జరగనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొండా సురేఖ కూడా మంత్రి ప్రోటోకాల్ తో పర్యటిస్తున్నారు. సుమంత్ అనే ఓఎస్డీని అరెస్టు చేయడానికి ఇప్పుడు ప్రయత్నించడం లేదు. అంతా సర్దుబాటు అయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరి ప్రజలకు దీనిపై క్లారిటీ ఎవరు ఇస్తారు?
ఓ మంత్రి ఇంట్లో నిందితుడు ఉన్నాడు… ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెళ్లారు. ఆ నిందితుడు చేసిన పని గురించి ఎన్నెన్నో రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. గన్ పెట్టి పారిశ్రామికవేత్తల్ని బెదిరించారని.. ఆయనో వసూళ్ల కింగ్ అని చెప్పుకున్నారు. అదే సమయంలో కొండా సురేఖ కుమార్తె రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులపై బహిరంగ ఆరోపణలు చేశారు. అసలు గన్ రేవంత్ రెడ్డిదే అన్నారు. ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు కాదు. అందరూ సైలెంట్ అయిపోతే మర్చిపోయేవి కూడా కాదు.
అసలు సమస్య ఎక్కడ ప్రారంభమయింది.. ఎందుకు ప్రారంభమయింది.. బహిరంగంగా జరిగిన ఘటనల గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది . లేకపోతే ప్రజలు తమకు ఏది నచ్చితే అదే నిజం అనుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో పుకార్లను ప్రచారం చేయడమే పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వివాదాన్ని తాము పరిష్కరించుకున్నా సరే.. ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.